టీవీ జర్నలిస్టు, యాంకర్ రఘు అరెస్టు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మొదట ఆయన్ను కిడ్నాప్ చేసినట్టు వార్తలు రాగా.. ఆ తర్వాత ఆయన్ను పోలీసులు తీసుకెళ్లారని తేలింది. దీంతో.. రఘును పోలీసులు ఎందుకు తీసుకెళ్లారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది. అందరూ కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. చాలా మంది మాత్రం ఒకే కారణం చూపెడుతున్నారు.
రఘు పలు టీవీ ఛానళ్లలో పనిచేశారు. ప్రస్తుతం తొలివెలుగు యూట్యూబ్ చానల్ లో పలు కథనాలు ప్రసారం చేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. అదే సమయంలో టీఆర్ఎస్ వ్యతిరేకంగా గళం వినిపించే ఉద్యమకారులను, ఇతరులను ఇంటర్వ్యూలు చేస్తున్నారు.
అంతేకాకుండా.. కోకాపేట కాందీశీకుల భూములు, ఐడీపీఎల్ భూముల రిజిస్ట్రేషన్లు తదితర అంశాలు ప్రసారం అయ్యాయి. అదేవిధంగా గతంలో సూర్యపేట జిల్లా గుర్రంపోడు అసైన్డ్ భూముల వ్యవహారంపై ప్రసారం చేసిన కథనాలు సంచలనం అయ్యాయి. ఆ అంశం రాజకీయంగా కూడా వేడి పుట్టించింది. ఈ క్రమంలోనే నెలకొన్న ఘర్షణ విషయంలో రఘుపై కేసులు కూడా నమోదైనట్టు సమాచారం.
గుర్రంపోడు తండా 540 సర్వే నెంబర్ విషయంలో జరిగిన ఘర్షణలో రఘు నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులోనే రఘును అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇచ్చామని తెలిపారు. అతన్ని హుజూర్ నగర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో.. హుజూర్ నగర్ సబ్ జైలుకు తరలించారు.