CM Jagan : కులం కూడు పెట్టదు.. మతం మనుగడనీయదు అంటారు. ఆ నానుడి వింటానికి బాగానే ఉంటుంది గాని.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కులాన్ని, రాజకీయాన్ని వేరు చేసి చూడలేం. గత దశాబ్దాలుగా అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ కుల పంకిలంలో అన్ని రాజకీయ పార్టీలు దొర్లినవే.. గత ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు కుల ఫార్ములానే అనుసరించగా.. వైసిపి మాత్రమే ఈ ఫార్ములాను పూర్తిస్థాయిలో అమలు చేసి విజయాన్ని సాధించగలిగింది. అలా ఐదేళ్లు గడిచిపోయాయి.. ఇప్పుడు ఏపీలో మళ్లీ ఎన్నికలు సమీపించాయి. టిడిపి జనసేన కూటమిని పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్లో కీలక నియోజకవర్గాలుగా పేరుపొందిన స్థానాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి కుల ఫార్ములాను అమలు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫార్ములా విజయవంతం అవుతుందా? లేక బెడిసి కొడుతుందా? అనేది చూడాల్సి ఉంది.
175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఏపీలో.. ఈ దఫా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాలలో అభ్యర్థులను పూర్తిగా మార్చేస్తున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన మార్పులు ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి. సాధారణంగా అసెంబ్లీ స్థానాల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటారు. వాటికి భిన్నంగా జగన్ మోహన్ రెడ్డి రెండు పార్లమెంటు స్థానాల్లో మార్పులకు శ్రీకారం చుట్టడం విశేషం. అయితే ఈ రెండు పార్లమెంటు స్థానాలు కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నవి కావడం విశేషం. ఆ రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటి ఏలూరు, రెండవది విశాఖపట్నం.. ఈ రెండు పార్లమెంటు స్థానాలు ప్రస్తుతం కమ్మ నేతల చేతిలో ఉన్నాయి. విశాఖ ఎంపీగా వైసిపి నేత ఎంవివి సత్యనారాయణ కొనసాగుతున్నారు. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గత ఎన్నికల్లో తొలిసారి టికెట్ దక్కించుకొని విజయం సాధించారు. ఇక ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి కోటగిరి శ్రీధర్ ఎంపీగా ఉన్నారు. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే వీరిద్దరిని జగన్ పక్కన పెట్టారని ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. రెండు నియోజకవర్గాలు కూడా ఆయా జిల్లాల్లోనే కాదు.. రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నవే. ఇప్పటివరకు ఈ నియోజకవర్గాల చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ బీసీలకు అవకాశం దక్కలేదు. ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి బాబు ప్రాతినిధ్యం వహించారు. మాగంటి బాబు తర్వాత కోటగిరి శ్రీధర్ ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. శ్రీధర్ పై సొంత క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జగన్ ఆయనను పక్కన పెట్టారు. ఈ ఏలూరు పార్లమెంటు స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు.
ఇక విశాఖపట్నంలో గత ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్, టిడిపి, బిజెపి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యమిచ్చాయి. గతంలో విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి ఎంపీగా గెలిచారు. భారతీయ జనతా పార్టీ నుంచి కంభంపాటి హరిబాబు 2014లో పోటీ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో ఎంవివి సత్యనారాయణ ఇక్కడ పోటీ చేసి విజయాన్ని సాధించారు. ఇక ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ కి జగన్ టికెట్ కేటాయించారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాలు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకప్పుడు కమ్మలు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంటు స్థానాల్లో టిడిపి ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.