KA Paul Munugodu By-Poll : కేఏ పాల్ ముందర టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు దిగదుడుపే మరీ.. ఆయన కాన్ఫిడెంట్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే మరీ.. చిత్తుగా ఓడుతున్నా ఐటెం సాంగ్ లు వేసుకొని డ్యాన్స్ చేసే కెపాసిటీ ఆయన సొంతం. అదీ టీఆర్ఎస్, బీజేపీ వాళ్లు చేయలేరు. మన పాల్ ను చూస్తుంటే ఇదే ముచ్చటేస్తుంటుంది. వీలైతే ముద్దులు కూడా పెట్టాలని అనిపిస్తుంది. మునుగోడులో వేలకు వేల ఓట్లు వచ్చి గెలుపు ముంగిట ఉన్న టీఆర్ఎస్, బీజేపీలే తాము గెలుస్తామని.. విజయోత్సవ ర్యాలీ కోసం అనుమతి అడగడం లేదు. కానీ ఇన్ని రౌండ్లలో కేవలం 134 ఓట్లు మాత్రమే వచ్చి అసలు డిపాజిట్ కూడా దక్కుతుందో దక్కని కేఏ పాల్ ఏకంగా తన విజయం తథ్యం అని.. 50వేల ఓట్ల తేడాతో గెలుస్తానని.. విజయోత్సవ ర్యాలీకి అనుమతి కోరారు. కేఏ పాల్ కు వెర్రి వేయి విధాలన్నట్టుగా ఆయన చేష్టలున్నాయి.
శాంతి దూత.. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ . రాజకీయాల్లోకి రాకముందు వరకు ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు, గొప్ప గౌరవం ఉంది. అగ్రదేశాల అధ్యక్షుడు కూడా ఆయనతో మాట్లాడారు. కానీ పొలిటికల్ ఎంట్రీ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆయన కమెడియన్‌గా మారిపోయారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి జోకర్‌గా మారిపోయారు. అభ్యర్థి ప్రకటన నుంచి కౌంటింగ్ వరకూ ఆయన తీరు హాస్యాస్పదమైంది. అభ్యర్థిగా గద్దర్ పోటీచేస్తారని ప్రకటించారు. తర్వాత తానే బరిలో నిలిచారు. నామినేషన్ తర్వాత ఉంగరం గుర్తు రావడంతో పది వేళ్లకు ఉంగరాలు ధరించి ప్రచారం నిర్వహించారు. రైతు వేషం కట్టారు. మాస్ పాటలకు డ్యాన్స్ చేశారు. సైకిల్ తొక్కారు. చిన్న పిల్లలతోనూ గెంతులేశారు. ఇక కౌంటింగ్ కేంద్రంలో అయితే పరుగో పరుగు అంటూ నవ్వులు పూయించారు. పోలింగ్ తర్వాత 50 వేల మెజారిటీ సాధిస్తానని ఆశ్చర్య పర్చారు.

నాలుగు రౌండ్లలో 134 ఓట్లు..
మునుగోడు ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌లోనే కేఏ.పాల్ అందరినీ ఆశ్చర్య పర్చారు. మొదటి రౌండ్‌లో 34 ఓట్లు సాధించారు. నాలుగు రౌండ్లలో కలిపి 134 ఓట్లు సాధించారు. వంద ఓట్లు దాటుతాయా అని అందరూ అనుకుంటున్న తరుణంలో పాల్ మాత్రం నాలుగు రౌండ్లకే సెంచరీ క్రాస్ చేశారు. 20 రౌండ్లలో దాదాపు వెయ్యి ఓట్లు వవస్తాయని అశిస్తున్నారు.
విజయోత్సవ ర్యాలీకి అనుమతి కావాలట..
మొత్తం కౌంటింగ్ పూర్తయ్యే వరకూ కేఏ.పాల్‌కు 1000 ఓట్లు వస్తాయని అంచనా. పోలింగ్ రోజు 50 వేల మెజారిటీ అన్న పాల్, కౌంటింగ్ రోజు మళ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. పాల్ దరఖాస్తును చూసి పోలీసులతోపాటు మునుగోడు ఓటర్లు నవ్వుకుంటున్నారు.