
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకతీతంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బుధవారం కూడా ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్‌ను ముట్టడించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో నగరంలోని సరస్వతీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనగా వెళ్లారు. కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలతో హోరెత్తించారు. పోటెత్తిన జన ప్రవాహంతో కలెక్టరేట్‌కు వెళ్లే అన్ని మార్గాల్లోనూ వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నాలు సాగించారు. వారికి చాలా కష్టతరంగా మారింది. ఉక్కు ఉద్యోగుల ర్యాలీకి పలు రాజకీయ పార్టీలు సైతం మద్దతు తెలిపాయి.
ఈ ఉద్యమానికి నేతృత్వం వహించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిర్వాసితులను ఉద్దేశించి మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రజల గుండె చప్పుడని.. ప్రైవేటీకరణ చేయడం తగదని అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరును ఉధృతం చేస్తామని హెచ్చరించారు.