Janasena Digital War: ఈ భారీ వర్షాలకు ఏపీలోని రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. అక్కరకు రాకుండా తయారయ్యాయి. రోడ్లను మరమ్మతు చేయాల్సిన అధికారులు నిధులు లేక వదిలేస్తున్నారు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికే దీనిపై పోరాటం చేసిన జనసేన తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ రోడ్ల దుస్థితిపై ‘జనసేన’ డిజిటల్ వార్ కు తెరదీసింది. ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలిలో నిర్వహించి ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితిని తెలియచేసేందుకు జనసేన పార్టీ మరో కార్యక్రమం చేపట్టిందని వివరించారు. #GoodMorningCMSir అనే హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించారు. జులై 15, 16, 17 తేదీల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో రహదారులు కనీస మరమ్మతులు కూడా కాలేదు.. గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి గారిని నిద్ర లేపేందుకే #GoodMorningCMSir కార్యక్రమం నిర్వహిస్తున్నామని నాదెండ్ల తెలిపారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొంటారని తెలిపారు. ఫోటోలు, వీడియోలు స్వయంగా డిజిటల్ మీడియాలో అప్లోడ్ చేస్తారని వివరించారు. #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో రహదారుల దుస్థితిపై జనసేన వీర మహిళలు నాయకులు, జన సైనికులు ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసే కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. గ్రామాలు, మండలాల్లో రహదారుల దుస్థితిని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని నాదెండ్ల తెలిపారు.
రోడ్డు మరమ్మత్తుల కోసం అని చెప్పి ఎక్కువ వడ్డీలకు నిధులు తెచ్చి ఆ సొమ్ములు మళ్లించేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం మభ్యపెడుతోందని నాదెండ్ల అన్నారు. పెట్రోల్ మీద ఏటా సామాన్యుడి నుంచి రూ. 750 కోట్లు రోడ్ సెస్ వసూలు చేస్తున్నారని.. ఆ సెస్ చూపి రూ. 6 వేల కోట్లు అప్పులు తెచ్చారని.. ముఖ్యమంత్రికి జవాబుదారీతనం ఉంటే ఆ నిధులు ఎందుకు ఖర్చు చేశారో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను జనసేన పార్టీ తిప్పికొడుతుందన్నారు. తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ పోస్టర్ విడుదల చేశారు.
ఇక ఇన్నాళ్లు శ్రమదానం పేరిట ఏపీ రోడ్ల దుస్థితిపై క్షేత్రస్థాయిలో పోరాడిన జనసేన ఇక డిజిటల్ వార్ మొదలుపెట్టిందని అర్థమవుతోంది. ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేలా ఈ సోషల్ వార్ ను సాగించనుంది. ప్రభుత్వానికి చమటలు పట్టించేందుకు రెడీ అయ్యింది.