
Jayamangalam Venkataramana: తెలుగుదేశం పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇతర పార్టీల్లో ఉన్న నేతలు టీడీపీలో చేరాలని అధినేత చంద్రబాబు పిలుపునిస్తుంటే… ఇప్పుడు పార్టీలో ఉన్న నాయకులు బయటకు వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కవన్న వారు పక్కచూపులు చూస్తున్నారు. కృష్ణా జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణ టీడీపీకి రాజీనామా చేశారు. అయితే 24 గంటలు గడవక ముందే మరో నాయకుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒక వైపు లోకేష్ పాదయాత్ర, మరోవైపు చంద్రబాబు జిల్లాల యాత్ర చేపడుతున్న సమయంలో నాయకులు షాక్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయి.
Also Read: BJP Donations: అధికారంలో ఉంటే అంతే… బిజెపికి ఎన్ని విరాళాలు వచ్చాయో తెలుసా?
చిత్తూరు చంద్రబాబు సొంత జిల్లా. అదే జిల్లా నుంచి లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. అదే జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. వారి ఆశలపై నీళ్లు చల్లేలా కీలక నాయకుడు ఒకరు పార్టీకి దూరం కావడం చర్చనీయాంశమైంది. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుబ్రహ్మణ్యం పార్టీకి గుడ్ బై చెప్పారు. గత పదిహేను సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేశానని.. అయినా ఏ గుర్తింపునకు నోచుకోలేదని చెబుతూ ఆయన పార్టీని వీడారు.

2009లో ప్రజారాజ్యం పార్టీతో సుబ్రహ్మణ్యం పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆయన పీఆర్పీలో చేరి శ్రీకాళహస్తి నుంచి పోటీచేశారు. 26 వేల ఓట్లను సొంతం చేసుకున్నారు. ఆ ఎన్నికల బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి గెలుపొందారు. అటు తరువాత పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం చేశారు. కానీ సుబ్రహ్మణ్యం మాత్రం టీడీపీ వైపు వచ్చారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో రాష్ట్రస్థాయి పదవులిచ్చిన టీడీపీ.. 2014 ఎన్నికల్లో గెలుపొందినా ఎటువంటి నామినేట్ పోస్టులు కేటాయించలేదు. ఇటీవల పార్టీలో కూడా సుబ్రహ్మణంకు ప్రాధాన్యం తగ్గింది. దీంతో కలత చెందిన ఆయన రాజీనామా ప్రకటించారు. అనుచరులు, అభిమానులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని చెప్పారు. బహుశా ఆయన జనసేనలో చేరుతారన్న టాక్ నడుస్తోంది. పీఆర్పీలో పనిచేయడం వల్ల పవన్ వైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.
Also Read:
CM KCR Kondagattu: కొండగట్టు భూములపై ‘కల్వకుంట్ల’ కన్ను.. అందుకే అంజన్న గుర్తొచ్చాడా!?