
Jagan And KCR On Visakha Steel: విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని నినదించి 32 మంది ఆత్మ బలిదానాలు చేశారు. ఎంతో మంది తమకున్న ఆస్తులను వదులుకున్నారు. వారి త్యాగఫలమే విశాఖ ఉక్కు. అటువంటి విశాఖ ఉక్కును పరిరక్షించుకోవాలన్న కనీస బాధ్యత లేకుండా వైసీపీ సర్కారు వ్యవహరిస్తోంది. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్ర మెడలు వంచి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటానని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక కేంద్రం మెడలు వంచడం కాదు.. తానే కేంద్రం ఎదుట మెడ వంచుకొని వస్తున్నారు. విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటుపరం చేసే ప్రయత్నాన్ని అడ్డుకోలేకపోతున్నారు. కనీసం సొంత గనులు కేటాయించి విశాఖ స్టీల్ ను ఆదుకోవాలని అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు. కనీసం పొరుగున ఉన్న తెలంగాణ సర్కారు చేస్తున్న ధైర్యం చేయకపోవడం సిగ్గుచేటని విశాఖ వాసులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు మండిపడుతున్నారు.
ఎన్నెన్నో హామీలు..
గత ఎన్నికల ముందు, పాదయాత్ర చేసే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ చేసిన ప్రకటనలు అన్నీఇన్నీ కావు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే స్టీల్ ప్లాంట్ విస్తరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తాను అధికారంలోకి వస్తే అదే పంథాను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ఉక్కు అధికారుల సంఘం ప్రతినిధులు జగన్ ను కలిసినప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఒడిశా, చత్తీస్ గడ్ అధికారులతో మాట్లాడి విశాఖకు సొంత గనులు ఏర్పాటుచేయిస్తానని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా కనీస ప్రయత్నం చేయకపోగా.. కేంద్ర ప్రభుత్వ చర్యలను మౌనంగా ఉండి అంగీకారం తెలుపుతున్నారు. జీవీఎంసీ ఎన్నికల సమయంలో విశాఖ ఉక్కుకు మద్దతుగా ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీలతో సంతకాలు చేయించిన లేఖను విడుదల చేశారు. జీవీఎంసీ ఎన్నికల్లో అది వర్కవుట్ అయ్యేసరి.. మొన్నటి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అదే లేఖపై ప్రచారం చేశారు. కానీ ప్రజలు తిరస్కరించారు.
వెంటనే స్పందించిన తెలంగాణ..
ప్లాంట్ ను పూర్తి సామర్ధ్యంతో నడిపేందుకు మూలధనం, ముడి సరుకు లేక స్టీల్ ప్లాంట్ సతమతవుతోంది. అందుకే తమకు మూలధనం, ముడిసరుకు అందించి అందుకు సరిపడా ఉక్కు ఉత్పత్తులను పొందే సంస్థల నుంచి స్టీల్ ప్లాంట్ బిడ్డులను ఆహ్వానించింది. మార్చి 27న ఈవోఐ జారీచేసింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉక్కు ప్రైవేటీకరణకు ఇది తొలి అడుగు అని విమర్శిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సమయంలో ఏపీ సీఎం జగన్ స్పందించాలి. ఒడిశా, చత్తీస్ గడ్ రాష్ట్రాలతో మాట్లాడి సొంత గనుల ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పి ఉండాల్సింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఆయన మిన్నకుండా పోయారు. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ బిడ్ లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ సర్కారుకు ఉన్న శ్రద్ధ ఏపీ సర్కారుకు లేకుండా పోయిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.

లేఖకు స్పందించని జగన్
అయితే తొలుత ఉక్కు అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం జగన్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నందున వాటికి 10 లక్షల టన్నుల ఇనుము అవసరముంటుందని.. దాని ధర రూ.6,500 కోట్లని లెక్క కట్టారు. అందుకే విశాఖ స్టీల్ తో ఒప్పందం చేసుకుంటే ఉభయతారకంగా ఉంటుందని ప్రతిపాదించారు. కానీ సీఎం జగన్ కనీసం స్పందించలేదు. అంతెందుకు అనకాపల్లి ఎంపీ సత్యవతి, మరో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఉక్కు, బొగ్గుకు సంబంధించి పార్లమెంటరీ స్థాయి సంఘ సభ్యులుగా ఉన్నారు. అటు ఎంపీ సత్యవతి లోక్ సభ స్థానం పరిధిలో విశాఖ ఉక్కు ఉంది కానీ ఏ రోజు ప్లాంట్ ను సందర్శించలేదు. కార్మికులతో మాట్లాడలేదు. విశాఖ స్టీల్ విషయంలో వైసీపీ బయట పోరాటం చేస్తుందే తప్ప..లోలోపల మాత్రం కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం తెలపడం లేదు. ఎందరో త్యాగధనుల ఫలితం విశాఖ ఉక్కు.. ఇప్పుడు వైసీపీ రాజకీయాల పుణ్యమా అని ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తోంది. దీనిని పరిరక్షించే బాధ్యత తీసుకున్న కేసీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరీ.