Unstoppable With NBK- Pawan Kalyan: నందమూరి బాలయ్య బాబు తొలిసారి బుల్లితెరకు వచ్చి చేస్తున్న షో ‘అన్ స్టాపబుల్’. ఒక ఇంటర్వ్యూలా కాకుండా ఆ వ్యక్తి ఇష్టాయిష్టాలు.. గతంలో చేసిన పనులు.. తప్పు ఒప్పులు.. మద్యం, వ్యక్తిగత అలవాట్లు, చాటుమాటు వ్యవహారాలు.. ఇలా డిఫెరెంట్ గా సాగుతుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ తొలి ఎపిసోడ్ కే బాలయ్య బావ..మాజీ సీఎం చంద్రబాబు వచ్చారు. నాడు ఎన్టీఆర్ ను గద్దెదించి ఎలా చంద్రబాబు పార్టీని లాగేసుకున్నాడు. కారణాలు ఏంటి? అన్న దానిపై బాలయ్యతో చర్చించాడు. ఎన్టీఆర్ ను గద్దెదించిన కుట్రలో బాబు, బాలయ్య, హరికృష్ణ భాగస్వాములన్న విషయం వీరి నోటివెంటే బయటపడింది.
ఇక ఆ తర్వాత నెక్ట్స్ ఎపిసోడ్ కు కుర్ర యంగ్ హీరోలు సిద్దూ, విశ్వక్ సేన్ లు హాజరయ్యారు. వారిద్దరితో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతాకాదు. వీరిద్దరిలో మాట్లాడుతున్న టైంలోనే దర్శకుడు ‘త్రివిక్రమ్’కు ఫోన్ చేసిన బాలయ్య ‘ఎప్పుడొస్తున్నావ్ అన్ స్టాపబుల్ షోకు.. ఒంటరిగా రావద్దు.. ఎవరితో రావాలో తెలుసుకదా?’ అంటూ కోరాడు. దానికి త్రివిక్రమ్.. ‘అయ్యో సార్ తప్పకుండా వస్తాడు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాను’ అంటూ బదులిచ్చాడు.

ఇక బాలయ్య అన్న మాటలను బట్టి పవన్ కళ్యాణ్ ను ఈ షోకు ఒప్పించుకొని తీసుకురావాలని త్రివిక్రమ్ పై బాధ్యత పెట్టాడని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ పై బాలయ్య, ఆహా ఓనర్ అయిన అల్లు అరవింద్ ఒత్తిడి పెట్టారని.. ‘అన్ స్టాపబుల్’ షోకు పవన్ ను ఒప్పించి తీసుకురావాలని కోరినట్టు తెలిసింది. దీనికి త్రివిక్రమ్ కూడా అంగీకరించి పవన్ కళ్యాణ్ ఫ్రీగా ఉన్న సమయం చూసి తీసుకువస్తానని మాట ఇచ్చినట్టు సమాచారం.
పవన్ బాలయ్య షోకు వస్తే మాత్రం అది రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయం. వీరిద్దరి కాంబినేషన్ మాటలను బుల్లితెరపై చూడాలని మెగా, నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.