AP Kapu Leaders: ఉమ్మడి ఏపీ నుంచి అవశేష ఏపీ వరకూ కాపులను సంఘటితం చేసేందుకు సభలు, సమావేశాలు చాలానే జరిగాయి. కనీవినీ ఎరుగని కార్యక్రమాలు నిర్వహించారు.అయితే కాపులు సంఘటితమయ్యారా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అదే జరిగితే రాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్న కాపుల నుంచి ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేదు ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాపులు కాపుకాసేవారుగా మిగిలారే తప్ప.. దర్జాగా పీఠం వైపు కూర్చున్న దాఖలాలు మాత్రం లేవు. ఇలా పీఠం మీద కూర్చోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి అదే కాపులను ఉపయోగించి ఆ పీఠాన్ని దూరం చేసిన వికృత క్రీడ ఏపీలో మాత్రమే కొనసాగింది.

కాపునాడు అంటే ముందుగా గుర్తొకొచ్చేది వంగవీటి మోహన్ రంగా. కాపునాడుతోనే ఆయన స్టేట్ లీడర్ అయ్యారు. కాపులను సంఘటితం చేశారు. లక్షలాది మంది కాపులకు ఆరాధ్య దైవమయ్యారు. అదే కాపునాడు ఆయన ప్రాణం తీసిందని కూడా చెప్పొచ్చు. రాజకీయ అరంగేట్రం చేసిన కొద్దినెలలకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేగలిగారు. ఒక సమ్మోహన శక్తిగా ఎదిగారు ఎన్టీఆర్. దేశ రాజకీయాలనే ప్రభావితం చేశారు. అటువంటి మహానాయకుడు తలపెట్టిన మహానాడు రంగా పెట్టిన కాపునాడు ముందు వెలవెలబోయింది. చిన్నబోయింది. ఎన్టీఆర్ కు గట్టి హెచ్చరికగా మారింది. రంగా స్టేట్ లీడర్ గా మారుతున్న క్రమంలో ఆయనకు అభిమానుల సంఖ్య పెరిగింది. అదే స్థాయిలో శత్రువులు కూడా అధికమయ్యారు. అందులో భాగంగా జరిగిందే రంగా హత్య.
అటు తరువాత కాపునాడులు చాలా జరిగాయి. రంగా తరువాత కాపునాడు స్టార్ట్ చేసింది ప్రస్తుత తెలంగాణ ఎంపీ కే.కేశవరావు. ఆయనకు అవగాహన ఉంది కాబట్టి.. కాపునాడు నిర్వహించారు. కానీ రంగా స్థాయిలో చేయలేకపోయారు. ఆ తర్వాత మిరియాల వెంకట్రావ్ నిర్వహించినా అంత ప్రభావం చూపలేకపోయారు. అయితే రంగా నిర్వహించిన కాపునాడు ఒక ఎత్తు.,. తరువాత జరిగినవి మరో ఎత్తు. రంగా హత్యకాకుండా ఉండి ఉంటే కాపులు రాజకీయ శక్తిగా మారి ఉండేవారని ఇప్పటికీ విశ్లేషకులు చెబుతుంటారు. ఒక్క కాపు జాతే కాదు అణగారిన వర్గాలన్ని కాపునాడు వైపు చూసే సమ్మోహన శక్తిలా మార్చారు రంగా. అదే తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అంత శక్తివంతమైన నేతను దారుణంగా హత్యచేసినా నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కానీ అదే రంగా పేరుతో మాత్రం వికృత రాజకీయ క్రీడలు మొదలయ్యాయి.
రంగా హత్య తరువాత కాపునాడు సభలు, సమావేశాలు జరిగినా.. అవన్నీ రాజకీయ అజెండాతో జరిగినవే. తెర ముందుండేది కాపు నాయకులే కానీ.. తెర వెనుక మాత్రం అదృశ్య శక్తులు పనిచేసేవి. వర్గ ప్రయోజనం కంటే రాజకీయ పక్షాల ప్రయోజనాలకే కాపునాడు సమావేశాలు పనికొచ్చాయి. అందుకే కాపునాడు సమావేశాలంటే కాపుల్లో ఒకరకమైన అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టించాయి. రంగా హత్య తరువాత ఎన్నెన్నో జరిగాయి. చిరంజీవి రాజకీయ అరంగేట్రం చేసినా కాపులు పోలరైజ్ కాలేదు. ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమం ఆశించిన ఫలితాలు దక్కించుకోలేదు.అయితే వీటన్నింటికీ ఒకటే కారణం. కాపునేతల్లో ఉన్న విపరీతమైన పదవీ కాంక్ష. అదే కాపులకు మైనస్ గా మారింది. మిగతా రాజకీయ పక్షాలకు ప్లస్ అయ్యింది.

విశాఖలో కాపునాడు నిర్వహణనే తీసుకుందాం. అన్ని రాజకీయ పక్షాల్లోని కాపు నేతలకు ఆహ్వానాలు అందించారు. కానీ కీలక కాపు నాయకులు మాత్రం ముఖం చాటేశారు. ఇంకా నిర్వహించకుండానే నిర్వాహకులుగా మారిన గంటా శ్రీనివాసరావు, బొండా ఉమామహేశ్వరరావు, కన్నా లక్ష్మీనారాయణలు దానిని టీడీపీ, జనసేన కార్యక్రమంగా ఫోకస్ చూపడం లో సక్సెస్ అయ్యారు. దీంతో దీనికి అధికార వైసీపీ కాపు నేతలు దూరమయ్యారు. పోనీ టీడీపీ, జనసేనల నుంచి నాయకులను సమీకరించగలిగారంటే అదీ లేదు. అటు రంగా వారసుడు రాధాక్రిష్ణను సైతం తీసుకురాలేకపోయారు. అటు నిర్వాహకులుగా ఉన్న తాము కూడా ఆలస్యంగా వచ్చారు. పైగా కార్యక్రమానికి కాపు సామాజికవర్గానికి చెందని బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహానికి తీసుకొచ్చారు. ఆయనతో మాట్లాడించారు. అటు కాపుల్లో బలిజలు అన్నివిధాలా అణగదొక్కబడుతున్నారని సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. కాపుల్లో ఐక్యత నింపాలన్న ఉద్దేశ్యంతో నిర్వహించిన సభ కాపుల్లో మాత్రం అయోమయానికి కారణమైంది. మున్ముందు ఇటువంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్న డిమాండ్ కాపు సామాజికవర్గం వారి నుంచి వినిపిస్తోంది.