Margadarsi Case: మార్గదర్శి కేసులో పట్టు బిగించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అటు సిఐడి సైతం దూకుడు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్గదర్శి బ్రాంచ్ లో తనిఖీల పేరిట హడావిడి చేస్తోంది. ఒక్క సిఐడి కాకుండా అగ్నిమాపక శాఖను సైతం జగన్ సర్కార్ ప్రయోగించింది. ఈ ముప్పేట దాడితో రామోజీరావు శిబిరంలో కలవరం ప్రారంభమైంది. దీంతో న్యాయస్థానానికి రామోజీరావు వెళ్లాల్సి వచ్చింది. తాము ఆదేశించే దాకా మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలు వద్దంటూ కోర్టు స్పష్టం చేసింది. దీంతో రామోజీ శిబిరానికి కొంత ఉపశమనం లభించింది. అయితే ఇక్కడే జగన్ ఒక ప్లాన్ వేశారు. చిట్ ఫండ్ నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శి వ్యవహరించిందని.. చర్యలు చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ)ని ఆశ్రయించనున్నారు.
వాస్తవానికి మార్గదర్శి చాలా నిబంధనలను పాటించడం లేదని సిఐడి గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 37 బ్రాంచులు మార్గదర్శికి ఉన్నాయి. డిపాజిట్ దారుల నుంచి సేకరించిన మొత్తాన్ని స్థానిక జిల్లాలోని బ్యాంకుల్లోనే ఉంచాలి. కానీ దాదాపు అన్ని బ్రాంచుల నుంచి సేకరించిన డిపాజిట్లను సంబంధిత సిబ్బంది హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇది నిబంధనలకు వ్యతిరేకమని సిఐడి భావిస్తోంది. దీనిని రుజువు చేసే పనిలో పడింది. మార్గదర్శి యాజమాన్యం మనీ లాండరింగ్ పాల్పడుతోందని జగన్ సర్కార్ భావిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని ఈడిని కోరనుంది.
అయితే దీనిపై ఈడి పట్టించుకునే అవకాశం ఉందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిట్ దారుల నుంచి సేకరించిన మొత్తాన్ని వేరే వ్యాపారానికి కానీ.. వేరే సంస్థ కానీ మళ్ళిస్తే అది మనీలాండరింగ్ కిందకి వస్తుంది. ఒకవేళ విదేశాలకు తరలించినా అది తీవ్రమైన ఆర్థిక నేరంగా ఈడి భావిస్తుంది. అప్పుడు సీరియస్ యాక్షన్ కి దిగే అవకాశం ఉంది. జిల్లాల నుంచి హైదరాబాద్ వంటి హెడ్ బ్రాంచులకు తరలిస్తే అది స్థానిక వివాదంగా ఈడి పరిగణిస్తుంది. అటువంటి వాటిలో ఈడీ ఎంటరయ్యే అవకాశం లేదు. ఒకవేళ కానీ మార్గదర్శి యాజమాన్యం వేరే వ్యాపారాలకు చిట్ ఫండ్ నగదును మళ్లించినట్లు ఆధారాలు చూపించగలిగితే తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగుతుంది. అయితే ఆ ఆధారాలు చూపించే స్థితిలో సిఐడి ఉందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.