Jal Jeevan Mission AP: దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరే వేరు. ఈ విషయం చాలా సందర్భాల్లో తేలింది. మూడు రాజధానుల నిర్ణయం వెలువడినప్పుడే మిగతా రాష్ట్రాలకు ఏపీ భిన్నమని సంకేతాలు ఇచ్చారు. ఈ అంశం ఇబ్బందికరమైనా మొండిగా ముందుకు పోయారు. రాజధాని లేని రాష్ట్రంగా ఇండియా పటంలో నిలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్,పోలవరం వంటి విషయాల్లో కూడా ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబెట్టలేకపోయారు. విభజన హామీలు సాధించలేక చతికిల పడ్డారు. ఇప్పుడు జలజీవన్ మిషన్లోనూ అదే పరిస్థితి.
ప్రతి కుటుంబానికి శుద్ధ జలాల అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకుగాను ప్రతి ఇంట కులాయి ఏర్పాటు చేయాలన్నది సంకల్పం. కుటుంబం లో ఒక్కొక్కరికీ 50 లీటర్లచొప్పున నీటిని అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం ముద్ర వేసినా.. ఒకే ఒక రాష్ట్రం మాత్రం ఇప్పటివరకు కిమ్మనకుండా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్. నలుగురికి నచ్చింది నాకసలే నచ్చదులే అన్నట్టు జగన్ వ్యవహార శైలి ఉంటుంది. ఇప్పుడు జలజీవన్ మిషన్ పథకంలోనూ అదే పరిస్థితి. అసలు శుద్ధ జలాలు అవసరం లేదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉంది. ఈ పథకానికి సంబంధించి ఇంతవరకు సమ్మతి తెలియజేయలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా తెలియజేసింది. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పార్లమెంట్లో ఏపీ ప్రభుత్వ వైఖరి పై కేంద్రమంత్రి షెకావత్ అక్షేపించారు. ప్రజల దయనీయ పరిస్థితి పై ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి ముందుకు వచ్చినా ఏపీ ప్రభుత్వం మాత్రం ముందుకు రాకపోవడానికి అనే కారణాలు ఉన్నాయి. ఈ పథకం అమలు కావాలంటే మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు కత్తిమీద సాము. అందుకే వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది.
2050 నాటికి దేశవ్యాప్తంగా ప్రజలకు శుద్ధ నీరు అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకుగాను ఇంటింటికి కులాయి పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ మహత్తర ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కీలకం. కేంద్రం నుంచి ప్రతిపాదన వెళ్లిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. అయితే ఏపీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విచారకరం. ప్రజలకు పదికాలాలపాటు ఉపయోగపడే పథకాలకు ఏపీలో చోటు లేదు. బటన్ నొక్కుడు సంక్షేమ పథకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం బాధాకారం. ఇటువంటి అరుదైన అవకాశాన్ని వదులుకున్న జగన్ సర్కార్ ఏదో ఒక రోజు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిందే.