Pawan Kalyan: ఏపీలో ఎన్నికల సమీపిస్తున్నాయి. అధికార వైసిపి దూకుడుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. పెద్ద ఎత్తున అభ్యర్థుల మార్పుపై దృష్టి పెట్టింది. అవసరమైతే సీనియర్లను పక్కన పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో విపక్షాలు సైతం అలెర్ట్ అయ్యాయి. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు ప్రారంభించాయి. ముఖ్యంగా తెలుగుదేశం పొత్తులో భాగంగా ఇచ్చే స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సీనియర్లతో కూడిన జాబితాను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. లోకేష్ పాదయాత్రకు సంబంధించి విజయోత్సవ సభ నేడు విజయనగరం జిల్లాలో జరగనుంది. ఈ సభలో చంద్రబాబుతో పాటు పవన్ పాల్గొంటున్నారు. ఇరువురు నేతలు ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నారు. సీట్ల విషయంలో సైతం స్పష్టత ఇవ్వనున్నారు. రెండు పార్టీల శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఇప్పటికే జనసేన సీట్లకు సంబంధించి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి జనసేనకు 27 అసెంబ్లీ సీట్లు, రెండు లోక్ సభ స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు సమాచారం. అనకాపల్లి, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాలు జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమైంది.అటు రాజంపేట సైతం ఇచ్చేందుకు టిడిపి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ బిజెపి కలిసి వస్తే ఆ పార్టీకి కొన్ని పార్లమెంట్ స్థానాలు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అందుకే వీలైనంతవరకు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి పవన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వైసిపి అనుసరిస్తున్న వైఖరిబట్టి అభ్యర్థుల మార్పు కూడా ఉంటుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు ఖరారు చేసిన జాబితాలో పవన్ సీనియర్లకు చోటిచ్చారు. నెల్లిమర్లకు లోకం నాగ మాధవి, గజపతినగరం నుంచి పడాల అరుణ, గాజువాక నుంచి సుందరపు సతీష్, భీమిలి నుంచి పంచకర్ల సందీప్, ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, ముమ్మిడివరం నుంచి పీతాని బాలకృష్ణ పేర్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, పిఠాపురం నుంచి ఉదయ శ్రీనివాస్, రామచంద్రాపురం నుంచి చిక్కం దొరబాబు, జగ్గంపేట నుంచి పాలెం శెట్టి సూర్యచంద్రరావు, రాజోలు నుంచి డిఎంఆర్ శేఖర్, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్, తణుకు నుంచి విడవడ రామచంద్రరావు, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, గిద్దలూరు నుంచి ఆమంచి శ్రీనివాసరావు పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ జాబితాను ఎప్పటికీ పవన్ చంద్రబాబుకు అందించినట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గాల టిడిపి ఇన్చార్జిలతో చంద్రబాబు మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. జనసేనకు సీట్లు ఇస్తుండడంతో.. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సముచిత స్థానంకల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చే అవకాశం ఉంది. వారి సమ్మతి తరువాతనే అధికారికంగా జనసేన తన అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.