J P Nadda: హిమాచల్ ప్రదేశ్ లో ఓటమి బిజెపి నాయకులకు మింగుడు పడటం లేదు. దీనిపై గత మూడు రోజులుగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి దీనిపై మరింత ఆగ్రహం గా ఉన్నారు. వెంటనే దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ ఓటమి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చుట్టుకుంటున్నది.. రాష్ట్రంలో తన ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ దుమాల్ ను కావాలనే పక్కన పెట్టి, ఉద్దేశపూర్వకంగా తిరుగుబాట్లను ఎగ దోశారని బిజెపి పెద్దలకు విశ్వసనీయ సమాచారం. వీటివల్లే అక్కడ బిజెపి ఓడిపోయిందని, అందుకే ఆయనను జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని అమిత్ షా, నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఆయన స్థానంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను జాతీయ నూతన అధ్యక్షుడిగా నియమించాలని మోడీ, షా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జేపీ నడ్డా పదవీకాలం జనవరి 20న ముగుస్తుంది.. రెండో అవకాశం కూడా ఇచ్చి 2024 లోక్ సభ ఎన్నికలు కూడా ఆయన సారధ్యంలోనే వెళ్లాలని తొలుత నిర్ణయించారు.. అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఓటమి తర్వాత మోడీ, షా తమ మనసు మార్చుకున్నారు.

ముఠా నాయకుడిగా వ్యవహరించారు
హిమాచల్ కు చెందిన నడ్డా పార్టీ జాతీయ అధ్యక్షుడు అయినప్పటికీ, ఆ రాష్ట్రంలో ఒక ముఠా నాయకుడిగా వ్యవహరించే వారని కొంతమంది చెబుతున్నారు. ప్రేమ్ కుమార్ వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని, అందువల్లే పార్టీలో తిరుగుబాట్లు మొదలయ్యాయని విశ్వసనీ వర్గాల సమాచారం. ఏకంగా 21 మంది రెబల్స్ రంగంలోకి దిగి పార్టీ విజయావకాశాలను ఘోరంగా దెబ్బ తీశారు. దీనిపై ప్రధానికి నిఘా వర్గాలు నివేదిక కూడా ఇచ్చాయి. నడ్డా, ప్రేమ్ కుమార్ ఒకరిని ఒకరు ఓడించుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందింది. నడ్డా సొంత ప్రాంతం బిలాస్ పూర్ లో చావు తప్పి కళ్ళు లొట్ట పోయిన తీరుగా బిజెపి మూడు సీట్లలో స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. ప్రేమ్ కుమార్ తనయుడు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హమీర్ పూర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 17 అసెంబ్లీ సీట్లు ఉండగా, బిజెపి నాలుగు చోట్ల మాత్రమే గెలిచింది. 13 స్థానాల్లో కాంగ్రెస్, రెబల్స్ విజయం సాధించారు. నడ్డా, ఠాకూర్, సీఎం జయరాం ఠాకూర్ తమ సొంత ప్రయోజనాల కోసం పనిచేయడంతో పార్టీ దెబ్బతిన్నది. హిమాచల్ ప్రదేశ్ లోని 68 నియోజకవర్గాలలో 21 స్థానాల్లో బిజెపి రెబల్స్ పోటీ చేశారు. వీరిలో ముగ్గురు విజయం సాధించారు. మిగతావారు బిజెపి ఓట్లను గణనీయంగా చీల్చారు. దీంతో బిజెపి ఆ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

ఇదీ ఖట్టర్ నేపథ్యం
ఖట్టర్ మోడీకి అత్యంత సన్నిహితుడు. హర్యానా ముఖ్యమంత్రిగా 8 ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు.. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో బిజెపి, జెజెపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే ఖట్టర్ పనితీరుపై ప్రజా వ్యతిరేకత ఉన్నది.. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు 20 నెలల సమయమే ఉండటంతో ఖట్టర్ ను మార్చివేయాలనే నిర్ణయానికి మోడీ వచ్చినట్లు తెలుస్తోంది . ఒకవేళ లేని పక్షంలో హిమాచల్ ప్రదేశ్ లాగా దెబ్బతింటామని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. 2019 అక్టోబర్ లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 41 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీతో కలిసి ఖట్టర్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక మోడీకి సన్నిహితుడు కావడంతో ఖట్టర్ కు రెండోసారి ముఖ్యమంత్రి పదవి దక్కింది. అయితే వీరి మధ్య సానిహిత్యం ఈనాటిది కాదు.. ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ లుగా పనిచేశారు. 1996లో మోడీ బిజెపి హర్యానా ఇన్చార్జిగా ఉన్నారు.. 2001లో మోడీ ముఖ్యమంత్రి కాగానే గుజరాత్లో భూకంపానికి గురైన కచ్ ప్రాంతాల్లో బిజెపిని గెలిపించే బాధ్యత ఖట్టర్ కు అప్పగించారు. 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత హర్యానా ఎన్నికల్లో బిజెపి గెలవడంతో రెండో మాటకు ఆస్కారం లేకుండా ఖట్టర్ ను ముఖ్యమంత్రి చేశారు. అయితే ప్రస్తుతం హర్యానా సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పని తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఖట్టర్ ను బిజెపి జాతీయ అధ్యక్షుడిగా నియమించాలని మోడీ నిర్ణయించారు. మరి కొద్ది రోజుల్లో ఇది కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.