దేవుడు ఉన్నాడా లేడా? అనే విషయంలో ఎవరి అభిప్రాయం వారిది. కానీ.. ప్రాణాపాయాన్ని తప్పించి, తిరిగి ప్రాణం పోసే వైద్యుడిని దేవుడితో పోలుస్తారు అందరూ. ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. నెగెటివిటీని పక్కన పెడితే.. ప్రజల ప్రాణాలను నిలిపేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన డాక్టర్లు ఎంతో మంది ఉన్నారు. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఫ్రంట్ లైన్‌లో నిలబడిన వైద్యులు ఎందరో ప్రాణాలను అర్పించడం చూశాం. అలాంటి వైద్య వృత్తిలో కొనసాగుతున్న వారిని స్మరించుకునే రోజు ఇది! అవును.. ఇవాళ జాతీయ వైద్యుల దినోత్సవం.
మన నిత్య జీవితంలో వైద్యుడితో ఉన్న బంధం విడదీయలేనిది. అసలు.. డాక్టర్ అనేవారు లేకపోతే ఈ లోకం ఏమైపోతుందో కూడా చెప్పలేం. ఇవాళ ప్రాణాలు తీసే మహమ్మారులు, దీర్ఘ కాలిక రోగాల నుంచి సురక్షితంగా బయట పడుతున్నామంటే.. వారి చలవే. పురాతన కాలంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో తెలిసిందే. ఆకు పసర్లతోనే కాలం వెళ్లదీసే రోజుల్లో.. ప్రతీ చిన్న రోగానికి సైతం కోల్పోయిన ప్రాణాలు ఎన్నో! ఆ పరిస్థితిని అధిగమించిన అల్లోపతి వైద్యవిధానం.. ఇవాళ ఎలాంటి రోగాన్నైనా ఎదుర్కొనే స్థాయికి చేరింది. ఆ విధంగా ప్రాణదాతలుగా మారిన వైద్యులను స్మరించుకునేందుకు ఒక రోజును కేటాయించారు.
మన దేశంలో ప్రతీ సంవత్సరం జూలై 1వ తేదీని ‘నేషనల్ డాక్టర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. వైద్యరంగంలో విశేష సేవలు అందించిన బిధాన్ చంద్రరాయ్ జయంతి నేడు. వైద్యవిభాగంలో దేశానికి ఆయన చేసేన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’తో సత్కరించింది. ఆయన పుట్టిన రోజునే.. జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1991 నుంచి మొదలైన ఈ సంప్రదాయం.. మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది.
ఈ రోజున వైద్యులు సమాజానికి చేస్తున్న సేవలను స్మరించుకుంటారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులతోపాటు వారి కృషి గురించి చర్చిస్తారు. డాక్టర్లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడంతోపాటు.. సభలు, ర్యాలీలు నిర్వహించి వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. కానీ.. ఇప్పుడు కరోనా మహమ్మారి ఉండడంతో నిరాడంబరంగానే ఈ వేడుకలను జరుపుకుంటున్నారు.
అయితే.. చాలా స్పెషల్ డేలు ప్రపంచం మొత్తం ఒకే రోజున సెలబ్రేట్ చేసుకుంటుంది. కానీ.. డాక్టర్స్ డేను మాత్రం వివిధ దేశాల్లో.. వివిధ రోజుల్లో జరుపుకుంటారు. ఆయా దేశాల్లో ప్రముఖులు జయంతులను, ప్రత్యేక సందర్భాలను వారు అనుసరిస్తారు. ఉదాహరణకు అమెరికాలో డాక్టర్స్ డేను మార్చి 30వ తేదీన నిర్వహిస్తారు. అయితే.. వైద్యుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిందే. ప్రతీ మనిషి జీవితంలో వైద్యుని పాత్ర మరువలేనిది కాబట్టి.. వారికి కృతజ్ఞతలు చెప్పడం అనేది కనీస ధర్మం.