Site icon OkTelugu

Jammu Kashmiri Pandits justice: జమ్ములో కశ్మీరి పండితులకు ఇన్ని రోజులకు జరిగిన న్యాయం

Jammu Kashmiri Pandits justice

Jammu Kashmiri Pandits justice

Jammu Kashmiri Pandits justice: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 అమలులో ఉన్న కాలంలో కశ్మీరీ పండితులపై జరిగిన అత్యాచారాలు, హత్యలు, నిర్బంధ గృహనిర్గమనం చరిత్రలో మరవలేని మచ్చ. ఆ సమయంలో వారి ఇళ్లు, భూములను స్థానిక నాయకులు, ఉగ్రవాదులు బలవంతంగా ఆక్రమించుకున్నారు. కొందరు నామమాత్ర ధరలకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ చీకటి చరిత్రకు తెరపడుతోంది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్‌ పండితులు వెనక్కి వస్తున్నారు. దీంతో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమించిన భూములు స్వాధీనం చేసుకుని కశ్మీరీ పండితులకు అప్పగించాలని నిర్ణయించింది. 3,500 ఎకరాల ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుని, వాటిని త్వరలోనే నిజమైన యజమానులైన కశ్మీరీ పండితులకు అప్పగించనుంది.

చీకటి చరిత్ర..
1990లలో ఉగ్రవాదం ఉధృతమైనప్పుడు కశ్మీరీ పండితులు లోయను వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉగ్రవాదులు కశ్మీరీ పండితులను చంపేశారు, మహిళలపై అత్యాచారాలు చేశారు. భయంతో లక్షల మంది తమ స్వంత గడ్డను వదిలి పారిపోయారు. వారు వెళ్లిపోయాక, వారి ఇళ్లు, వ్యవసాయ భూములను స్థానికులు, ఉగ్రవాదులు బలవంతంగా ఆక్రమించుకున్నారు. ఫారూఖ్‌ అబ్దుల్లా ప్రభుత్వం ఒక చట్టం చేసి, కశ్మీరీ పండితుల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. దీంతో, ఫారూఖ్‌ అబ్దుల్లా పార్టీ (నేషనల్‌ కాన్ఫరెన్స్‌) నాయకులే ఆ భూములను కొనుగోలు చేశారు. ఈ భూముల ఆక్రమణ కేవలం ఆర్థిక లాభం కోసం కాదు.. రాజకీయంగా కశ్మీరీ పండితులను శాశ్వతంగా లోయ నుంచి తరిమికొట్టడానికి కుట్రగా కూడా మారింది.

న్యాయం జరుగుతోంది..
ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కేంద్ర పరిపాలన ఈ అక్రమాలపై దృష్టి సారించింది. తాజాగా గణనీయమైన చర్యలు తీసుకుంది: కశ్మీర్‌ పరిపాలన మొత్తం 3,500 ఎకరాల ఆక్రమిత భూములను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఒక్క సోపియాన్‌ జిల్లా నుంచే 240 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అనేక కశ్మీరీ పండితుల ఇళ్లు, వ్యవసాయ భూములు ఉగ్రవాదులు, స్థానిక నాయకుల ఆక్రమణలో ఉన్నాయి. ఈ భూములను త్వరలోనే నిజమైన యజమానులైన కశ్మీరీ పండితులకు అప్పగించనున్నారు. దీని కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, పత్రాల పరిశీలన పూర్తి చేశారు.

3,500 ఎకరాల భూముల స్వాధీనం కశ్మీర్‌ చరిత్రలో ఒక మైలురాయి. ఆర్టికల్‌ 370 కాలంలో జరిగిన అన్యాయాలకు న్యాయం జరుగుతోంది. కశ్మీరీ పండితులు తమ స్వంత గడ్డపై తిరిగి కాలు మోపే రోజు దగ్గరలో ఉంది. ఇది కేవలం భూమి తిరిగి ఇవ్వడం కాదు.. గాయపడిన ఆత్మలకు న్యాయం చేయడం, కశ్మీర్‌లో శాశ్వత శాంతికి పునాది వేయడం.

Exit mobile version