
‘ఎలా బతుకుడు.. ఎక్కడ బతుకుడు తెలంగాణ జిల్లాల్లోనా?’ అంటూ తెలంగాణలోని వలసల తీవ్రతను కళ్లకు కట్టేలా అప్పట్లో ఓ సినీ కవి నుంచి వచ్చిన గీతం అందరినీ కంటతడిపెట్టించింది. కానీ దేవుడి దయ.. పాలకుల మంచి పాలనతో ప్రస్తుతానికి తెలంగాణలో వలసలు తగ్గి స్వావలంభన వచ్చేసింది. కానీ కరోనా కాటుతో ఇప్పుడు మళ్లీ మునుపటి పరిస్థితి దాపురిస్తోంది. అందరిలోనూ ధీమా ఉంది. కానీ సమాజానికి పత్రికల ద్వారా దిశానిర్ధేశం చేసే జర్నలిస్టుల పరిస్థితే అగమ్య గోచరంగా తయారైంది.
*యాజమాన్యాల కుట్రలకు బలైపోవాల్సిందేనా?
ఎప్పటి నుంచో కాలదన్నడానికి రెడీ అయిన మీడియా యాజమాన్యాలకు ఇప్పుడు సందు దొరికింది. ఏడాది కిందటే సార్వత్రిక ఎన్నికలు.. మొన్నటికి మొన్న జరిగిన పంచాయితీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికలతో గల్లాపెట్టే నింపుకున్న పత్రికా యజమాన్యాలు.. కరోనా లాక్ డౌన్ వచ్చి పట్టుమని పదిరోజులు కాకముందే నష్టాల పేరుతో జర్నలిస్టును సాగనంపాయి. అందరి గురించి ఆలోచించే జర్నలిస్టులనే రోడ్డున పడేశాయి. సమాజంలోని అన్ని వర్గాల గురించి ప్రభుత్వాలు, ప్రజలు, సంఘాలు ఆలోచిస్తాయి. కానీ ఉద్యోగాలు కోల్పోయి బతుకుజీవుడా అని అర్థాకలితో చస్తున్న జర్నలిస్టులను అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు.. చివరకు జర్నలిస్టులతో పుట్టిన జర్నలిస్టు సంఘాలు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
*నేరం ఎవరిది? శిక్ష ఎవరికి?
కరోనాతో వచ్చిన లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు. ఉద్యోగ ఉపాధి పోయింది. కానీ ఇన్నేళ్లుగా కోట్లు మింగిన పత్రికలు, మీడియాలు కనీసం ఒక్క నెల కూడా జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో జీతం ఇవ్వలేని స్థితికి దిగజారాయా అన్నది ఇక్కడ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కరోనా ఊడిపడ్డది.. అదో ప్రకృతి విపత్తు. నేరం ఎవరిదో.. కానీ ఇప్పుడు శిక్ష మాత్రం జర్నలిస్టులకు పడింది. పనిచేస్తున్న వారి జీతాలకు కోత పడింది.. రోడ్డునపడ్డ ఎందరో జీవితాలకు కోతపడింది.
*ఎన్నాళ్లీ బానిస బతుకులు?
పేరుకే జర్నలిస్టు.. బయట ఎంతో పేరు. కానీ ఒక ఉపాధి కూలీ సంపాదించినంత కూడా సంపాదన లేని దైన్యం. పేరు గొప్ప ఊరు దిబ్బగా ఉంది నేటి జర్నలిస్టు పరిస్థితి. బయటకు సమాజంలో గుర్తింపు ఉన్న కుటుంబంలో అతడు తెచ్చే సంపాదన చూసిన వారికి ఖచ్చితంగా చులకనే.. 20 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్న వాళ్లకు కూడా నేడు 20వేల రూపాయల జీతం అందుకోని పరిస్థితి. కరోనాలాంటి ఏ విపత్తు వచ్చినా చివరకు రోడ్డున పడేది వారే.. మరి ఎన్నాళ్లీ బానిస బతుకులు.. ఎన్నాళ్లీ ఆకలి చావులు? దీనికి అంతం లేదా? జర్నలిస్టుల జీవితాలను ఎవరు ఉద్దరిస్తారు? ఎవరూ ఉద్దరించన్న వాస్తవాన్ని జర్నలిస్టులు మిత్రులు తెలుసుకోవాలి? ఎవరికి వారు ఈ బానిసవృత్తిని వదిలి కొంత కాంతిరేఖలపై పయణించాల్సిన అవసరం ఉంది.
*మేలుకోండి జర్నలిస్టులారా?
జర్నలిస్టులు రోడ్డున పడ్డ ప్రతీసారి అందరూ సోషల్ మీడియాలో.. వెబ్ సైట్లలో వారి ఆవేదనను అక్షరబద్దం చేస్తున్నారు. శ్రీశ్రీని మించి కలం రచనలతో కరిగిస్తున్నారు. కానీ పత్రికా యాజమాన్యాలు కానీ.. ప్రభుత్వాలు కానీ జర్నలిస్టుల విషయంలో కరిగిన పాపాన పోవడం లేదు. మరి ఏం చేయాలి? అంటే మేలుకోవాలి? కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి. కుటుంబాలను కాపాడుకోవాలని.. ఆత్మస్థైర్యంతో ఈ పత్రిక యాజమాన్యాల కుల్లు కుతంత్రాలకు బలికాకుండా ఇప్పటికైనా తమలోని సృజనాత్మకథను జర్నలిజం టాలెంట్ ను ఉపయోగించుకొని పైకి రావాల్సిన అవసరం ఉంది. పత్రికలు, న్యూస్ చానెల్స్ కంటే డిజిటల్ రంగంవైపు అడుగులు వేస్తే వారి జీవితాలు కొత్త ఉపాధిని వెతుక్కున్నట్టవుతుంది. కరోనాతో పత్రికలు, న్యూస్ చానెల్స్ కు ఆదరణ తగ్గింది. అందరూ వాటిని మరిచిపోయి డిజిటల్ మీడియా వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ని సంవత్సరాల అనుభవాన్ని సంపాదించిన జర్నలిస్టులు మిత్రులు.. బాగా రాయగలిగే వాళ్లు ఈ కొత్త ఉపాధి వైపు మళ్లండి.. యూట్యూబ్ చానెల్స్, వెబ్ సైట్స్ రాయడం మొదలుపెట్టండి. ఇక ఈ డిజిటల్ ప్రపంచంలో రిలయన్స్ నుంచి మొదలుపెడితే టైమ్స్ ఆఫ్ ఇండియా ఎన్నో దిగ్గజ సంస్థలు కూడా తెలుగులో వెబ్ సైట్స్ డిజిటిల్ ఫ్లాట్ ఫామ్స్ ఓపెన్ చేశాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి.. పేరుకు పేరు.. గౌరవానికి గౌరవం. శ్రమకు తగిన వేతనం… మీకు మీరే రాజులు.. ఇలా పత్రికలు, చానెల్స్ కుట్రలకు కుతంత్రాలకు మీడియా మిత్రులు తెరదించాల్సిన అవసరం ఉంది.
*ఏకం కాలేరా?
తెలంగాణలోని ప్రధాన రెండు పత్రికల్లో నంబర్ 1 పత్రిక అందరికీ లీవుల పేరిట ఇంటికి పంపింది. రెండో ప్రధాన పత్రిక మాత్రం హోల్డ్ పేరిట అందరినీ ఇంట్లో కూర్చండబెట్టింది. జీతం కూడా సరిగా ఇవ్వలేదు. దాదాపు 150 మంది జర్నలిస్టులను ఆ దమ్మున్న పత్రిక నిర్ధాక్షిణ్యంగా తీసేసిందని మీడియాలో ప్రచారం సాగుతోంది. మరి ప్రజల ఆందోళనలు, ఆవేశాలను, ప్రభుత్వాలను పత్రికల్లో రాతల ద్వారా నిలదీసే మీరే ఏకం కాలేరా? మీ సమస్యలపై మీరు పోరాడలేరా? అందుకే తీసేసిన జర్నలిస్టులందరూ ఏకంగా కావాల్సిన అవసరం ఉంది. వారి సమస్యలపై చర్చించాలి.? కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి. వాట్సాప్ గ్రూపుగా మారాలి. ఇంతమంది జర్నలిస్టులకు ప్రపంచం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఐకమత్యంతో ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. ఎన్నో సంస్థలు జర్నలిస్టుల కొరతతో ఉంటున్నాయి. ఇలాంటి గ్రూపు ఒకటి ఉంటే వారే సంప్రదిస్తారు. వారి అనుభవానికి పెద్ద పీట వేస్తారు.. తగిన ఉపాధి.. జీతం.. జీవితం కల్పిస్తారు.. మరి ఇప్పటికైనా జర్నలిస్టుల మేల్కోండి.. అందరూ ఏకమై మీ సమస్యలను తరిమికొట్టండి.. గుర్తుంచుకోండి.. టాలెంట్ ఉన్నోడిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు.. ఆల్ ది బెస్ట్..
— నరేష్ ఎన్నం