JanaSena Social Media: ఏపీలో జనసేనకు మీడియా సపోర్టు అంతంతమాత్రమే. టీడీపీతో అనుకూల వాతావరణం ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియా సంస్థలు పవన్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నాయి. మిగతా సమయాల్లో మాత్రం ఏదో మూలన వార్తలతో సరిపెడుతున్నాయి. ఇక వైసీపీ అనుకూల మీడియా అయితే అసలు జనసేన ఒక పార్టీయేనన్న చులకన భావనతో అసలు కవరేజే ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో జనసేన నూతన పంథా ఎంచుకుంది. అదే సోషల్ మీడియా వింగ్. అయితే జనసేనకు ప్రత్యేక సోషల్ మీడియాతో పనిలేదు. ఎందుకంటే జనసైనికులే ఆ పార్టీ కొండంత అండ. ఏ పార్టీకి లేనంతగా హార్ట్ కోర్ ఫ్యాన్స్ జనసేనకు ఉన్నారు. వారే సోషల్ మీడియా బాధ్యతలను కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టింగ్ లు, కామెంట్లు పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. విశాఖ గర్జనకు ముందు ఎందుకీ గర్జనల పేరిట పవన్ గర్జిస్తూ చేసిన కామెంట్స్ తొలుత సోషల్ మీడియా ఒక హైప్ క్రియేట్ చేశారు. ఏపీ పాలిటిక్స్ లో పెను దుమారమే రేపాయి. తరువాత విశాఖ ఎపిసోడ్ లో యుద్ధ వాతావరణమే సృష్టించాయి.

ఈ నెల 15న విశాఖ గర్జన పేరిట వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. దాదాపు పాతిక ట్విట్లతో అధికార వైసీపీపై విరుచుకుపడ్డారు. ఎందుకీ గర్జనలు పేరిట కడిగి పారేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి మాట తప్పిన అంశాల వరకూ ప్రస్తావించి ఉతికి ఆరేశారు. కానీ దీనికి వైసీపీ నుంచి సరైన రిప్లయ్ రాలేదు. షరా మామ్మూలుగా వ్యక్తిగత దాడితోనే వైసీపీ నేతలు సరిపెట్టుకున్నారు. గతంలో ఇంతలా ఎప్పుడు పవన్ రియాక్టు కాలేదు. కానీ ప్రజల్లో ప్రాంతీయ వాదాన్ని రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించడాన్నిపవన్ సహించలేకపోయారు. అందులో భాగంగా వరసు ట్విట్లు సంధించారు.
ఇప్పుడు తాజాగా మరోసారి ట్విట్టర్ లో నేరుగా మంత్రులపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. మీకు కేటాయించిన శాఖలకు న్యాయం చేసేది ఏమైనా ఉందా? లేకుంటే చౌకబారు విమర్శలు చేసి పదవీ కాలం వెళ్లదీస్తారా? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు కురిపించారు. తొలుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో మొదలు పెట్టారు. ఏపీలో అప్పుల చిట్టా ఎంతో చెబుతారా? ఒక్కో పౌరుడిపై ఎంత భారం మోపారో? వివరణ ఇవ్వగలరా బుగ్గనా? అంటూ ప్రశ్నించారు. కొండలు, చెరువుల్లోకాకుండా నివాసయోగ్యమైన భూముల్లో నాణ్యమైన ఇళ్లు ఎన్ని కట్టించారో చూపించగలవా జోగి? అని జోగి రమేష్ ను ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనకు ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో సామాన్య ప్రజలకు ‘అర్ధమయ్యే భాష’లో చెప్పగలవా బొత్స? అని బొత్స సత్యనారాయణకు ప్రశ్నించారు. నీ రికార్డింగ్ డ్యాన్స్ లు అయిపోయాక ఖాళీ సమయాల్లో నువ్వు కష్టపడి తీసుకొచ్చిన పరిశ్రమల గురించి శ్వేతపత్రం విడుదల చేయగలవా గుడివాడ? అని మంత్రి అమర్నాథ్ ను ప్రశ్నించారు. పర్యాటకరంగ అభివృద్ధి కోసం నువ్వు చేసిన బృహత్ కార్యలేమిటోచెప్పగలవా మహానటి రోజా? అని ప్రశ్నించారు. ఇంకెంతమందిని మీ గుంతల రహదారులు బలితీసుకుంటే మొద్దు నిద్ర వీడుతావో తెలపగలవా దాడిశెట్టి? అని ప్రశ్నించారు. మీ సహచర మంత్రులు అనారోగ్యానికి గురైతే పక్క రాష్ట్రాల్లోకి పారిపోకుండా ఏపీలోనే స్థాయి వైద్య సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారు పబ్లిసిటీ క్వీన్ విడదల రజనీ? అంటూ పవన్ సెటైరికల్ గా సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజాలకు చెప్పు చూపిస్తూ పవన్ హెచ్చరికలు జారీచేయడం చర్చనీయాంశమైంది.

అయితే జనసేన సోషల్ మీడియా ఒక్క అటాక్ కే పరిమితం కాలేదు. వైసీపీ ఆడే రాజకీయ క్రీనీడలను గుర్తించి ముందుగానే సోషల్ మీడియా ద్వారా అలెర్ట్ చేస్తున్నారు. ఈ మధ్యన వైసీపీ మీడియాకు ఒక లీకు ఇచ్చింది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై జనసేన శ్రేణులు అటాక్ చేస్తాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న మాదిరిగా ఒక బులెటిన్ ను బయటకు వదిలింది. అయితే దీనిపై సోషల్ మీడియా వేదిక చేసుకొని జనసేన అగ్రనేతలు నాగబాబు, నాదేండ్ల మనోహర్ శ్రేణులను అలెర్ట్ చేశారు. కోడికత్తి తరహాలో వైసీపీ ప్లాన్ చేస్తోందని.. దానిని తిప్పికోట్టాలని పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ పన్నాగం ఆదిలోనే బూమరంగ్ అయ్యింది. అయితే ఇటీవల జనసేన సోషల్ మీడియా జెడ్ స్పీడ్ లో యాక్టవ్ గా ఉండడం ఆ పార్టీకి అనుకూల అంశంగా మారిందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.