Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Vizag Tour: వైసీపీ గూండాల ఉడత ఊపులకు భయపడేవాణ్ణి కాదు!

Pawan Kalyan Vizag Tour: వైసీపీ గూండాల ఉడత ఊపులకు భయపడేవాణ్ణి కాదు!

Pawan Kalyan Vizag Tour: ‘రాష్ట్రాన్ని నడుపుతున్న నాయకుడికి కావాల్సింది గొడవ.. శాంతి భద్రతల విఘాతం… కోనసీమలాంటి గొడవలు వారికి కావాలి. విశాఖలో ఏదో రకంగా గొడవలు పెట్టాలని ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. చివరకు ఓ ఐపీఎస్ అధికారి ఏకంగా నా వాహనం మీదకు వచ్చి అభిమానులకు అభివాదం చేయవద్దని ఆపాలని చూశారంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం అవుతుంద’ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ గూండాలకు ఒకటే చెప్తున్నా.. మీ ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు లొంగేవాడిని కాదన్నారు. దశాబ్దాల పాటు రాజకీయం చేయడానికి వచ్చాం.. ఎవరో చంపేస్తారు.. ఏదో చేసేస్తారు అంటే భయపడేవాడిని అస్సలు కాదు అని తెలిపారు. ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమం కోసం శనివారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్న పవన్ కళ్యాణ్ పర్యటన లో హైడ్రామా నెలకొంది. పోలీసులు అద్యంతం పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు, ఆయనను నిలువరించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఆయన బస చేసిన నోవాటెల్ హోటల్ ముందు భారీగా బలగాలను మోహరించారు. తెల్లవారుజామున 3.30 గంటలకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వాహనం తాళాలు ఇవ్వాలని పోలీసులు ఒత్తిడి తీసుకురావడంతోపాటు, పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నాయకులు అందరిని పోలీసులు అరెస్టులు చేయడంతో ఆదివారం జరగాల్సిన ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేశారు. విశాఖ పర్యటన సందర్బంగా జరిగిన విషయాలను వివరించేందుకు ఆదివారం ఉదయం పవన్ కళ్యాణ్ దీనిపై ఆయన బస చేసిన నోవాటెల్ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , పీఏసీ సభ్యులు నాగబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాష్ట్ర పోలీసు వ్యవస్థ పై నమ్మకం లేదు అని ఒకప్పుడు స్వయంగా చెప్పిన వ్యక్తి ఇప్పుడు పోలీసు వ్యవస్థను శాసిస్తున్నాడు. దాన్ని పోలీసు ఉన్నతాధికారులు సైతం పాటించడం దారుణం. మా పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేయాలి..? ఎలా ఉండాలి అనేది మీరు ఎలా చెబుతారు? జనవాణి కార్యక్రమం అనేది ప్రజల గొంతు. ఈ ప్రభుత్వం ఆ గొంతును నొక్కేద్దామని ప్రయత్నిస్తే ఎలా..? ఇప్పటి వరకు నాలుగుసార్లు జనవాణి కార్యక్రమాన్నినిర్వహించాం. ఎక్కడా మాకు ఇబ్బందులు రాలేదు.

* పోలీసుల ద్వారా ఆటంకాలు కలిగించారు
సుమారు 3 వేలకు పైగా సమస్యలు మా దృష్టికి వచ్చాయి. కష్టాల్లో, సమస్యల్లో ఉన్న ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చే గొప్ప కార్యక్రమం. దాన్ని అడ్డుకోవాలని వాయిదా వేసుకోవాలని చెప్పడానికి మీరెవరు..? ఎంతో పద్ధతిగా, వ్యక్తిగత దూషణలు లేకుండా చేసే గొప్ప కార్యక్రమం జనవాణి. దానిని ఎందుకు అడ్డుకోవాలి. ఈ పర్యటన మొత్తం ఆటంకాలు కలిగించాలని పోలీసులు ప్రయత్నించారు. రకరకాలుగా రెచ్చగొట్టాలని చూశారు. ఉభయ పార్లమెంటు సభలో 30 మంది సభ్యులు, 151 మంది శాసనసభ్యులు ఉండి ఎప్పుడు బూతులు పంచాంగం తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించలేని, చర్చించలేని నాయకులు ప్రజల సమస్యలు చెప్పుకునే కార్యక్రమాలను అడ్డుకోవాలని చూడటం సిగ్గుచేటు.

* నాయకులు చెప్పినట్లే పోలీసులు
నేను ఒక రిటైర్డ్ పోలీస్ కొడుకుని. పోలీసులు కూడా వ్యవస్థలో భాగం. పాలకులు చెప్పినట్లే వారు నడుచుకుంటారు. నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ వరకు జరిగిన ర్యాలీలో ఓ ఐపీఎస్ అధికారి తన పరిధి దాటి ప్రవర్తించారు. అది వారి తప్పు కాదు. ఎలాగైనా ర్యాలీని ఆపించాలని ఆ అధికారికి వచ్చి ఫోన్లు, ఒత్తిళ్ళు మేరకు వారు అలా ప్రవర్తించి ఉండొచ్చు. నన్ను అరెస్ట్ చేస్తామని రాత్రి నుంచి హడావుడి చేశారు. పోలీసు బలగాలను మోహరించారు. మేం ఏమైనా సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసామా..? దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిం చామా? గంజాయి సాగు చేసే వారిని, అక్రమ మద్యం మాఫియా నడిపే రాజకీయ నాయకులను పోలీసులు వదిలేస్తున్నారు. పోలీసులు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు ప్రజల కోసం పోరాడే వ్యక్తుల మీద చట్టాలు ప్రయోగించడం మానుకోండి. ప్రభుత్వాలు మారుతాయి మీరు మాత్రం మారరు అని గుర్తుపెట్టుకోండి.

* మీరు ముందు చెప్పిన దానికి కట్టుబడాలి కదా?
మా ఉత్తరాంధ్ర పర్యటన కేవలం ప్రజా సమస్యల కోసమే. రాజధానులు అనే విషయం మీద మాట్లాడటానికి రాలేదు. మా పార్టీ విధానపరంగా అమరావతికి కట్టుబడి ఉన్నాం. మేం రాజధాని ఎక్కడ పెట్టాలో మేమేమీ నిర్ణయించలేదు. ముందుగా కర్నూలు పెట్టి ఉంటే కర్నూలే రాజధాని. అలాగే మరోచోట పెట్టి ఉంటే అక్కడే. 2014లో రాజధాని నిర్ణయించినప్పుడు మద్దతు పలికిన మీరు ఇప్పుడు అన్ని ప్రాంతాల మీద ప్రేమ పేరుతో విద్వేషాలు రగిలించడం కోసమే ఈ నాటకాలు ఆడుతున్నారు. దీనికి మీరు చెప్పే కారణం పాలన వికేంద్రీకరణ.

* మీ అధికారానికి వికేంద్రీకరణ ఉండదా?
రాష్ట్రంలో పాలనాపరంగా నిర్ణయాలు తీసుకుంటున్నది ఒకే ఒక వ్యక్తి. అధికారంలో వికేంద్రీకరణ చేయడం మీకు చేతకాదు. 5 మంది డిప్యూటీ సీఎంలతో ఉన్న పెద్ద క్యాబినెట్ సైతం మీ మాటకు ఊ కొట్టాల్సిందే. అక్కడ ఎందుకు వికేంద్రీకరణ లేదు..? 56 కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు పెడితే నిధులు ఇవ్వడానికి వికేంద్రీకరణ గుర్తుకు రాలేదు. స్థానిక సంస్థలకు చెందాల్సిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్ళించింది ఒకే ఒక వ్యక్తి. దీనికి వికేంద్రీకరణ గుర్తుకురాదు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన రూ.400 కోట్ల రూపాయల నిధిని దారి మళ్లించి నిర్ణయం తీసుకుంది ఒకే ఒక వ్యక్తి. దీనికేది వికేంద్రీకరణ. ఇసుక హక్కులు ఎవరికి ఉండాలి అని నిర్ణయించింది ఒకే ఒక వ్యక్తి. అభయహస్తం నిధులు రూ. రెండువేల కోట్లను ఒకే ఒక వ్యక్తి విత్ డ్రా చేశాడు. ఇక్కడ కూడా వికేంద్రీకరణ లేదు. 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ కలను నిర్ణయించేది ఒకే ఒక వ్యక్తి. వేల పరిధిలోని అధికారానికి వికేంద్రీకరణ ఉండదు కానీ… పాలన కేంద్రీకరణ అంటూ నాటకాలు ఆడుతున్నారు.

* అధికారంలో ఉండి గర్జించడం ఎందుకు?
పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవలసిన స్థానంలో ఉండి గర్జనలు ఏంటి? ఉద్యమం అనేది ప్రజల నుంచి పుట్టాలి. మీరు ఎందుకు గర్జనలతో రెచ్చగొడుతున్నారు. అధికారంలో ఉన్నవారు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. దేనికి ఈ గర్జనలు..? పరిపాలించాల్సిన వారు నిరసనలు చేస్తానంటే ఎలా? నిన్న ర్యాలీలో కూడా పోలీసులు పదేపదే గొడవ పెట్టుకునేలా రెచ్చగొట్టారు. నాకు పోలీసులతో మాకు గొడవ లేదు. ప్రభుత్వంతో పాలసీపరంగా మాత్రమే విభేదిస్తాం. తప్పులు చేస్తే ఎత్తి చూపుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతాం.

* దేనికి 307 సెక్షన్ కేసులు పెట్టారు
ర్యాలీ చేసినందుకు మా వారిని 100 మందిని తీసుకెళ్లిపోయారు. మా మీడియా సిబ్బంది కెమెరాలను లాక్కెళ్ళారు. పర్మిషన్ తీసుకున్న 14 మందిపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేశారు. వీటిని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. కోడి కత్తి డ్రామాలు అలవాటు చేసుకున్న వైసీపీ నాయకులు రెచ్చగొట్టాలి అనే దురుద్దేశంతోనే నిన్న పర్యటనలు చేశారు. దాడులు చేసినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి వాటి మీద కేసులు ఉండవు. హత్యాయత్నం సెక్షన్లు ఉండవు. మా నాయకులను కనీసం విశాఖ రాకుండా అడ్డుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు. ప్రతి విషయం మాకు గుర్తు ఉంటుంది. ప్రతి దానికి సమాధానం చెబుతాం. రాష్ట్రం మీద ప్రేమ ఉంటే 2014 రాష్ట్ర విభజన సమయంలో ఎంపిగా ఉన్న ఈ రోజు ముఖ్యమంత్రి ఎందుకు అడ్డుకోలేదు. విశాఖ రైల్వే జోన్ గురించి ఎందుకు ప్రశ్నించలేదు. ప్రత్యేక హోదా మీద ఎందుకు మాట్లాడలేదు.

* మాజీ సైనికుల భూములు ఏమయ్యాయి ధర్మాన గారు?
విశాఖపట్నంలో మాజీ సైనికులకు సంబంధించిన 71 ఎకరాల భూమిని మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు పక్క దారి పట్టించారు అని వార్తలు వస్తున్నాయి. తిరుపతిలో సైనికుడు శ్రీ రెడ్డి ప్రసాద్ తన భూమి రక్షించుకోలేకపోతున్నానని, సరిహద్దుల వద్ద కాపలాగా ఉన్న తమకు చెందిన భూమికి రక్షణ లేకుండా పోతుందని వాపోయాడు. అలాంటి మాజీ సైనికుల భూములను సైతం కొల్లగొట్టడం అత్యంత దారుణం. ఉత్తరాంధ్రపై ప్రేమను ఓలకబోసే ధర్మాన గారు దీనికి సమాధానం చెప్పాలి. నిన్న మంత్రులు మీద జరిగిన దాడి విషయంలో కూడా సరైన బందోబస్తు లేకుండా దాడి జరిగిందని చెప్పడం వెనుక కూడా అనుమానించాల్సిన విషయమే. కోడి కత్తి డ్రామాలు ఆడే అలవాటు ఉన్న వీరికి కచ్చితంగా గొడవల పెట్టడానికి ఇలాంటి డ్రామాలు ఆడి ఉండొచ్చు కూడా. ఈ దాడి వెనుక ప్రశాంత్ కిషోర్ టీం ఉందని నేను భావించడం లేదు.

* మొదటి నుంచి మేం అమరావతి రాజధాని అని చెబుతున్నాం
మొదట్నుంచి జనసేన పార్టీ విధానం అమరావతి రాజధాని. మా నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో తాత్కాలికంగా జనవాణిని వాయిదా వేయడం జరిగింది. మా భవిష్యత్తు ప్రణాళికను నాయకులతో చర్చించి ప్రకటిస్తాం” అన్నారు.

* నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు: నాదెండ్ల మనోహర్
మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్  ప్రసంగం ముందు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్  నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ “నా రాజకీయ జీవితంలో నిన్న జరిగిన పోలీసుల ప్రవర్తన ఎప్పుడు చూడలేదు. అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక రాజకీయ పార్టీ నాయకుడిని ప్రజలు చూడనీయకుండా చేయాలని పోలీసులు చూడడం అత్యంత సిగ్గుచేటు. పోలీసులకు పదేపదే ఒత్తిళ్లు రావడంతోనే ఇది చేశారు. పోలీసుల సూచనలను ఎక్కడ తూచా తప్పకుండా పాటించాం. ఎయిర్ పోర్టు నుంచి బయటికి వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి కాన్వాయ్ ఎక్కారు. అక్కడ నుంచి ట్రాఫిక్ తరలింపు బాధ్యతలను సైతం మా పార్టీ మీదనే వేయాలని పోలీసులు మాట్లాడడం బాధ్యతరహిత్యం. ర్యాలీలోను పలుమార్లు కాన్వాయ్ ను ఆపించి రోడ్డు మీదనే పోలీసులు అతి ప్రవర్తన చేశారు. శనివారం రాత్రి నుంచి హోటల్ వద్ద పోలీసులు చేసిన ప్రవర్తన కూడా అత్యంత హేయం. రాత్రికి రాత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాహనం తాళాలు ఇవ్వాలని, నాయకుల్ని అరెస్టు చేసి భయభ్రాంతులకు గురి చేయడం ఎందుకు? జనవాణి కార్యక్రమానికి అన్ని అనుమతులు తీసుకొని ప్రజా సమస్యలు వినేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తే మీకు భయం ఎందుకు..? పోలీసులు ఎవరో చెప్పినట్లు విని ఇష్టానుసారం ప్రవర్తించడం సరికాదు. ప్రజా సమస్యల కోసం నిర్వహించే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూడడం ఈ ప్రభుత్వ నీతి” అన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version