
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ చర్యలు ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే లాక్డౌన్ మే7తేది వరకు పొడిగించారన్నారు. కరోనా కట్టడికి లాక్డౌన్ మంచి ఫలితాలు చూపుతుందని దీనిని మరో రెండు, మూడు నెలలు కొనసాగించాలని ఆయన కోరారు. కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు లాక్డౌన్ పొడగింపు తప్పనిసరి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులకు అన్నిరకాల సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలని కోరారు.
కరోనా సమయలో కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరించి లాక్డౌన్ అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బంధీ చర్యలు రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు. ఇటీవల సంగారెడ్డి కరోనా ఫ్రీ జోన్ గా మారిందని తెలిపారు. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా అరికట్టేందుకు మరోసారి లాక్డౌన్ పొడగించాలని కేసీఆర్ ను కోరారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని తెలిపారు. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకునేలా ప్రభుత్వాలు ఆర్థిక నిపుణులతో చర్చలు జరుపాలన్నారు. ఆర్థికవేత్తల సలహాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్లాలని జగ్గారెడ్డి సూచించారు.