Rushikonda : ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపడమే నయా రాజకీయం. దానికి మసాలా పూసి నమ్మిస్తే చాలూ ప్రజలు ఇట్టే బుట్టలో పడిపోతారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ సర్కారు నిర్వాకం ఇలానే ఉంది. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు ఇదే మంత్రాన్ని జపించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దానికి మించి ఒరవడిని కొనసాగిస్తున్నారు. అప్పుడు ప్రశాంత్ కిశోర్ నడిపించే వారు. ఇప్పుడు మాత్రం ఐ ప్యాక్ టీమ్ కు తోడు సలహాదారులు ఉండడంతో ఇటువంటి ప్లాన్లకు ఇట్టే అమలుచేస్తున్నారు. అయితే అలవాటుపడిన ప్రజలకు ఇప్పుడిప్పుడే అసలు విషయం తెలుస్తుండడంతో వారి నిర్వాకం బయటపడుతోంది. అందుకే భక్తులు సైతం అపనమ్మకంతో సైడవుతున్నారు. భుజలకెత్తిన వారు సైతం వ్యతిరేకులుగా మారిపోతున్నారు.

విశాఖకు మణిదీపం రుషికొండ. బీచ్ ఒడ్డున ఉండే ఈ కొండ పర్యాటక ప్రాంతం. సాగరనగరానికి ఒక ల్యాండ్ మార్కు. పచ్చటి తివాచీ పరిచినట్టు ఉంటుంది. రిసార్ట్స్ తో పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. విశాఖ వచ్చే పర్యాటకులు ఎక్కువ మంది రుషికొండను సందర్శిస్తే కానీ వెళ్లరు. అటువంటి రుషికొండను అడ్డగోలుగా తవ్వేశారు. ఆనవాళ్లు లేకుండా చేశారు. రిసార్ట్స్ ను కూలగొట్టి నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే అనుమతులకు మించి తవ్వకాలు చేపడుతున్నారని న్యాయస్థానాల్లో పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఐదుగురు పర్యావరణ అధికారులతో కమిటీకి ఆదేశించింది. పర్యావరణ, అటవీశాఖలకు సమగ్ర సర్వేకు ఆదేశాలిచ్చింది. అక్రమ తవ్వకాల విషయం నిగ్గుతేల్చాలని స్పష్టం చేసింది. ఇందుకు జనవరి 31 వరకూ గడువు ఇచ్చింది.
అయితే ఇప్పుడు ఉన్నపలంగా రుషికొండ పచ్చదనంతో తొణికిసలాడడం చూసి సాగరనగరం వాసులు ఆశ్చర్యపోతున్నారు. భానుడి కిరణాలతో రుషికొండ ప్రాంగణం పచ్చదనంతో మెరిసిపోతోంది. దీంతో ఆ ప్రాంతాన్ని చూసేందుకు నగరవాసులు, పర్యాటకులు పరుగులు తీస్తున్నారు. దగ్గరకు వెళ్లి అవాక్కవుతున్నారు. అది పచ్చదనం కాదని.. గ్రీన్ కార్పెట్ కప్పారని షాక్ కు గురవుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన కమిటీ తన నివేదిక సమర్పించిందో లేదో తెలియదు.. కానీ త్వరలో కమిటీ రుషికొండ ప్రాంతాన్ని సందర్శించనుందని ప్రచారం సాగుతోంది. అందుకే ఏపీ ప్రభుత్వం ఇలా గ్రీన్ కార్పెట్ పరచి కొండను పచ్చదనంతో నింపేసిందన్న టాక్ అయితే నడుస్తోంది. రాత్రికి రాత్రే కొండపై పచ్చదనం రావడంతో నగరవాసులు నవ్వుకుంటున్నారు. ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఒక టాక్ కు మళ్లీ ప్రభుత్వమే ప్రాణం పోసినట్టయ్యింది. మనిషి ప్రాణాలు తీసి రక్తాన్నే కడిగేశారు. ఇదో లెక్క అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా ఎలక్షన్ కు ముందు సీఎం జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. నాడు రక్తపు మరకలు తుడిచేశారు. రాజకీయ ప్రత్యర్థులపై నెపాన్ని నెట్టేశారు. పొలిటికల్ గా మైలేజ్ పొందారు. ఇప్పుడు ఆ కేసు పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. అటువంటిది సొంత మనిషి ప్రాణాల విషయంలో ఎన్నిరంగులు మార్చాలో మార్చారు.. రుషికొండ వారికి ఒక లెక్క అన్న కామెంట్స్ ఇప్పుడు అధికమవుతున్నాయి. సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఇన్నాళ్లు తెలివితేటలు ప్రదర్శిస్తూ వస్తున్న ప్రభుత్వ చర్యలు ఇప్పుడు నవ్వులపాలవుతున్నాయి.