మరికొద్ది రోజుల్లో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి అన్ని పార్టీలూ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. అయితే.. ఈ ఉప ఎన్నికలో ఓ చిన్న ట్విస్ట్ చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా ఏపీలో బీజేపీ, జనసేనలు మిత్రపక్షం. ఇందులో భాగంగానే ఏపీలో బీజేపీకి జనసేన మద్దతుగా నిలుస్తూ వస్తోంది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ పోటీలో నిలవకుండా బీజేపీతో జతకట్టింది.
Also Read: అదే జరిగితే జగన్ ప్రభుత్వం కూలడం ఖాయమా..?
మరోవైపు.. త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లోనూ ఇద్దరి మధ్య ఒప్పందంతో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారని అందరూ అనుకున్నారు. అంతేకాదు.. తిరుపతి లోక్‌సభ సీటును బీజేపీకి ఇవ్వడానికి పవన్ కల్యాణ్ అంగీకరించారంటూ సోము వీర్రాజులాంటి వాళ్లు ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ.. దీనిపై జనసేన వైపు నుంచి స్పందన లేదు. ప్రతిస్పందన మాత్రం రీ సౌండింగ్ వచ్చేలా ఇస్తున్నారు పవన్ కల్యాణ్. తిరుపతి విషయంలో జనసేననే పోటీ చేస్తుందన్న సంకేతాలను గట్టిగానే పంపుతున్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో జనసేన కార్యనిర్వాహక కమిటీని పవన్ కల్యాణ్ హఠాత్తుగా ప్రకటించారు. కమిటీ సభ్యులుగా డా.పి.హరిప్రసాద్, మనుక్రాంత్ రెడ్డి, రాందాస్ చౌదరి, కిరణ్ రాయల్, వినుత, పొన్న యుగంధర్, ఉయ్యాల ప్రవీణ్, తీగల చంద్రశేఖర్, గూడూరు వెంకటేశ్వర్లు, కంటేపల్లి ప్రసాద్‌ని నియమించారు.
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ వ్యవహారాలన్నింటినీ వీరు చూసుకుంటారు. జనసేన కమిటీ వేయడంతో ఇప్పుడు బీజేపీలో కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకుండా వెనక్కి తగ్గిన తర్వాత జనసేన పార్టీ క్యాడర్ నిరుత్సాహానికి గురైంది. తిరుపతిలో పవన్ కల్యాణ్ అలాంటి నిర్ణయం తీసుకోబోరన్న నమ్మకంతో వారున్నారు. దానికి తగ్గట్లుగానే పవన్ కల్యాణ్.. తిరుపతి విషయంలో గట్టిగానే ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్ మొహమాటాన్ని ఆసరాగా చేసుకున్న బీజేపీ నేతలు.. ఆయన తరపున ప్రకటనలు చేసేస్తూ.. తామే పోటీ చేస్తామని జనసేన మద్దతిస్తుందని చెబుతున్నారు. ఓ అడుగు ముందుకేసి నడ్డా వద్ద పవన్ ఒప్పుకున్నారని కూడా ప్రచారం చేసేశారు.
Also Read: 2021 ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్నాయా..?
అయితే.. ఈ ప్రచారం కాస్త జనసేన అగ్రనాయకత్వానికి ఆగ్రహం తెప్పించింది. అయితే పొత్తు పరిధి వారు దాటినా తాము దాటకూడదన్న అభిప్రాయంతో ఉన్నారు. అలాగని.. తమ రాజకీయం తాము చేయకుండా ఉండే ప్రసక్తే లేదని లోక్‌సభ కమిటీని ప్రకటించడం ద్వారా స్పష్టం చేశారు. జనసేన తరపున తిరుపతి నుంచి పోటీ చేయడానికి పలువురు రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పవన్ కల్యాణ్‌ను సంప్రదిస్తున్నారు. పవన్ కల్యాణ్ మదిలో కూడా ఓ ఇంటలెక్చువల్ అయిన మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తే ఇన్నాళ్లు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ–జనసేనలు ఈ తిరుపతి ఉప ఎన్నికతో రాజకీయం ఎటు మలుపు తిరగబోతోందా అని ఆసక్తిగా మారింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్