
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవరేంటో చూపించడానికి ఆంధ్రప్రదేశ్ లో రెడీ అయ్యారా? ఏడేళ్ల క్రితం ప్రారంభించిన జనసేన పార్టీకి ఇప్పటిదాకా జిల్లా, రాష్ట్ర కమిటీలను వేయలేదు. ఇప్పుడు సడెన్ గా పవన్ కళ్యాణ్ ఈ కమిటీలను వేయడం వెనుక కారణం ఏంటి? పార్టీని ఎందుకు బలోపేతం చేస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో పవన్ క్రియాశీలక పాత్ర పోషిస్తారా? ప్రత్యామ్మాయ రాజకీయ శక్తిగా ఎదుగుతారా? ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతారా? ఈ ప్రశ్నలన్నింటికి ఔననే సమాధానం వస్తోంది. జనసేనాని వేస్తున్న అడుగులు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా అన్ని జిల్లాలకు కమిటీలు వేశారు. రాష్ట్ర కమిటీలను నియమించారు. ప్రకాశం, నెల్లూరు, విజయవాడ నగరం, అనంతపురం , తూర్పుగోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ కమిటీలతోపాటు ‘జనసేన పార్టీ కార్యక్రమాల విభాగం రాష్ట్ర కమిటీని పవన్ ఏర్పాటు చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిసారి సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి సొంతంగా పోరాడలేకపోయారు. 2014లో అప్పటి టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలిపి వాటిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇక కేంద్రంలో బీజేపీ ప్రత్యేక హామీ ఇవ్వకపోవడం.. చంద్రబాబు చేసిన మోసం అంటూ ఆ రెండు కూటములతో విడిపోయారు.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీకి దూరంగా కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ఏపీ బరిలో దిగారు. పవన్ రెండు చోట్ల ఓడిపోవడంతోపాటు జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది.
ఆ ఓటమితో ఇక రాజకీయాలు వదిలి సినిమాల బట్టారు. డబ్బుల కోసం సినిమాలు చేస్తున్నానని తెలిపారు. ఆ తర్వాత పరిణామాలతో బీజేపీకి దగ్గరై ఇప్పుడు ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకొని ముందుకెళుతున్నాయి. అవగాహనతో ఎన్నికల్లో పోటీచేస్తున్నాయి.
నిజానికి అధికార వైసీపీతో పోల్చినా.. ప్రతిపక్ష టీడీపీతో పోల్చినా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల బలం జనసేనకు అస్సలు లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కానీ పవన్ అంటే అభిమానమున్న యువత, విశ్వసనీయత గల యువతరం నాయకులు జనసేనను ఓన్ చేసుకొని గ్రామాల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొని మొన్నటి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందారు. ఇక కాపు కులం కూడా జనసేన గెలవడానికి దోహదపడిందంటారు. జనసేన పార్టీతో సంబంధం లేకుండా కాపులంతా జనసేన తరుఫునే నిలబడ్డారు. వాళ్ల కులమే గ్రామాల్లో జనసేనను గెలిపించిందంటున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 22 శాతం వరకు ఓట్లు సంపాదించిన జనసేన.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి తేలిపోతోంది. కనీసం కాపు ఓట్లు ఉన్న ప్రాంతాల్లో కూడా జనసేనాని పవన్ గెలవలేకపోయాడు? ఎందుకు? తేడా ఏంటి? అంటే పవన్ ఎన్నికల్లో ఏదో పార్టీకి మద్దతు తెలుపుతూ.. జనసైనికులను, నేతలను పట్టించుకోకపోవడమే.. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఈ పరిణామంతో ప్రజల్లో, కాపునేతల్లో విశ్వాసాన్ని తెచ్చుకోలేకపోతున్ానరు.
మొన్నటికి మొన్న హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేయించి మరీ బీజేపీ ఒత్తిడికి జనసేన నేతలను విత్ డ్రా చేయించాడు. ఇక తిరుపతి ఎంపీ సీటును బీజేపీకి ధారదత్తం చేస్తున్నాడు. ఇలాగే సాగితే జనసేన కోసం పాటుపడుతున్న.. పనిచేస్తున్న జనసైనికులు ఇక పక్క పార్టీల పల్లకీ మోసే వారిగానే ఉండాలా? వారికి సీట్లు, గెలుపు వద్ద అన్న నిసృహ వారిలో నెలకొంది. పవన్ కీలకమైన సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ఇతరులకు మద్దతు ఇవ్వడం.. జనసేననే నమ్ముకొని ఉన్న వారిని నట్టేట ముంచడం సర్వసాధారణమైపోయిందన్న ఆవేదన వారిలో ఉంది.. అదే గ్రామాల్లో చూసుకుంటే ఈ ధోరణి ఉండదు. జనసేన తరుఫున గ్రామంలో నేతలు, యువతి స్వచ్ఛందంగా నిలబడుతారు. అందుకే అక్కడ గెలుపు సాధ్యమైంది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే జనసేన పరిస్థితి వేరుగా ఉండేది.
అందుకే పార్టీ విస్తరణను గుర్తించిన పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన అసలు నేతలను గుర్తించి జిల్లా, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేశారు. తద్వారా వారు పార్టీని ఓన్ చేసుకొని క్షేత్రస్తాయిలో బలోపేతం చేయడానికి వీలు చిక్కింది. తాజాగా ప్రకటించిన జిల్లా, రాష్ట్ర కమిటీలతో జనసేనకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. కొత్త నేతలకు పదవులు వచ్చాయి. వారు 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింతగా బలోపేతం చేసి పవన్ కళ్యాణ్ కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ముందుకు సాగే అవకాశం కలుగుతుంది. పార్టీ జిల్లా రాష్ట్ర కమిటీల వల్ల కొత్త నాయకత్వం వచ్చి పార్టీకి ఉడుకు రక్తంతో విజయాలు దక్కే అవకాశం ఉంటుంది. వీరందరినీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మెరుగైన నేతలుగా తీర్చిదిద్దితే జనసేనకు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో లాభం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ తీసుకున్న ఈ జిల్లా కమిటీలతో జనసేన బలం పెరిగి ప్రధాన ప్రతిపక్షంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వంతోనూ గట్టిగా పోరాడేందుకు జనసేనకు కావాల్సిన బలం కూడా చేకూరుతుంది.