CM Jagan: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయదశమి నాటి నుంచి విశాఖ నుంచి పాలనకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేయడంతో పాటు మంత్రుల అధికారిక నివాసాలు, కార్యాలయాలను సైతం తరలించనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజకీయంగా నష్టం తప్పదని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఆ రెండు జిల్లాలపై ఇక వైసిపి ఆశలు వదులుకోవాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖను పాలన రాజధానిగా చేసి.. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధాని చేయాలన్నది జగన్ వ్యూహం. కానీ న్యాయస్థానంలో కేసులను అధిగమించలేక.. అడుగు ముందు పెట్టలేక నాలుగేళ్లు జాప్యం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏదో చేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అందుకే విశాఖ నుంచి పాలనను ప్రారంభించి ప్రత్యర్థుల నోటికి తాళాలు వేయాలని చూస్తున్నారు.
అయితే ఈ విషయంలో పక్కా వ్యూహంతో అడుగులు వేస్తేనే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో విశాఖ ఉంది. దానిని మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చేసి చూపిస్తే.. అందుకు సంబంధించి కొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో విజయవాడ-గుంటూరు,నెల్లూరు- తిరుపతి లను కలుపుతూ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించితే ప్రాంతీయ భావం సమస్య నుంచి జగన్ ముందడుగు వేయవచ్చు. ఎన్నికలకు ఆరు నెలల వ్యవధి ఉండడంతో ఈ నగరాల అభివృద్ధిపై ఫోకస్ పెడితే మూడు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుంది. అలాకాకుండా విశాఖలో మూడు రోజుల పాలన, అమరావతిలో మూడు రోజుల పాలన అంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు.
మరీ ముఖ్యంగా విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామంటే.. చాలా సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు సీఎం జగన్ నిర్ణయం పై ఆగ్రహంగా ఉంటారు. ఇప్పటికే అమరావతిని నిర్వీర్యం చేశారన్న కోపం వారిలో ఉంది. రాజకీయంగా వైసిపికి నష్టం తప్పదని అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామంటే వారు అగ్గి మీద గుగ్గిలం కావడం ఖాయం. అందుకే ఆ రెండు జిల్లాల్లో కీలక ప్రాజెక్టులు, గుంటూరు-కృష్ణా నగరాల అభివృద్ధిపై దృష్టి పెడితే వారి ఆగ్రహాన్ని తగ్గించవచ్చు. అయితే అదే సమయంలో సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖలో పెట్టడాన్ని సాగర నగరవాసులు లైట్ తీసుకుంటున్నారు. స్వాగతించడం లేదు.. అలాగని వ్యతిరేకించడం లేదు. లోలోపల మాత్రం నగర ప్రశాంతత కనుమరుగవుతుందని.. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని.. ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More