Karnataka Elections 2023: కర్ణాటకలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 224 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 54.2% పోలింగ్ నమోదయింది. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో ఓటర్లు మధ్యాహ్నం వరకు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టడంతో పోలింగ్ కేంద్రాలకు బారులు తీరి కనిపించారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న జన సందోహాన్ని చూస్తే పోలింగ్ ప్రక్రియ రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తాను ఓటు వేసే ముందు గ్యాస్ సిలిండర్ కు పూలమాలవేసి నమస్కరించారు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనికి బిజెపి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఓటు వేసే ముందు అన్నింటిలో దేవుడిని చూడడం మంచిదే అని కామెంట్ చేసింది.
యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు
ఇక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. 120 నుంచి 130 స్థానాలు భారతీయ పార్టీ గెలుచుకొని అధికారులకు వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.. మరోవైపు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాను ఒక భారతీయుడిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చినట్టు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చాడు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య తన ఓటు హక్కు వినియోగించుకొని.. అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని జోస్యం చెప్పారు. ఇక పోలింగ్ సాయంత్రం ముగియనున్న నేపథ్యంలో సాయంత్రం వివిధ న్యూస్ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించనున్నాయి.
చెప్పడం కష్టం
ప్రస్తుతం పోలింగ్ 54% వరకు నమోదు కావడంతో ఏ పార్టీ ముందంజలో ఉంది అనేది చెప్పడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. పోలింగ్ శాతం పెరిగితే అది అధికార పార్టీకి మైనస్ అని, ప్రస్తుతం పోలింగ్ మందకొడిగా సాగుతోంది కాబట్టి అది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక పోలింగ్ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో “బై బై బిజెపి” అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఇదే సమయంలో దీనిని భారతీయ జనతా పార్టీ తిప్పి కొట్టింది. బై బై బిజెపి అంటే ఇంకా మరిన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని స్పష్టం. ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో చత్తీస్గడ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయని, ఆ రాష్ట్రంలో కూడా తాము అధికారంలోకి వస్తామని స్పష్టం చేసింది. ఇక పోలింగ్ ప్రక్రియ తుది అంకానికి వచ్చిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే అవకాశం ఉంది.
Bhaskar is a senior Journalist covers articles on Politics, General and entertainemnt news.
Read More