Kaleshwaram Project: రుతుపవనాలు అంతగా విస్తరించడం లేదు. వర్షాలు దంచి కొట్టడం లేదు. నదులు ఉప్పొంగి పారడం లేదు. ఫలితంగా కెసిఆర్ తన మానస పుత్రికగా అభివర్ణించుకుంటున్న కాలేశ్వరం జలం ఉవ్వెత్తున ఎగిసిపడటం లేదు. బీడు పొలాలను పారించడం లేదు. వాస్తవానికి కాలేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించే సమయంలో ముఖ్యమంత్రి మాటలు ఒక్కసారి మననం చేసుకుంటే అందులో ఉన్న దోఖా అర్థమవుతుంది. ” కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఒక్కసారి కరువు కాటకాలు ఏర్పడితే కాలేశ్వరం ప్రాజెక్టు విలువ ఏంటో తెలుస్తుంది” అని అప్పుడు కెసిఆర్ సెలవిచ్చారు.
అన్ని నీళ్లు ఎత్తిపోయలేదు
జ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సందర్భంగా 900 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తామని అప్పట్లో కెసిఆర్ ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకు అంత కాదు కదా అందులో పావు వంతు కూడా నీళ్లు లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ నీళ్లు గత ఏడాది కురిసిన వర్షాల వల్ల సముద్రం పాలయ్యాయి. పైగా చాలా వరకు మోటర్లు నీటిలో మునిగిపోయాయి. ఇసుక మేటలు వేసాయి. పంప్ హౌస్ లన్నీ మొరాస్తున్నాయి. ఇందులో ఏది పనిచేస్తుందో ఏది పనిచేయదో తెలుసుకునేందుకు అక్కడకు మీడియా వెళితే.. ప్రభుత్వం పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసింది. అక్కడ ఏం జరుగుతుందో కూడా బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త వహిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టు అక్కడ మొత్తం పారదర్శకత గనుక ఉండి ఉంటే ఇదంతా దాయాల్సిన అవసరం ఏముందో?
లక్ష్యాన్ని చేరడం లేదు
లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్మించిన కాలేశ్వరం ఎత్తిపోతుల పథకం లక్ష్యాన్ని చేరడం లేదు. 900 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోయాలని, 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించుకున్నారు. ఎత్తిపోతల విషయంలో 2019 జూన్ 21 నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క సంవత్సరం కూడా లక్ష్యాన్ని చేరలేదు. 2019లో కేవలం 34 టీఎంసీల నీళ్ళను మాత్రమే లిఫ్టు చేశారు. 2020లో 35 టీఎంసీలు, 2021లో 52 టీఎంసీలు, 22లో కేవలం 5 టీఎంసీలు మాత్రమే ఎత్తి పోశారు. జూన్ 14న వచ్చిన భారీ వరదలకు కన్నెపల్లి పంప్ హౌస్ నీట మునిగింది. దీంతో 2023 లో ఇప్పటి వరకూ 26 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. ఐదు సంవత్సరాలలో కేవలం 152 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. ఇందులోకి మళ్ళీ 50 టీఎంసీల నీళ్లను తిరిగి గోదారిలోకి వదిలేశారు. లక్ష్యం మేరకు ఈ ఐదు సంవత్సరాలలో 900 టీఎంసీలు ఎత్తిపోయాల్సి ఉంటే.. కేవలం 102 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. అలాగే కాలేశ్వరం ప్రాజెక్టులో హెడ్ వర్కులు, రిజర్వాయర్లు మాత్రమే పూర్తయ్యాయి. హెడ్ రెగ్యులేటరీలు, కాలువలు, పిల్ల కాలువ పనులు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరో 21 వేల ఎకరాల భూమి అవసరం. అయితే తెలంగాణ వ్యాప్తంగా భూముల ధర పెరగడంతో రైతులు వాటిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.. హెడ్ వర్కులు, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వంటి కీలక రిజర్వాయర్లు పూర్తి చేయించ గ్రామంలో భూసేకరణకు సహాయం పై ఉదారంగా స్పందించిన ప్రభుత్వం.. మిగిలిన పనుల విషయంలో ప్రాధాన్యాన్ని తగ్గించింది. దీంతో దీని ద్వారా కొత్తగా 80,000 ఎకరాల ఆయకట్టుకే నీరు ఇచ్చారు. ఫలితంగా మరో ఐదు సంవత్సరాలైనా ఈ ప్రాజెక్టు పూర్తయ్య అవకాశాలు లేవు.