Homeజాతీయ వార్తలుMunugode By Election: మునుగోడులో జంప్‌ జిలానీలకు ఝలక్‌.. ఆఫర్‌ ఇచ్చి హ్యాండ్‌ ఇస్తున్న ప్రధాన...

Munugode By Election: మునుగోడులో జంప్‌ జిలానీలకు ఝలక్‌.. ఆఫర్‌ ఇచ్చి హ్యాండ్‌ ఇస్తున్న ప్రధాన పార్టీలు!

Munugode By Election: తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో.. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈ క్రమంలో జంప్‌ జిలానీలను అన్ని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. మూడు పార్టీల్లో కాస్తో కూస్తో బలం ఉన్న నాయకులంతా కలిసి వచ్చిన అవకాశం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పార్టీ మంచి ఆఫర్‌ ఇస్తే ఆ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అయితే పార్టీలో చేరకముందు భారీ ఆఫర్‌ ఎరగా వేస్తున్న పార్టీలు.. చేరిన తర్వాత ఆఫర్‌ సొమ్ములో కోతపెడుతున్నాయి. సగమో, పావు వంతో ఇచ్చి మిగతా మొత్తానికి రేపు, మాపంటూ నేతలు ముఖం చాటేస్తున్నారు. దీంతో గోడ దూకిన ప్రతినిధుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.

Munugode By Election
Munugode By Election

రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు బేరం..
మునుగోడులో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు.. ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులకు గాలం వేస్తున్నాయి. వలలో వేసుకునేందుకు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపుతున్నాయి. స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆశ చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేతలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పార్టీలు మారుతున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు వందల సంఖ్యలో నేతలు పార్టీలు మారారు. కానీ వీరిలో చాలామందికి కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డబ్బులు దక్కలేదని తెలుస్తోంది.

నమ్మకం లేక కోత..
ఇస్తామన్న డబ్బులు మొత్తం ఇవ్వకపోవడంతో పార్టీలు మారినవారంతా తమను వలలోకి దింపినవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అయితే ప్రధాన పార్టీలు ఈ విషయంలో కొంత తెలివిగా వ్యవహరిస్తున్నాయని స్థానిక నేతలు చెబుతున్నారు. డబ్బులు మొత్తం ఇచ్చాక ఒకవేళ వారు మళ్లీ పార్టీ ఫిరాయిస్తే పరిస్థితి ఏమిటన్న జాగ్రత్తతోనే సగమో, పావు వంతో ఇచ్చి మిగతాది తర్వాత ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. డబ్బుకు ఆశపడి పార్టీ మారితే అనుకున్న మొత్తం రాకపోగా, పరువు పోయిందని నాంపల్లి మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి వాపోయారు. డబ్బులకు అమ్ముడుపోయారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ కోసం పనిచేస్తున్నవారిలో నిరాశ..
జంప్‌ జిలానీల పరిస్థితి కులం చెడ్డా.. సుఖం దక్కలేదు అన్నట్లు తయారవగా, పార్టీని అంటిపెట్టుకుని, అభ్యర్థి గెలుపు కోసం జెండా మోస్తున్నవారి పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే ఉంది. తాము పార్టీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నా తమను పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యనేతలు తమను పట్టించుకోవడం లేదని, తాము సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారంలో పాల్గొంటున్నామని కొందరు కిందిస్థాయి నేతలు వాపోతున్నారు.

ఇప్పటి వరకు జరిగిన బేరసారాల్లో కొన్ని..

– చౌటుప్పల్‌ మండలంలోని ఒక సర్పంచ్‌ ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరారు. ఆయనకు రూ.20 లక్షలు ఆఫర్‌ చేసి.. అందులో రూ.10 లక్షలే ఇచ్చినట్లు తెలిసింది. మిగతా మొత్తం అడిగితే ఇప్పుడు అప్పుడు అంటూ దాట వేస్తుండటంతో సదరు సర్పంచ్‌ మిగతా డబ్బులు ఇస్తారా? లేదా? అనే ఆలోచనలో పడ్డారు.

– చండూరులో ఒక ముఖ్య నేత ఒక ప్రధాన పార్టీలో చేరారు. అక్కడ రూ.40 లక్షలు ఇస్తామని చెప్పారు. డబ్బులు తీసుకొని మళ్లీ ఫిరాయిస్తున్నారని ఆ పార్టీ వెంటనే డబ్బులు ఇవ్వలేదు. దీంతో మరో పార్టీ అదే మొత్తం ఇస్తామంటూ ఆయన్ను సంప్రదించడంతో ఆ పార్టీలో చేరిపోయారు. కానీ వారిచ్చింది రూ.5 లక్షలేనని తెలిసింది.

Munugode By Election
Munugode By Election

– చౌటుప్పల్‌ మండలంలో ఒక పార్టీకి చెందిన సర్పంచ్‌ వేరే పార్టీలో చేరారు. రూ.20 లక్షలకు బేరం కుదిరినా అందులో రూ.5 లక్షలే అందినట్లు తెలిసింది. మిగతా మొత్తం అడిగితే గెలిచాక ఇస్తామంటూ దాటవేస్తున్నారని ఆ సర్పంచ్‌ వాపోతున్నారు.

– మునుగోడు మండలంలోని ఒక పార్టీకి చెందిన సర్పంచ్‌ మరో పార్టీలో చేరారు. ఆయనకు రూ.20 లక్షలు ఇస్తామనే హామీ లభించింది. ఈయనకు కూడా రూ.5 లక్షలే అందాయని, మిగతా మొత్తం ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని తెలిసింది.

– నియోజకవర్గంలోని ఓ పార్టీ మండల అధ్యక్షుడు ఒకరు రూ.30 లక్షలకు మరో పార్టీలో చేరేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మేరకు పార్టీ మారారు కూడా కానీ, చేర్చుకున్న పార్టీ రూ.5 లక్షలే ఇవ్వడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

– నారాయణపూర్‌ మండలంలో ఒక గ్రామ సర్పంచ్‌తో రూ.10 లక్షలకు బేరం కుదిరింది. తీరా రూ.3 లక్షలే చేతిలో పెట్టి కండువాను కప్పి వదిలేశారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular