
Pawan And Chandrababu- Jagan: వచ్చే ఎన్నికలు అంత ఈజీగా జరగవని అన్ని పార్టీల నాయకులకు తెలుసు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే అధినేతలు అచీతూచీ వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. పైకి 175 నియోజకవర్గాలకు 175 గెలిచేస్తామని చెబుతున్నా లోలోపల మాత్రం ఆయనకు భయం వెంటాడుతోంది. అందుకే ఓట్లు, సీట్లు తెచ్చిపెట్టే ఏ మార్గాన్ని విడిచిపెట్టడం లేదు. తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఒక వైపు, విపక్షాల ఐక్యత మరోవైపు జగన్ ను కలవరపెడుతున్నాయి. అందుకే రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. విపక్ష నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. సాధారణంగా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో అధికార పార్టీ వైపు.. ఎన్నికల ముందు విపక్షాల వైపు నేతలు చూస్తారు. గోడ దూకుతారు. అయితే దానిని అడ్డుకట్ట వేస్తూ విపక్ష నాయకులను ఆకర్షించే పనిలో పడ్డారు జగన్. వారింకా పార్టీ మారక ముందే పదవులను ఎరగా చూపుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అటు చంద్రబాబును, ఇటు పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మొన్నటి వరకూ సొంత సామాజికవర్గానికే జగన్ ప్రాధాన్యమిచ్చారు. అటు పార్టీలోనూ..ఇటు ప్రభుత్వంలోనూ వారిదే కీలక పాత్ర. సలహాదారులు, రీజనల్ కోఆర్డినేటర్ల పేరిట వారిదే పెత్తనం. పేరుకే మంత్రులు కానీ.. వారి పేరిట సలహాదారులే రివ్యూలు పెడతారు. డబ్బు, హోదా తెచ్చిపెట్టే అన్నిరకాల పదవులు వారికే అప్పగించారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో జగన్ మేల్కొన్నారు. దీనిని విపక్షాలు విమర్శనాస్త్రాలుగా మార్చుకుంటాయని భావించి స్ట్రటజీ మార్చారు. ఇందుకు ఆయనకు ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసి వచ్చాయి. 18 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. 18 మంది అభ్యర్థులను వైసీపీ హైకమాండ్ ప్రకటించింది. 11 మంది బీసీలు ఉండగా.. ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, నలుగురు ఓసీలు ఉన్నారు. స్థానిక సంస్థల కోటా కింద తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేశారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా గట్టి సవాలే పంపించారు.
అయితే ఎన్నికల వ్యూహంలో భాగంగా టీడీపీ నుంచి చేరిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళం వెంకటరమణకు టిక్కెట్ ఇచ్చారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కు పిలిచి మరీ ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయించారు. ఇవన్నీ ఎన్నికల వ్యూహంలో భాగంగా చేసినవే. అయితే జగన్ స్థాయిలో చంద్రబాబు, పవన్ లు దూకుడు కనబరచడం లేదన్న టాక్ ఉంది. తెలుగుదేశం పార్టీలో సైతం ఇటీవల చేరికలు పెరుగుతున్నాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణతో పాటు విష్ణుకుమార్ రాజు వంటి వారు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే జనసేన విషయంలో మాత్రం ఎందుకో చేరికలు జరగడం లేదు. పవన్ వారాహి యాత్ర వరకూ నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్టు తెలుస్తోంది.

సీఎం జగన్ మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఏ నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్యే టిక్కెట్ కు పోటీ ఉందో ఆ స్థానాలపై దృష్టిపెట్టారు. అలాగే జిల్లాను యూనిట్ గా చేసుకొని ఏ సామాజికవర్గం గెలుపోటములను ప్రభావితం చేస్తుందో తెలుసుకొని మరీ ఆ వర్గానికి ఎమ్మెల్సీ పదవులు కేటాయించారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో కొత్తవారిని సైతం బరిలో దించుతానని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఒక విధంగా చెప్పాంటే చంద్రబాబు, పవన్ లను పరీక్ష పెట్టేలా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను చేశారు. అటు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం స్పష్టమైన హెచ్చరిక జారీచేశారు. అవసరమైతే తెరపైకి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తెస్తానని కూడా పరోక్ష హెచ్చరికలు పంపారు.
