Karnataka Assembly Election Results
Karnataka Assembly Election Results: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా భిన్నమైన ఫలితాలు ఇక్కడ వస్తుంటాయి. ఇక్కడి ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా భిన్నమైన తీర్పును ఇస్తూ వస్తున్నారు. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో.. మూడో పార్టీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కోసారి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ పార్టీలోని అంతర్గత విభేదాలతో ముఖ్యమంత్రులను మార్చాల్సిన పరిస్థితి అధిష్టానాలకు ఏర్పడుతోంది. దీంతో సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పాటుకాక ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ కలుగుతోంది. కర్ణాటక చరిత్రలో ఇప్పటి వరకు మూడుసార్లు మాత్రమే సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించి మరోసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ఈ రాష్ట్రానికి తొలిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. మొదటి ఎన్నికల్లో 99 స్థానాలు మాత్రమే ఉండగా, కాంగ్రెస్ పార్టీ 74 స్థానాలు గెలుచుకొని అఖండ విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి తాజాగా జరిగిన ఎన్నికల వరకు 16 సార్లు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కర్ణాటక చరిత్రలో ఇప్పటి వరకు హంగ్ లేకుండా కేవలం మూడుసార్లు మాత్రమే సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి.
కర్ణాటక రాష్ట్రానికి ఎందరో సీఎంలు..
కర్ణాటక రాష్ట్రానికి 2023 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 2018 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే మూడుసార్లు మినహా అన్నిసార్లు సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు కాలేదు. 1952లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా.. ముగ్గురు ముఖ్యమంత్రులుగా పని చేశారు. 1957 లో 208 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేశారు. 1962లో జరిగిన ఎన్నికల్లో మరో మారు ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేశారు. 1967 లో జరిగిన ఎన్నికల్లోను ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్రానికి పని చేశారు. 1972లో కర్ణాటక అసెంబ్లీకి ఐదోసారి జరిగిన ఎన్నికల్లో మాత్రమే యుఆర్ఎస్ దేవరాజ్ తొలిసారి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1978లో జరిగిన ఎన్నికల తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారాన్ని పంచుకున్నారు. 1983లో జరిగిన ఎన్నికల్లో రామకృష్ణ హెగ్డే రెండు ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేయగా, 1985లో జరిగిన ఎన్నికల్లో మరోసారి రామకృష్ణ హెగ్డే, ఎస్సార్ బొమ్మై అధికారాన్ని షేర్ చేసుకున్నారు. 1989లో జరిగిన ఎన్నికల తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలించారు. 1994లో జరిగిన ఎన్నికల్లోను హెచ్డి దేవ గౌడ, జేహెచ్ కొన్నాళ్లు చొప్పున ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1999 లో జరిగిన ఎన్నికల్లో ఎస్ఎం కృష్ణ మరోసారి రాష్ట్రానికి ఏకైక ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు పనిచేసి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత జరిగిన 2004 ఎన్నికల్లో కూడా ముగ్గురు ముఖ్యమంత్రులు పనిచేశారు. మొదట ధర్మరాజ్ సింగ్, ఆ తర్వాత హెచ్డి కుమారస్వామి, ఆ తర్వాత బిఎస్ ఎడ్యురప్ప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2008లో ఎన్నికల అనంతరం అధికారాన్ని చేజెక్కించుకున్న బిజెపి మొదట యడ్యూరప్పకు సీఎం పీఠం అప్పగించగా, ఆ తర్వాత డివి సదానంద గౌడ, ఆ తర్వాత జగదీష్ షెట్టర్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో సిద్ధరామయ్య ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించారు. 2018లో జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ, జెడిఎస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. హెచ్డి కుమార స్వామిని ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలతో బిజెపికి చెందిన బి.ఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కొన్నాళ్లకే బిజెపి అధిష్టానం బసవరాజ్ బొమ్మైను యడ్యూరప్ప స్థానంలో కూర్చోబెట్టింది.
మూడే సార్లు సుస్థిర ప్రభుత్వాలు ఏర్పాటు..
2018 వరకు 15 సార్లు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా మూడుసార్లు మాత్రమే సుస్థిర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. 1972లో జరిగిన ఎన్నికల్లో దేవరాజ్ ముఖ్యమంత్రిగా కొనసాగగా, 1999లో జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్ఎం కృష్ణ ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు పనిచేశారు. ఆ తరువాత 2013లో జరిగిన ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధరామయ్య ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా జరిగినా ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఎంతవరకు సహకరిస్తాయి అన్నది చూడాల్సి ఉంది.
Web Title: Karnataka has formed stable governments only three times in its history
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com