
- గుంతల మధ్య రోడ్లను కళ్ళకు కడుతున్న ఫోటోలు, వీడియోలు
- #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో రెండు రోజుల్లో 1.73 లక్షల ట్వీట్స్
- 192.9 మిలియన్లకు #JSPForAP_Roads ద్వారా రోడ్ల దుస్థితి రీచ్
- శనివారంతో ముగియనున్న కార్యక్రమం
Janasena For AP Roads: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియచేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో చేపట్టిన ఈ ఉద్యమంలో వేల మంది పాల్గొని తమ ప్రాంతాల్లోని రోడ్లు ఏ విధంగా పాడైపోయి… ఎంత అధ్వాన్న స్థితిలో ఉన్నాయి తెలియచేస్తున్నారు. లక్షల మంది ఈ ఉద్యమాన్ని సామాజిక మాద్యమాల ద్వారా పరిశీలిస్తూ, రహదారుల దుస్థితిని తెలుసుకొంటున్నారు. ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. గురువారం నుంచి మొదలైన ఈ కార్యక్రమం శనివారం వరకూ సాగుతుంది. తొలి రెండు రోజుల్లో ట్విటర్ లో #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో 1,73,500 ట్వీట్స్ వచ్చాయి. వీటి ద్వారా అటు ఇచ్చాపురం నుంచి ఇటు అనంతపురం వరకూ అన్ని ప్రాంతాల ప్రజలు తమ ఊళ్లలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియపరిచారు. 4,88,700 మేరకు ట్విట్టర్ ఎంగేజ్మెంట్ నమోదైంది. ఈ డిజిటల్ ఉద్యమం రెండు రోజుల్లో 192.9 మిలియన్ల ట్విట్టర్ యూజర్స్ కు రీచ్ అయింది. ఈ ఉద్యమం ట్విట్టర్ ట్రెండింగ్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, జాతీయ స్థాయిలో 5వ స్థానానికి చేరింది.
రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన రోడ్లను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో సామాజిక మాధ్యమాల్లో ప్రజలు చూపుతున్న వీడియోలు, ఫోటోల ద్వారా వెల్లడవుతోంది. అడుగుకో గుంత… గజానికో గొయ్యిలా రాష్ట్రంలో రహదారులు ఉన్నాయి అని శ్రీ పవన్ కల్యాణ్ చెప్పిన విషయం అక్షర సత్యం అనే విషయం ఈ డిజిటల్ ఉద్యమంలో వస్తున్న ఫోటోలు, వీడియోలు చూస్తే అర్థం అవుతుంది. గుంతల మధ్య ఉన్న రోడ్డుపై ఏ విధంగా ప్రయాణం చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల ద్వారా ఫోటోలు, వీడియోలు, సమాచారం పంపించడం సాధ్యం కానివారి కోసం 7661927117 అనే నెంబర్ ఇచ్చి వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ నెంబర్ కు 10,455 ఫోటోలు, 2నిమిషాల నిడివి ఉన్న వీడియోలు 5వేలకు పైగా వచ్చాయి.
ఈ కార్యక్రమంలో జనసైనికులు, జనసేన నాయకులు, క్రియాశీలక సభ్యులు, వీర మహిళలు, యువతతో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ పి.ఏ.సి.ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పార్టీ పి.ఏ.సి. సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజులుగా వచ్చిన స్పందన, ప్రజల ఆవేదనను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారికి తెలియచేశారు.