Movie Ticket Rates:ఎంత లొల్లి జరిగినా.. ఎంత మంది విమర్శలు చేసినా ఏపీ సీఎం జగన్ మాత్రం ‘తగ్గేదేలే’ అంటున్నాడు. సినిమా టికెట్ రేట్ల తగ్గింపు విషయంలో వెనక్కి తగ్గనంటున్నాడు. ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంలో తెలుగు సినీ పరిశ్రమ తీవ్రస్థాయిలో లాబీయింగ్ చేస్తున్నప్పటికీ టిక్కెట్ రేట్లను తగ్గించకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సినిమా టిక్కెట్లపై సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం.. సామాన్య ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సినిమా టిక్కెట్ ధరలను నియంత్రించాలన్న నిర్ణయాన్ని గట్టిగా సమర్థించింది. ప్రభుత్వ పిటిషన్‌ను స్వీకరించిన డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సినిమా టికెట్ ధరల విషయంలో ప్రభుత్వ విధానంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అఫిడవిట్ దాఖలు చేసేందుకు అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ కొంత సమయం కోరగా, ఫిబ్రవరి 10లోగా దాఖలు చేసేందుకు హైకోర్టు ఆయనకు సమయం ఇచ్చింది.
థియేటర్ల లైసెన్సులు రెన్యూవల్ చేసుకోవాలని, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్‌తో సహా అన్ని అనుమతులు నెల రోజుల్లో పొందాలని జగన్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అయితే కీలకమైన సినిమా టిక్కెట్ ధరలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం వ్యవహారాలు) కుమార్ విశ్వజిత్ నేతృత్వంలోని అధికారిక కమిటీ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, థియేటర్ యజమానులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి సినిమా టిక్కెట్లపై వారి సూచనలను పొందింది. అయితే ఇప్పటివరకు కమిటీ నుంచి టికెట్ రేట్లపై ఎలాంటి సానుకూల సూచనలు లేవు.
ఎగ్జిబిటర్లు హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంటే తప్ప, సినిమా టిక్కెట్ల రేట్లలో లొంగకూడదనే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. “న్యాయ పోరాటం కొనసాగుతున్నంత కాలం, సినిమా టిక్కెట్ల ధరలపై ఎలాంటి ఉపశమనమూ ఉండదు” అని జగన్ డిసైడ్ అయినట్టు సమాచారం. దీంతో టాలీవుడ్ కు జగన్ నిర్ణయం శరాఘాతంగా మారనుంది.