Pawan Kalyan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. అధికార పక్షాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. ఎలాగైనా జగన్ అధికారం నుంచి దూరం చేస్తామని చెబుతున్నాయి. అయితే పొత్తు వల్ల క్షేత్రస్థాయిలో సొంత పార్టీ నేతలు ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడుతుంది. దీంతో వారు వివాదాలు పెట్టుకుని మరీ పార్టీకి దూరమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని చాలామంది నాయకులు పవన్ కోరారు. కానీ పవన్ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. పొత్తుపై అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని సైతం తేల్చి చెప్పారు. అలా చేస్తున్నవారు వైసీపీకి కోవర్టు లేనని అభిప్రాయపడ్డారు. దీంతో కొంతమంది నాయకులు సైలెంట్ కాగా.. మరికొందరు మాత్రం బాహటంగా విమర్శలు చేసి పార్టీని వీడుతున్నారు. తాజాగా వినుకొండ జనసేన ఇంచార్జ్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీకి రాజీనామా ప్రకటించారు. అయితే ఈ తరహా పరిణామాలను జనసేన నాయకత్వం లైట్ తీసుకుంటోంది.
గత ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది నాయకులు.. ఈసారి జనసేన తరఫున తమకు పోటీ చేసే అవకాశం వస్తుందని భావించారు. కానీ ఇంతవరకు సీట్ల విషయంలో క్లారిటీ లేదు. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు అన్న దానిపై స్పష్టత లేదు. ఇది నేతల్లో అసంతృప్తికి కారణమవుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఏకపక్షంగా ముందుకెళ్తోంది. సహజంగానే ఇది జనసేన నేతల్లో అసహనానికి కారణమవుతోంది. కానీ బయటకు వ్యక్తం చేయడానికి వీలులేని విధంగా పవన్ ఆదేశాలు ఇచ్చారు. పొత్తును విఘాతం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని పార్టీ శ్రేణులకు స్పష్టమైన పిలుపు ఇచ్చారు. దీంతో జనసేన నేతలది కక్కలేక మింగలేని పరిస్థితి. అందుకే హై కమాండ్ పై విమర్శలు చేసి మరీ నేతలు పార్టీని వీడుతున్నారు. ఎన్నికలు సమీపించే కొలదీ చాలామంది పార్టీని వీడియో పరిస్థితులు ఉన్నాయి. దీనిపై పవన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.