Kalvakuntla Kavita : మళ్లీ కవితక్కకు జైలే.. ఇరికించేస్తోన్న సీబీఐ, ఈడీ

మే 7న కేజ్రీవాల్‌ను తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్‌ను మార్చి 21న ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. జైల్లో తనకు ప్రైవేట్‌ వైద్యులతో ప్రత్యేక చికిత్స కావాలని కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఇప్పటికే కొట్టివేసిన విషయం తెలిసిందే.

Written By: NARESH, Updated On : April 23, 2024 6:33 pm

MLC Kavitha

Follow us on

Kalvakuntla Kavita : ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితురాలు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈసారి కూడా ఊరట దక్కలేదు. ఆమె జు‍్యడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మరో 14 రోజులపాటు పొడిగించింది. నేటితో కస్టడీ ముగియడంతో తీహార్‌ జైలు నుంచి ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కస్టడీ పొడిగించాలంటూ ఇటు ఈడీ, అటు సీబీఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది.

బెయిల్‌ ససేమిరా అన్న దర్యాప్తు సంస్థలు..
లిక్కర్‌ స్కాంలో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అక్రమంగా మార్చి 15వ తేదీన అరెస్ట్‌ చేసిందని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు వాదనలు వినిపించారు. ఈడీ అడిగిందే అడుగుతోందని, చెప్పిందే చెబుతోందని కవిత తరఫు లాయర్లు వాదించారు.

ఈడీ వాదనలు ఇలా..
ఇక ఈడీ తరఫున లాయర్లు తమ వాదనలు వినిపించారు. లిక‍్కర్‌ స్కాంలో రూ.100 కోట్ల లంచం ఇచ్చిందని తెలిపింది. కవిత ఆదేశాల మేరు మాగుండ శ్రీనివాస్‌రెడ్డి, రాఘవ రూ.25 కోటు‍్ల ఇచ్చారని తెలిపింది. లిక్కర్‌ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకున్నారని పేర్కొంది. ఇండో స్పిరిట్ ద్వారా లంచాల సొమ్ము తిరిగి రాబట్టుకున్నారని వెల్లడించింది. అరుణ్ పిళ్లై కవితకు బినామీ, ఇండో స్పిరిట్‌లో 33.5 శాతం వాటా అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారని వివరించింది. ఇక ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉందని తెలిపింది. కవితకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. ఈమేరకు కేసు దర్యాప్తు పురోగతిని కూడా ఈడీ కోర్టుకు అందజేసింది. 60 రోజుల్లో కవిత అరెస్ట్‌పై చార్జిషీట్ సమర్పిస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.

కేజ్రీవాల్‌ కస్టడీ కూడా..
ఇదే కేసులో అరెస్ట్‌ అయి తిహార్‌ జైల్లోనే ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని కూడా రౌస్‌ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. కేజ్రీవాల్‌ను కూడా ఈడీ వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. మే 7న కేజ్రీవాల్‌ను తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్‌ను మార్చి 21న ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. జైల్లో తనకు ప్రైవేట్‌ వైద్యులతో ప్రత్యేక చికిత్స కావాలని కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఇప్పటికే కొట్టివేసిన విషయం తెలిసిందే.