TDP Senior Leaders: ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు సమీపిస్తోంది. కానీ ఈ నాలుగేళ్లలో చంద్రబాబు నుంచి టీడీపీ సీనియర్లు ఒక 50 మంది వరకూ ప్రభుత్వం చుక్కలు చూపించింది. కేసులు, జైళ్లు అంటూ నరకం చూపించింది. కొందరు తాజా మాజీ మంత్రులు, టీడీపీ యాక్టివ్ నేతలే టార్గెట్ గా ప్రభుత్వం వేట సాగించింది. చివరకు విజయనగరం రాజవంశీయుడు పూసపాటి అశోక్ గజపతిరాజును సైతం విడిచిపెట్టలేదు. తాను సీబీఐ కేసుల్లో జైలుకు వెళ్లడానికి చంద్రబాబు అండ్ కో ముఖ్య కారణమని జగన్ భావిస్తున్నారు. అందుకే ఒక పద్ధతి ప్రకారం టార్గెట్ చేసి కేసులు నమోదు చేయిస్తున్నారు. వారిపై కేసులు నిలబడవని తెలిసినా.. ఒకటి, రెండు రోజులైనా జైలు వాతావరణంతో ఇబ్బందిపడతారు కదా అన్న ఆలోచనతో సీఐడీ, పోలీసులను పురమాయించి మరీ వారిపై కేసుల దాడిని కొనసాగిస్తున్నారు.

దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు,అయ్యన్నపాత్రుడు, కళా వెంకటరావు, అశోక్ గజపతిరాజు, నారాయణ, పరచూరి అశోక్ బాబు ఇలా ఒకరేమిటి చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో కక్ష సాధింపులేని పాలన అందిస్తానని జగన్ చెప్పారు. దీంతో అందరూ సంతోషించారు. కానీ అక్కడ నుంచి తన ప్రతాపం చూపిస్తూ వచ్చిన జగన్ నే ఇతర వైసీపీ నాయకులు అనుసరించడం ప్రారంభించారు. ఏపీలో కక్షసాధింపు వ్యవహారం పరాకాష్టకు చేరింది. అయితే దీని వెనుక ఉన్నది మాత్రం జగన్. పురిగొల్పుతున్నది ఆయన పగ. పాత వైరాన్ని తిరగదోడుకొని మరీ జగన్ విధ్వంసకర ఆలోచనతో రాజకీయ ప్రత్యర్థులు, ముఖ్యంగా టీడీపీ సీనియర్లపై తన దాడి పరంపరను కొనసాగిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో పెండింగ్ లో ఉండిపోయిన నేతలను పని పట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత విమర్శలకు దిగే నాయకులను టార్గెట్ చేసుకుంటున్నారు. కనీసం ఒక్క ట్రీట్ మెంట్ అయినా ఇవ్వాలని భావిస్తున్నారు. తనను విభేదించిన సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజునే జగన్ విడిచిపెట్టలేదు. సీబీఐ కస్టడీలో రఘురాజుకు ఇచ్చిన ట్రీట్ మెంట్ ను ఎప్పడికప్పుడు తెలుసుకొని అగ్రనేత పైశాచిక ఆనందం పొందినట్టు బాధిత ఎంపీయే పలుసార్లు చెప్పారు. ఇప్పుడు అయ్యన్నది కూడా సేమ్ సిచ్యువేషన్. అయ్యన్నని కస్టడీలోకి తీసుకొని ఇబ్బందులు పెట్టి..ఆ దృశ్యాలను చూపించాలని ప్రభుత్వ పెద్దలు సీఐడీ అధికారులకు ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి.

రాజకీయంగా పవన్ టీడీపీకి దగ్గరవుతుండడంతో తెలుగు తమ్ముళ్లలో ఒకరకమైన జోష్ నెలకొంది. గెలుపుపై టీడీపీ నాయకులకు నమ్మకం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వారిలో స్థైర్యం పోగొట్టేందుకు జగన్ సర్కారు మైండ్ గేమ్ ప్రారంభించిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అందుకే ప్రభుత్వ పెద్దలు ఆ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఇప్పుడు సీఐడీ, పోలీసులను వాడడం ప్రారంభించారు. ఇప్పడు టీడీపీ సీనియర్లే ధ్యేయంగా ఏపీలో మరోసారి వేట ప్రారంభమైంది.