Janasena: వైసీపీ, టీడీపీ వ్యతిరేకులకు ఇక జనసేనే దిక్కా?అధికార వైసీపీలో ఉడికిపోతున్న వైసీపీ నేతలకు ఇక జనసేననే ఆప్షన్ గా మారింది. ఎందుకంటే అధికార వైసీపీలో ఉండలేరు. చంద్రబాబుకు వయసైపోవడం.. ఆయన పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేకపోవడం.. ఇక చంద్రబాబూ స్వయంగా జనసేనతో పొత్తుకు వెంపర్లాడడంతో ఇప్పుడు అందరూ నాయకులు పెద్దగా లేని జనసేన వైపు చూస్తున్నారు. ఎందుకంటే టీడీపీలో చేరినా పొత్తుల ఎత్తుల్లో సీట్లు దక్కడం కష్టమే.అదే జనసేనలో అయితే క్షేత్రస్థాయిలో నాయకులు పెద్దగా లేకపోవడంతో ఖచ్చితంగా సీట్లు సంపాదించవచ్చన్న భావన నేతల్లో వ్యక్తమవుతోంది.
జనసేనలో పట్టుమని పది మంది కూడా అగ్రనేతలు లేరు. మొన్న నిర్వహించిన సమావేశంలో కేవలం ముగ్గురే ప్రధానంగా కనిపించారు. అందులో ఒకరు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, జనసేనలో నంబర్ 2 నాదెండ్ల మనోహర్. ఇక మధ్యలో పవన్ అన్నయ్య నాగబాబు. ఈ ముగ్గురు తప్ప దిగ్గజ నేతలు ఎవరూ లేరు.
ఇప్పుడు అధికార వైసీపీకి ప్రత్యామ్మాయంగా జనసేన ఎదుగుతోంది. చంద్రబాబు ప్రతిపక్ష పాత్రను జనసేన భవిష్యత్తులో పోషించబోతోంది. అయితే అందుకు సరిపడా నాయకులు జనసేనకు లేరన్నది కాదనలేని వాస్తవం. అందుకే ఇప్పుడు అధికార వైసీపీలో, టీడీపీలోని బలమైన నేతలు, టికెట్లు దక్కని వారంతా జనసేన వైపు చూస్తున్నారు. జనసేనలో అయితే నాయకులు లేకపోవడంతో ఈజీగా సీట్లు దొరుకుతాయని.. తమకు అవకాశం దక్కుతుందని బలంగా నమ్ముతున్నారు.
Also Read: KTR: బస్తీమే సవాల్.. కిషన్ రెడ్డిని సన్మానిస్తానంటున్న కేటీఆర్ .. కారణమిదే..
ఇక జనసేనలో చేరబోయే తొలి పెద్ద వికెట్ నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడంతోపాటు తనపై ఉన్న కేసులను కూడా అధిగమించేందుకు బీజేపీలోకి ఫిరాయించాలని ఆయన మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏంటంటే? రఘురామ రాజుకు జనసేన ఇప్పుడు ఆయువుపట్టుగా మారింది. పవన్ సారథ్యంలోని ఈ పార్టీలో చేరాలని చూస్తున్నారు. ఎలాగూ టీడీపీ, బీజేపీలు జనసేనతో పొత్తు పెట్టుకుంటాయి కాబట్టి.. జనసేనలో చేరితే టికెట్ ఖాయం.. సీటు ఖాయం అని రఘురామ స్కెచ్ గీస్తున్నారట..
నరసాపురంలో టీడీపీకి పెద్దగా బలం లేదు. కాపులు అత్యధికంగా ఉన్న ఈ సీటు ఎలాగూ ఓటు షేరింగ్ లో భాగంగా జనసేనకే చెందుతుంది. అందుకే ముందస్తుగానే నరసాపురం టికెట్ కోసం రఘురామ రాజు జనసేనలో చేరడానికి సిద్ధమైనట్లుసమాచారం. ఇక బీజేపీకి ఈ నియోజకవర్గంలో గణనీయమైన బలం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కూడా జనసేనకే ఈ టికెట్ ఇస్తే బీజేపీ బలంతో ఈజీగా గెలవొచ్చని రఘురామ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇటీవల భీమ్లానాయక్ కు ఏపీలో ఇబ్బందులపై మొదట స్పందించింది రఘురామరాజే. జగన్ ప్రభుత్వాన్ని దూషించి ఈ ఉద్యమాన్ని రగిలించిన మొదటి వ్యక్తి ఆయన. దీంతో రఘురామరాజు చూపు ఇప్పుడు జనసేన వైపు పడింది.
ఇక రఘురామరాజే కాదు.. చాలా మంది వైసీపీ నేతలు , టీడీపీ, బీజేపీ అసంతృప్తులు కూడా నాయకుల కొరత ఉన్న జనసేనలో చేరి సీట్లు దక్కించుకునేందుకు రెడీ అయ్యారు.రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జనసేనలోకి జంప్ కానున్నారు. మరి వీరిందరినీ పవన్ కళ్యాణ్ రానిస్తాడా? లేదా? అన్నది వేచిచూడాలి.