Pawan kalyan: పొత్తుల ఎత్తుల్లో ప్రతీసారి చిత్తవడం ఎందుకు? ఒకసారి ఒంటరిగా వెళదాం.. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ఇలానే ఒంటరిగా వెళ్లింది.. ప్రజాభిమానాన్ని సాధించింది. ఇప్పుడు ఇదే ఆలోచన చేస్తున్నారట జనసేనాని పవన్ కళ్యాణ్..
Pawan Kalyan
పొత్తుల ఎత్తులు ఎప్పుడూ రాజకీయ అవసరాలపైనే ఆధారపడి ఉంటాయి. తమను అందలం ఎక్కిస్తుందని భావిస్తేనే ఆ పొత్తు పొడుస్తుంది. లేదంటే పొత్తు విడుపులు తప్పవు. ఇప్పుడు ఏపీలో రాజకీయంగా చాలా యాక్టివ్ గా మారిన పవన్ కళ్యాణ్ సైతం రాబోయే ఎన్నికలపై గురిపెట్టి తన మిత్రపక్షం బీజేపీకి షాకివ్వబోతున్నాడా? అన్న చర్చ సాగుతోంది.
తాజాగా పవన్ కళ్యాణ్ తన దర్శకులందరికీ 2023 వరకు సినిమాల షూటింగులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చినట్టు జనసైనికుల ద్వారా తెలిసింది. 2023 నుంచి ఏపీలోనే ఉండాలని.. అక్కడ పాలిటిక్స్ హీట్ పెంచి ప్రజలతో మమేకం అవ్వాలని డిసైడ్ అయ్యాడట.. ఈ మేరకు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేనను నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
జనసేనకు పొత్తులు కలిసిరాలేదు. 2014లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతిచ్చి ఆ పార్టీలను గద్దెనెక్కించడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వారి మోసాలను గ్రహించి దూరం జరిగారు. అనంతరం 2019 ఎన్నికల్లోనూ బీఎస్పీ-కమ్యూనిస్టులతో కదం తొక్కారు. జనాలు ఆదరించకపోవడంతో ఇప్పుడు బీజేపీతో కలిసి ముందుకెళుతున్నారు.
అయితే ఏపీలో బీజేపీతో వెళ్లడం ఎంత మాత్రం సేఫ్ కాదని పవన్ ఆలోచిస్తున్నాడట.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, గ్యాస్, పెట్రోల్ రేట్లు పెంచడం..పైగా రెండు సార్లు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీపై సహజంగానే ఏపీ ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత జనసేనకు శాపం కాకుండా చూసుకోవాలని పవన్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
అంతేకాదు.. జనసేన ఒంటరిగా బరిలోకి దిగిన స్థానిక ఎన్నికల్లో దుమ్మురేపింది. మెజార్టీ సీట్లు సాధించింది. జనసైనికులు , యువత అంతా పార్టీని కలిసి కట్టుగా ఓన్ చేసుకొని గెలిపించారు. అదే స్ఫూర్తిని అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపితే తిరుగుండదని పవన్ భావిస్తున్నాడట.. అందుకే బీజేపీతో బయట నుంచి మాత్రమే పొత్తు తీసుకోవాలని.. కలిసి సాగడం వల్ల జనసేనకు మైనస్ అవుతుందన్న ఆలోచన పవన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం ప్రస్తుతం సాగుతోంది. అయితే ఇది సాధ్యమవుతుందా? లేక బీజేపీతోనే కలిసి సాగుతారా? అన్నది వేచిచూడాలి.