Jind woman: కంటే కూతుర్నే కనాలి.. మనసుంటే మగాడిలా పెంచాలి.. అప్పట్లో విడుదలైన ఓ సినిమాలో బహుళ ప్రాచుర్యం పొందిన పాట ఇది. కాకపోతే నేటికి కూడా చాలామంది ఆడపిల్లలను తమ వారసులుగా గుర్తించలేరు. ఇప్పటికీ మగాళ్లు మాత్రమే తమకు అసలుసిసలైన వారసులని భావిస్తుంటారు. ఆడపిల్లలు అన్ని రంగాలలో దూసుకుపోతున్నప్పటికీ.. మగాళ్ళకు మించి విజయాలు సాధిస్తున్నప్పటికీ.. మన సమాజం ఇప్పటికీ ఆడపిల్లలను వారసులుగా గుర్తించలేకపోతోంది.
చాలామంది తల్లిదండ్రులు (ఇందులో విద్యావంతులు కూడా ఉన్నారు) తమ వారసులుగా మగాళ్ళను మాత్రమే గుర్తిస్తున్నారు. అయితే తొలి, రెండో సంతానంలో ఆడపిల్లలు పుట్టినప్పటికీ.. వారసుల కోసం ఎదురుచూస్తున్నారు. చివరికి వారసుడిని కని తమ కలను నెరవేర్చుకుంటున్నారు. అయితే హర్యానా రాష్ట్రంలో ఓ దంపతులు తమ వారసుడి కోసం ఏకంగా 24 ఏళ్ల పాటు నిరీక్షించారు. దీనికోసం ఏకంగా తొమ్మిది మంది కుమార్తెలను కన్నారు. చివరికి తమకలను నెరవేర్చుకున్నారు.
ఇటీవల కాలంలో హర్యానా రాష్ట్రంలో ఓ దంపతులు తమ వారసుడి కోసం చాలామంది ఆడపిల్లలను కన్నారు. చివరికి తమ వారసుడికి జన్మనిచ్చి కలను నెరవేర్చుకున్నారు. ఇప్పుడు అదే రాష్ట్రంలో కూడా అటువంటి సంఘటనే చోటుచేసుకుంది. హర్యానా రాష్ట్రంలోని జింద్ జిల్లా ఉచన కలాన్ గ్రామానికి చెందిన సురేంద్ర, రీతు అనే దంపతులకు సరిగా 24 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి 9 మంది కుమార్తెలు. ఇందులో పెద్ద కుమార్తె వయసు 21 సంవత్సరాలు. చిన్న కుమార్తె వయసు మూడు సంవత్సరాలు. తాజాగా రీతు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సురేంద్ర సోదరుడికి కూడా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దీంతో ఆ ఉమ్మడి కుటుంబంలో మొత్తం 12 మంది ఆడపిల్లలకు ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. దాదాపు రెండు దశాబ్దాల ఎదురుచూపు తర్వాత కుమారుడు పుట్టడంతో సురేంద్ర దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి
ఈ తరహా సంఘటనే హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ జిల్లా భోజరాజు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలో సంజయ్, సునీత అనే దంపతులకు 19 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పదిమంది ఆడపిల్లలు పుట్టారు. 11వ సంతానంగా అబ్బాయి పుట్టాడు.