Homeఆంధ్రప్రదేశ్‌న్యాయవ్యవస్థను కాపాడుతా.. జగన్ సర్కార్ పై జస్టిస్ రాకేష్ కుమార్ హాట్ కామెంట్స్

న్యాయవ్యవస్థను కాపాడుతా.. జగన్ సర్కార్ పై జస్టిస్ రాకేష్ కుమార్ హాట్ కామెంట్స్

Justice Rakesh Kumar
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌‌ ఈనెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. కాగా.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తనపట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మరోసారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అడిగినవాటికి స్పష్టత ఇవ్వకుండా.. తన వ్యాఖ్యల ఆధారంగా తనను విచారణ నుంచి వైదొలగాలంటూ సర్కారు పిటిషన్లు దాఖలుచేయడం సమంజసం కాదన్నారు. అయితే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేందుకు అనుమతించేది లేదని.. పదవీ విరమణ చేసేంతవరకు భయం, పక్షపాతం లేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని తేల్చిచెప్పారు.

Also Read: సోము వీర్రాజును వాళ్లు టార్గెట్ చేస్తున్నారా?

తనపై మరో రిక్విజేషన్‌ పిటిషన్‌ వేయడానికి ఛాన్సివ్వకుండా ఇంకో కీలక కేసు విచారణను ఆయన జనవరికి వాయిదా వేయడం గమనార్హం. అంతేకాదు.. ఊపిరి ఉన్నంత వరకు న్యాయవ్యవస్థను కాపాడతానని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసేంతవరకు భయం, పక్షపాతం లేకుండా బాధ్యతలు నిర్వహిస్తానన్నారు. ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ పథకంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ప్రభుత్వ స్థలాలను వేలం వేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు సోమవారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘నేను దేనినీ లెక్కచేయను. న్యాయవ్యవస్థ గురించే నా ఆలోచనంతా. విచారణ సందర్భంగా మనసులోకి వచ్చిన దానిని అడగడం నాకు అలవాటు. ప్రశ్నించిన దానికి స్పష్టత ఇస్తే సరిపోతుంది. కానీ.. అవి దృష్టిలో పెట్టుకుని విచారణ నుంచి వైదొలగాలని పిటిషన్లు వేయడం సరికాదు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించి 26 ఏళ్లు సేవలు అందించాను. 2009లో న్యాయమూర్తిగా ఎలివేట్‌ అయిన తరువాత సామర్థ్యం మేరకు విధులు నిర్వహిస్తున్నాను. పాట్నా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహించే సమయంలో నా ముందు వాదనలు వినిపించే వారు సీనియర్‌ న్యాయవాదా లేక జూనియరా అనే వ్యత్యాసం ఎప్పుడూ చూపించలేదు. కారణమేదైనా విధి నిర్వహణకు అక్కడ నుంచి ఇక్కడకు వచ్చాను. పదవీ విరమణ చేసే దశలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటానని అనుకోలేదు’ అని తెలిపారు. అయితే అంతిమంగా ఇలాంటి పిటిషన్లు వేయడం కక్షిదారుల పరిధిలోని అంశమని స్పష్టం చేశారు.

Also Read: ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్

వాస్తవానికి పై పిటిషన్లపై ఈ నెల 11వ తేదీన జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ రమేశ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆ సందర్భంగా.. ‘రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులను ప్రభుత్వం వేలం ఎలా వేస్తుంది..? ఆస్తులు వేలం వేయడానికి ప్రభుత్వం ఏమైనా దివాలా తీసిందా? రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని ప్రకటిస్తాం’ అని జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై విచారణ నుంచి ఆయన తప్పుకోవాలంటూ ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌ కుమార్‌ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ వేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. అనుబంధ పిటిషన్‌ వేసిన ప్రవీణ్‌కుమార్‌ కేడర్‌ ఏమిటని ప్రశ్నించింది. ప్రత్యేక అధికారి, ఐఏఎస్‌ అధికారి అని ఆయన బదులిచ్చారు. పదవీ విరమణ చేసిన ఐఏఎస్సా.. లేక సర్వీసులోనే ఉన్నారా అంటూ ధర్మాసనం అడిగింది. ఆయన యువ ఐఏఎస్‌ అని, సర్వీసులో కొనసాగుతున్నారని సుధాకర్‌రెడ్డి తెలిపారు. పిటిషనర్లు ఈ తరహా వ్యాజ్యాలు దాఖలు చేస్తూ, ప్రజాతీర్పుతో ఎన్నికైన ప్రభుత్వాన్ని బాధ్యతలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.నళిన్‌కుమార్‌ జోక్యం చేసుకుని.. ప్రభుత్వ అనుబంధ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరంలేదని, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ఒక్కరే నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ప్రస్తుతం ఈ పిటిషన్లపై విచారణ జరపడం లేదని.. ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్లపై అభ్యంతరాలుంటే బుధవారంలోపు కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నిర్ణయం మేరకు.. జస్టిస్‌ రమేశ్‌తో బెంచ్‌ ఏర్పాటు చేస్తే అనుబంధ పిటిషన్లపై ఈ నెల 28న విచారణ చేపడతామని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular