
భారత్ ను భయపెడుతున్న కరోనా ని నిలువరించడానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు నమోదు కావడంతో తీవ్ర కలకలమే రేగింది, అయితే, కరోనా బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో.. తిరిగి ఇంటికి పంపించారు వైద్యులు. ఇక, తాజాగా రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదైంది.. ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వెల్లడించారు, దింతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. దీనిపై హైలెవల్ కమిటీని నియమించామని.. అలాగే ఈ సాయంత్రానికి కేబినెట్ సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రజలకు కీలక ప్రకటన చేస్తామని తెలిపారు.
వ్యాధి ప్రబలితే ప్రజలకు మాస్క్ లు అందుబాటులో ఉంచుతామన్నారు. సాయంత్రం 6గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని… కేబినెట్ భేటీకి వైద్యాధికారులను పిలిచామని సీఎం తెలిపారు. అవసరమైతే రూ.5 వేల కోట్లు అయినా ఖర్చు చేస్తామని చెప్పారు.
మహారాష్ట్ర,కర్ణాటక,ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికె ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారని కేసీఆర్ గుర్తుచేశారు. ముంబై,భువనేశ్వర్,బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే షట్ డౌన్ ప్రకటించారని.. హైదరాబాద్ నగరం విషయంలోనూ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికైతే హైదరాబాద్ కు వచ్చిన ప్రమాదమేమీ లేదని.. కానీ ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొన్నిసార్లు నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.