
JD Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ… పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటివరకూ ఎంతో మంది సీబీఐలో పనిచేశారు. కానీ ఏపీకి చెందిన లక్ష్మీనారాయణ మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు. ఏపీ సీఎం జగన్ కేసులు విచారించడమే అందుకు కారణం. ఇంటి పేరు కంటే జేడీ లక్ష్మీనారాయణగానే ఆయన తెలుగునాట సుపరిచితం. అయితే వలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. విశాఖ లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా ఎంపీగా పోటీచేశారు. కానీ ఓటమే ఎదురైంది. అయితే 3.50 లక్షలకుపైగా ఓట్లు సాధించుకున్నారు. కానీ ఎన్నికల అనంతరం జనసేనకు దూరమయ్యారు. ప్రస్తుతం సామాజికవేత్తగా సేవలందిస్తున్నారు.
సామాన్య కుటుంబం నుంచి వచ్చిన లక్ష్మీనారాయణకు వ్యవసాయమంటే మక్కువ. అందుకే వ్యవసాయంలో సేంద్రీయ విధానాలను ప్రోత్సహిస్తూ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. సామాజిక రుగ్మతలపై పోరాటం చేస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీచేసిన విశాఖ పార్లమెంట్ స్థానంపైనే మక్కువ పెంచుకున్నారు. తన వ్యక్తిత్వాన్ని, సిద్ధాంతాలను నచ్చి పిలిచే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరుతానని స్పష్టం చేయలేదు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాలన్నదే జేడీ లక్ష్మీనారాయణ అభిమతం. వ్యవసాయమంటే మక్కువ ఉండడంతో ఆ రంగంలో వినూత్న సాగు పద్ధతులపై అధ్యయనం చేశారు. తాను వ్యవసాయ శాఖ మంత్రి అయితేనే రైతాంగానికి మేలు జరుగుతుందన్న భావనతో ఉన్నారు. అందుకే తన భావజాలాన్ని అర్ధం చేసుకోగల పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడున్న సిట్యువేషన్ లో అధికార వైసీపీలోకి వెళ్లలేని పరిస్థితి. అలాగని ప్రధాన విపక్షం టీడీపీలోకి వెళితే విమర్శలు వస్తాయని భావిస్తున్నారు. అయితే పవన్ విషయంలో విభేదించి బయటకు రావడంతో మరోసారి ఆ పార్టీలో చేరేందుకు సంశయిస్తున్నారు.

ఒకవేళ జనసేన, టీడీపీతో కలిసి అడుగులేస్తే బీజేపీలోకి వెళ్లాలన్నదే జేడీ లక్ష్మీనారాయణ వ్యూహం. కానీ దానికి విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. మూడు పార్టీల మధ్య పొత్తు ఇంకా స్పష్టత రావడం లేదు. అందుకే వేచిచూసే ధోరణిలో ఉన్నారు. కానీ వచ్చేఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీచేయడం ఖాయంగా తెలుస్తోంది. అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగి ప్రభావం చూపాలని జేడీ లక్ష్మీనారాయణ భావిస్తున్నారు. అయితే ముందుగా ఏదో ఒక ప్రధాన పార్టీ నుంచి పోటీ చేయాలని ఆప్షన్ గా పెట్టుకున్నారు. అది కుదరకపోతే స్వతంత్ర అభ్యర్థిగా దిగనున్నట్టు తెలుస్తోంది.