Karnataka Assembly Election 2023: మరి కొద్ది రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 2,427 మంది పురుషులు, 184 మంది మహిళలు, ఇతరులు ఇద్దరు ఉన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 224 మంది బిజెపి, 223 మంది కాంగ్రెస్, 207 జేడీఎస్, 209 మంది ఆప్, 133 మంది బీఎస్పీ, 4 సీపీఐ(ఎం), 8 మంది జేడీ(యూ), ఎన్సీపీ నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇక వీరిలో 685 మంది రిజిస్టర్డ్ ఆన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలకు చెందినవారు, 918 మంది స్వతంత్రులు ఉన్నారు.. 16 నియోజకవర్గాల్లో 15 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గాలలో రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించనున్నారు.
కాంగ్రెస్ దే పై చేయి
అయితే కర్ణాటక ఎన్నికల్లో వివిధ సర్వే సంస్థలు ఓటర్ల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మెజారిటీ సంస్థల సర్వేలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార బిజెపి పాలనలో ప్రజలు విసుగు చెందారని స్పష్టంగా తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు, వివాదాస్పద ఘటనలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా కిందిస్థాయి బిజెపి నాయకుల వేధింపులు కూడా ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయని అక్కడి పరిస్థితులను చూస్తే అర్థమవుతున్నది. అయితే కొన్ని సర్వే సంస్థలు మాత్రం భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ప్రకటించాయి. సర్వే ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. అంతిమంగా ఓట్ల లెక్కింపు నాడు వచ్చే ఫలితమే ప్రామాణికం కాబట్టి.. ఆయా పార్టీలు తమ తమ లెక్కల్లో ఉన్నాయి.
ఎన్ని సీట్లు వస్తాయంటే
టీవీ9, సీ ఓటర్ సర్వే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ పార్టీ 106 నుంచి 116 సీట్లు సాధిస్తుందని ప్రకటించింది. అధికార భారతీయ జనతా పార్టీ ఈ 89 సీట్లు గెలుచుకుంటుందని వివరించింది. జేడీఎస్ 24 నుంచి 34 స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఇక కర్ణాటకలోని పబ్లిక్ టీవీ మూడు ప్రకారం కాంగ్రెస్ 98 నుంచి 108 సీట్లు గెలుస్తుందని, భారతీయ జనతా పార్టీ 85 నుంచి 95 సీట్లు గెలుస్తుందని, జెడిఎస్ 28 నుంచి 33 సీట్లు గెలుస్తుందని ప్రకటించింది.
కాంగ్రెస్ వైపు ఆసక్తి
అయితే రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఓటర్లు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. యువత కాంగ్రెస్ వెంట నడుస్తోంది. మొన్నటికి మొన్న ప్రియాంక గాంధీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మెజారిటీ యువత మొత్తం ఆమె వెంట నడిచింది. రాహుల్ గాంధీ పర్యటిస్తున్న ప్రాంతాల్లోనూ యువత భారీగా హాజరవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి చేటు తెచ్చేలాగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిని నేనంటే నేనని నేతలు వ్యాఖ్యలు చేస్తుండటంతో వాటిని భారతీయ జనతా పార్టీ క్యాష్ చేసుకుంటున్నది. అయితే నేతల నోటికి కళ్లెం వేయని పక్షంలో మొదటికే మోసం వచ్చే పరిస్థితులు ఏర్పడతాయని రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నారు.