YCP Rajyasabha: ఏపీలో అధికారంలో ఉన్న సీఎం జగన్ కు రాజ్యసభ సీట్లు కేటాయించడానికి అసలు క్యాండిడేట్ల దొరకని పరిస్థితి నెలకొందా? 151 మంది ఎమ్మెల్యేలు.. 23 మంది ఎంపీలున్న వైసీపీకి ఇప్పుడు రాజ్యసభ సీట్లు కేటాయించేందుకు సరైన నాయకులే లేరా? నాయకులు అంతగా కొరతగా మారారా? తాజా రాజ్యసభ సీట్ల కేటాయింపులు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది.
రాజ్యసభ సీట్లు సాధారణంగా పార్టీలోని ఉద్దండ పిండాలకు కేటాయిస్తారు. సీనియర్ నేతలకు వాటిని ఇస్తారు. అత్యున్నత ఈ పదవులు అలంకరించడానికి వైసీపీలో ఆ స్థాయి నేతలు లేరా? అన్న సందేహాలు జరగక మానవు. ఎందుకంటే తాజాగా వైసీపీ రాజ్యసభ సీట్ల కేటాయింపులు చూస్తే అదే అనిపిస్తోందని ఆ పార్టీలోని నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.
Also Read: YSRCP -Rajya Sabha: ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సభ్యుల ఎంపికలో వైసీపీ వ్యూహమేంటి?
తాజాగా ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి జగన్ అవకాశం ఇచ్చారు. ఆయనతోపాటు న్యాయవాది , యువకుడు అయిన నిరంజన్ రెడ్డికి, సామాన్య నేత అయిన బీద మస్తాన్ రావులను రాజ్యసభ ఎంపీలుగా జగన్ ఖరారు చేశారు. ఆశ్యర్యకరంగా తెలంగాణకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు జగన్ రాజ్యసభ ఎంపీ సీటు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో ఏపీలో అసలు అభ్యర్థులే లేనట్టు తెలంగాణకు చెందిన ఇద్దరిని రాజ్యసభ ఎంపీలుగా ఎంపిక చేయడం వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు లాయర్ గా పనిచేస్తున్నారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన వారు. ఇక ఆర్ కృష్ణయ్య తెలంగాణకు చెందిన ప్రముఖ బీసీ నేత. వీరిద్దరినీ ఎంపిక చేయడంపై సొంత పార్టీ నుంచే జగన్ పై విమర్శలకు కారణమైంది. పైకి బీసీలకు పెద్దపీట అంటున్నా జగన్ ఈ పదవులను అనర్హులకు.. వైసీపీ కోసం కష్టపడని వారిని కేటాయిస్తున్నారని సొంత పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే గత దఫాలో కార్పొరేట్ అయిన నత్వానీకి కేటాయించడం విమర్శలకు తావిచ్చింది. ఈసారి అదానీకి ఇద్దామని విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు తెలంగాణ నుంచి ఇద్దరినీ ఎంపిక చేయడంపై వైసీపీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
-విజయసాయిరెడ్డికి మరో ఛాన్స్
ఏపీలో వైసీపీ ఆవిర్భావం నుంచి విజయసాయిరెడ్డి జగన్ వెంట నడిచారు. ఆయనతోపాటు జైలుకు వెళ్లారు. పార్టీలో నంబర్ 2గా ఉన్నారు. జగన్ కుటుంబ ఆర్థిక వ్యవహారాలు చూసుకున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపీగా వెళ్లారు. అధికారంలోకి వచ్చాక మరోసారి ఇప్పుడు అవకాశం దక్కింది. ఢిల్లీ వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డినే చూసుకుంటున్నారు. జగన్ నమ్మినబంటు కావడంతోనే మరోసారి ఛాన్స్ దక్కింది.
-జగన్ కేసులు చూస్తున్నందుకేనా నిరంజన్ రెడ్డికి రాజ్యసభ సీటు?
జగన్ అక్రమాస్తుల కేసులో లాయర్ గా వ్యవహరిస్తున్న ఈ తెలంగాణకు చెందిన టాలీవుడ్ నిర్మాతకు సీఎం జగన్ రాజ్యసభ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. తన కేసులు వాదిస్తున్నందుకే జగన్ కృతజ్ఞతగా ఈ అత్యున్నత సీటును ఇచ్చారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవికి జగన్ ను దగ్గర చేయడంలో నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే జగన్ కేసులతోపాటు ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలు చక్కబెడుతున్న ఈ తెలంగాణ లాయర్ కు జగన్ ఈ సీటును కట్టబెట్టారు.
-బీద మస్తాన్ రావుకు సామాజిక కోణంలోనే..
ఒకప్పుడు తెలుగుదేశంలో ఓ వెలుగు వెలిగిన నెల్లూరు జిల్లా నేత బీద మస్తాన్ రావు వైసీపీలో అధికారంలోకి వచ్చారు. వైసీపీలోకి లేట్ గానే ఫిరాయించారు. బీసీలకు వైసీపీ ఇస్తున్న ప్రాధాన్యం నేపథ్యంలో మస్తాన్ రావు వైసీపీలోకి రావడం..జగన్ టీడీపీ నుంచి వచ్చినా కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ హామీ ఇవ్వడంతో నెరవేర్చారు.
Also Read: Janasena: జగన్ ప్రసంగం పది నిమిషాలు కూడా జనాలు వినడం లేదు
-ఆర్ కృష్ణయ్యకు అనూహ్యంగా చోటు
తెలంగాణకు చెందిన బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య వైసీపీ తరుఫున అసలు సంబంధాలే లేవు. పోయిన ఎన్నికల్లో ఆయన టీడీపీ తరుఫున తెలంగాణ సీఎం అభ్యర్థిగా కూడా ఎన్నికై పోటీచేశారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ బీసీ కోణంలో జగన్ ఇలా ఏకంగా రాజ్యసభకు పంపి ఆశ్చర్యపరించారు. మరో బీసీ నేత కిల్లి కృపారాణిని ఇవ్వాల్సిన సీటును పక్క రాష్ట్రం బీసీ నేతకు ఇవ్వడంపై వైసీపీ శ్రేణులే మల్లగుల్లాలు పడుతున్నాయి.
నిజానికి వైసీపీలో ఆశావహులకు కొదవలేదు. పోయిన ఎన్నికల్లో టాలీవుడ్ ను.. టీడీపీని కాదని వైసీపీకి మద్దతిచ్చి ప్రచారం చేశారు సీనియర్ నటుడు మోహన్ బాబు, కమెడియన్ అలీ. వీరిద్దరికీ రాజ్యసభ సీటు ఇవ్వొచ్చు. కానీ టాలీవుడ్ కు చెందిన తెలంగాణ లాయర్ కు ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వైసీపీ కోసం పాటు పడ్డ వారిని వదిలేసి స్వప్రయోజనాల ప్రతిపాదికన.. సంబంధం లేని వ్యక్తులకు జగన్ రాజ్యసభ కట్టబెట్టడంపై సొంత పార్టీలోనే అసమ్మతి సెగ రాజుకుంటోంది. ఇవే పదవులు.. ఇవేం కేటాయింపులు అని పెదవి విరుస్తున్న పరిస్థితి నెలకొంది.
పార్టీ కోసం ఆది నుంచి కష్టపడ్డ వారిని వదిలేసి టీడీపీ నుంచి వలసవచ్చిన బీద మస్తాన్ రావుకు, కేసుల్లో సహకరించిన లాయర్ కు, సంబంధం లేని బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు పదవులు కట్టబెట్టడమే ఇప్పుడు వైసీపీలో చిచ్చు రేపుతోంది. మోహన్ బాబు, అలీ సహా ఎంతో మంది పార్టీకోసం ప్రచారం చేసి కష్టపడిన నేతలున్నారు. వారందరినీ పక్కనపెట్టి వీరికి కేటాయించడమే ఇప్పుడు ఎవరూ జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది.
Also Read: R Krishnaiah: విఫల ప్రయోగాన్ని నమ్ముకున్న జగన్.. ఆర్.క్రిష్ణయ్య రాజ్యసభ ఎంపిక వెనుక కథా ఇదా?