Gali Janardhan Reddy : కర్ణాటకలో మరో కొత్త ‘గాలి’ వీచింది. ఊగిసలాటకు తెరదించుతూ మైనింగ్ కింగ్ కర్ణాటక రాజకీయాల్లోకి కొత్త పార్టీతో దిగారు. డబ్బు, పలుకుబడి ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి సొంత పార్టీని ప్రకటించారు. కొద్దిరోజులుగా సాగుతున్న కొత్త పార్టీ తంతును ఎట్టకేలకు ప్రకటించారు. ఈరోజు గాలి జనార్ధన్ రెడ్డి ‘కళ్యాణ్ రాజ్య ప్రగతి’ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ట్విస్ట్ ఏంటంటే.. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తూ బీజేపీతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. దీంతో ఇది బీజేపీ కాంగ్రెస్ ను ఓడించడానికి బీటీంగా గాలితో పార్టీ పెట్టించిందా? అన్న అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి.
కర్ణాటక మైనింగ్ వ్యాపారి, గతంలో వివాదాల్లో చిక్కుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి ఆదివారం తన సొంత పార్టీ ‘కళ్యాణ రాజ్య ప్రగతి’ పక్షాన్ని ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కూడా గాలి రెడ్డి ప్రకటించారు.
ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇది కొత్త రాజకీయ ఎపిసోడ్. కళ్యాణ కర్నాటక ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు వచ్చాను, రానున్న ఎన్నికల్లో ప్రతి ఇంటిని సందర్శిస్తాను. రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ప్రజలను విభజించి, పరిణామాల నుండి లబ్ది పొందాలని ప్రయత్నిస్తే, కర్ణాటకలో అది సాధ్యం కాదు. రాష్ట్ర ప్రజలు ఎల్లవేళలా ఐక్యంగానే ఉన్నారు.
కర్ణాటకలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్న వేళ గాలి నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. సొంత పార్టీతో బరిలోకి దిగుతున్నట్టు గాలి ప్రకటించారు. మరో ఐదు నెలల్లో కర్ణాటకలో ఎన్నికలు జరుగనున్న వేళ గాలి నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉంది. గతంలో గాలి పార్టీ పెట్టి దాన్ని బీజేపీలో విలీనం చేశారు.
జేడీఎస్ తో కలిసి కర్ణాటకలో బీఆర్ఎస్ పోటీచేయడానికి రెడీ అయ్యింది. ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలో బళ్లారి , బీదర్ సహా సరిహద్దుప్రాంతాలున్నాయి. ఇదే ప్రాంతం నుంచి గాలి కొత్త పార్టీ పెట్టడంతో కేసీఆర్ ను దెబ్బకొట్టడానికి.. బీఆర్ఎస్ విస్తరించకుండా ఉండేందుకు బీజేపీ ఈ గాలితో కలిసి గేమ్ ప్లాన్ చేసిందా? అన్న అనుమానలున్నాయి.
కల్యాణ కర్ణాటకలో బళ్లారి, రాయచూరు, యాదగిరి, కలబురగి గుల్బర్గా, కొప్పళ, విజయనగర జిల్లాల పరిధిలో 48 అసెంబ్లీ స్తానాల్లో గాలి జనార్ధన్ రెడ్డి బలం ఉంది. ఈ ప్రాంతం టార్గెట్ గానే గాలి ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. బీఆర్ఎస్ కూడా ఈ హైదరాబాద్ సంస్థానంలోని ఈ ప్రాంతాలనే టార్గెట్ చేసింది. దీంతో గాలి నిర్ణయంపైన బీజేపీ తెరవెనుక ఉందన్న విషయం అర్థమవుతోంది. గాలి గెలిచినా బీజేపీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో గాలి పార్టీని బీజేపీ బీటీం పార్టీనే చూస్తున్నారు. బీఆర్ఎస్ ను దెబ్బతీసే పార్టీగా భావిస్తున్నారు.
కొత్త పార్టీ పెట్టిన తర్వాత గాలి సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ మంత్రి శ్రీరాములుతో విభేదాల ఊహాగానాలను గాలి జనార్దన్ రెడ్డి కూడా తోసిపుచ్చారు. ‘నాకు బీజేపీలో ఎవరితోనూ విభేదాలు లేవు. శ్రీరాములు చిన్నప్పటి నుంచి ఆప్తమిత్రుడని, ఇంకా మంచి అనుబంధం కొనసాగిస్తాం’’ అని అన్నారు.
అక్రమ మైనింగ్ ఆరోపణలపై గాలి జనార్దన్ రెడ్డి జైలుకెళ్లినప్పటి నుంచి ఆయనకు బీజేపీ నేతలతో విభేదాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అతడు 2015 నుంచి బెయిల్‌పై బయట ఉన్నాడు. బెయిల్ మంజూరు చేస్తూనే, పాస్‌పోర్టును సరెండర్ చేయాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని కోర్టు ఆదేశించింది.
కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడపలను సందర్శించకుండా నిషేధిస్తూ సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్‌లో అనేక షరతులు విధించింది. ఇటీవల అక్టోబరులో గాలి జనార్ధన్ రెడ్డి అనుమతి కోరిన తరువాత, బళ్లారి సందర్శించడానికి.. నవంబర్ 6 వరకు తన కుమార్తెను కలవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది.
మొత్తంగా గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీ కర్ణాటక రాజకీయాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమైంది. ఆయన పార్టీ గెలవడానికి పెట్టలేదని.. ప్రత్యర్థులను దెబ్బతీయడానికేనని తెలుస్తోంది.