
Journalist Rajdeep Sardesai On KCR: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. కుదిరితే ప్రధాని పీటం అధిష్టించాలని కలలు కంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే. పార్టీ పేరు మారింది తప్ప జాతీయ గుర్తింపు.. జాతీయ స్థాయిలో చేరికలు మాత్రం పెద్దగా ఉండడం లేదు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. సరిగ్గా ఏడాది గడువే ఉంది. దీంతో కేసీఆర్ విపక్షాలకు బంపర్ ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. విపక్ష కూటమికి తనను చైర్మన్ చేస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష పార్టీల ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తానని సమాచారం. దీంతో ఒక్కసారిగా జాతీయ రాజకీయాలు వేడెక్కాయి.
వీడియో వైరల్..
ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కేసీఆర్ విపక్షాలకు ఆఫర్ ఇచ్చిన వీడియోను బయటపెట్టారు. టీఆర్‌ఎస్‌ను ఇప్పటికే బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్ మహారాష్ట్రకు టూర్లు వేస్తున్నారు. ఈ ఈ క్రమంలో మోదీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్‌గా నిర్ణయిస్తే.. 2024 ఎన్నికల్లో క్యాంపెయిన్ కోసం దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలకు తాను ఫైనాన్స్ చేస్తానని చెప్పారు. తన సహచర నేతలతో ఓ ప్రైవేటు సమావేశంలో కేసీఆర్ వెల్లడించారు. ఈ విషయాన్ని రాజ్‌దీప్ వీడియోలో వెల్లడించారు.
పైసలతోనే అంతా…
ప్రజాస్వామ్యంలో పైజలు పెడితే ఏదైనా చేయవచ్చన్న భావనలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉన్నారు. అందుకే మొన్నటి మునుగోడు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం వందల కోట్లు ఖర్చు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను మరింత ఖరీదు చేయాలని చూస్తున్నారు. ఈమేరకు ఇప్పటి నుంచే నిధులు సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని పీటం దక్కించుకునేందకు పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను తానే ముందుండి నడిపించాలని, విపక్షాల కూటమికి తానే నాయకుడిని కావాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలను కూడగట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
మమత, శరద్‌పవార్, నితీశ్ నుంచి పోటీ..
విపక్ష కూటమికి సార థ్యం విహించడం విషయంలో కాంగ్రెస్ వెనుకడుగు వేస్తోంది. ఈ క్రమంలో విపక్షాలను ఏకం చేసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, మహారాష్ట్ర నేత శరద్‌పవార్, బీహార్‌సీఎం నితీశ్‌కుమార్ ఉబలాట పడుతున్నారు. తర్వాత వచ్చే ఎన్నికల్లో ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే ప్రధాని ఐపోవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ సైతం ప్రధాని పీటంపై కన్నేశారు. అయితే కేసీఆర్‌కు మమత, నితీశ్, శరద్‌పవార్ నుంచి పోటీ ఎదురవుతోంది. దీంతో డబ్బుతో మోదీ వ్యతిరేక పార్టీలను కొనేయాలని చూస్తున్నారు. మరి విపక్ష పార్టీల నేతలు తమ కూటమికి కేసీఆర్‌ను చైర్మన్‌గా చేయడానికి ఇష్టపడతారా? ఆయన ప్రతిపాదనను వారు ఆమోదిస్తారా? కేసీఆర్‌ను సమానుల్లో ప్రథముడిగా అంగీకరిస్తారా? అన్నది తేలాల్సి ఉందని కూడా రాజ్‌దీప్ వ్యాఖ్యానించారు.
ఎన్నికలంటేనే పైసల ముచ్చట..
పార్లమెంటు ఎన్నికలంటే రూ.వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న పని. కనీసం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా. తెలంగాణలో ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లా కాకుండా.. సాదాసీదా ఎన్నికల్లా జరిగితేనే ఇంత మొత్తం పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణలో జరిగినట్లుగానే ఎన్నికలు జరిగితే లక్ష కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ పార్లమెంటు ఎన్నికలను ఖరీదైన ఎన్నికలుగా మార్చాలని చూస్తున్నారు. ఎన్నికలు అంటేనే పైసలు అన్నట్లుగా చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మోదీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలను కూడగట్టాలని ప్రయత్నిస్తున్నారు. డబ్బులు ఎర వేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
‘మహా’ నేతలకు గాలం..
మరోవైపు మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ తరఫున బహిరంగ సభలనూ కేసీఆర్ నిర్వహించారు. పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు, కిందిస్థాయి నేతలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు పలు దఫాలుగా ప్రగతిభవన్‌కు వచ్చి కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర లాంటి చోట్ల అసలు ఇప్పటివరకూ ఉనికే లేని బీఆర్‌ఎస్‌లో ఆ రాష్ట్ర నేతలు చేరడం వెనుక మతలబు డబ్బులే అన్న చర్చ నడుస్తోంది. అంతే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల ఏర్పాటు, వాటి నిర్వహణ వంటి వాటి కోసం కేసీఆర్ ఏమాత్రం వెనుకాడకుండా డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్ ఆఫర్‌పై ప్రధాని ఆరా..
బీఆర్‌ఎస్ పార్టీ ఖర్చు, ఎన్నికల నిధుల విషయం తెలిసి ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ఆశ్చర్యపోయునట్లు తెలిసింది. ఢిల్లీలో జరిగిన బీజేపీ సమావేశంలో బీఆర్‌ఎస్‌కు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. వాస్తవానికి దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్ ధనిక పార్టీ. ఆ పార్టీ పేరిట ఉన్న డిపాజిట్లు, ఆస్తులు రూ.వెయ్యి కోట్ల వరకు ఉన్నట్లు పార్టీ అధినాయకత్వమే స్వయంగా ప్రకటించింది. అంతే కాకుండా అధినేత కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటనలు చేసేందుకుగాను ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇదంతా చాలా చిన్న విషయమని, కేవలంపైకి కనిపించేది మాత్రమేనన్న అభిప్రాయం ఉంది. ఎన్నికల ఖర్చులకు, ఇతర రాజకీయ అవసరాలకు భారీ నిధులను క్షణాల్లో సమీకరించగల స్థాయిని కేసీఆర్ ఏర్పాటు చేసుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
బీఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడే ఆయా రాష్ట్రాల్లోని వివిధ పార్టీల లోక్‌సభ అభ్యర్థులకు భారీగా నిధులు ఖర్చు చేసిన కేసీఆర్.. ఇప్పుడు జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవాలని గట్టిగా పనిచేస్తున్నందున విపక్షాలకు ఆఫర్‌లు ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
If you have to believe Rajdeep, KCR has got money to buy the PM seat🙆♂️ Where did he get all the money? 🙆♂️🙆♂️🙆♂️ pic.twitter.com/NfspbuSajd
— Boiled Anda 🥚🇮🇳 (@AmitLeliSlayer) April 3, 2023