MLA Jagga Reddy: కాంగ్రెస్.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది అంతర్గత కుమ్ములాట. తెలంగాణ కాంగ్రెస్‌లో మరీ ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ పార్టీలో జరుగుతూనే ఉంటుంది. పంచాయితీలు లేకుంటే అది కాంగ్రెస్ ఎలా అవుతుంది అన్నట్లు ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. టీకాంగ్రెస్‌లో తాజాగా మరో కొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. అదే పాదయాత్రల పంచాయితీ. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో యాత్ర కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా యాత్ర మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశారు. తాజాగా ఈ జాబితాలోకి జగ్గారెడ్డి చేరారు. నేనూ నడుస్తా అంటూ ముందుకు వచ్చారు. ఈమేరకు అధిష్టానం అనుమతి కోరుతూ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రేకు లేఖ రాశారు. తాను చేపట్టబోయే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు.
నాలుగు జిల్లాల మీదుగా యాత్ర..
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో తనకు కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు పాదయాత్ర రూట్ మ్యాప్ కూడా తయారు చేసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. అనుమతి ఇస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో పాదయాత్ర చేస్తానని తెలిపారు. సుమారు 50 నియోజకవర్గాలను కవర్ చేసేలా పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి సొంత జిల్లా..
జగ్గారెడ్డి పాదయాత్ర చేస్తానని పేర్కొన్న జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్ ఉండడం గమనార్హం. ఇప్పటికే రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి మధ్య ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో తాను రేవంత్ సొంత జిల్లా నుంచే యాత్ర చేస్తానని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక తన సొంత జిల్లా మెదక్‌లో జగ్గారెడ్డి పాదయాత్ర చేసేలా నేతలందరినీ సమన్వయం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 30 నియోజకవర్గాలను కవర్ చేసేలా యాత్ర ఉండేలా కూడా ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. మరి జగ్గారెడ్డి లేఖకు అధిష్టానం అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.
గతంలో కోమటిరెడ్డి కూడా..
గతంలో కోమటి రెడ్డి కూడా పాదయాత్ర చేస్తాని చెప్పారు. ఈమేరకు అధిష్టానం అనుమతి కూడా కోరారు. కానీ అనుమతి రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఇక ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా యాత్ర మొదలు పెట్టి అధిష్టానం ఆదేశాలతో మూడు రోజులకే ముగించారు. తాజాగా జగ్గారెడ్డి తాను పాదయాత్ర చేస్తానంటూ ముందుకు రావడం చర్చనీయాంశమైంది. జగ్గారెడ్డి లేఖపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.