AP Employees Strike: ఏపీ ప్రభుత్వం తగ్గేదేలే అంటోంది. ఉద్యోగుల సమ్మెపై పునరాలోచించుకోవాలని.. లేదంటే మీకే రిస్క్ అంటూ వార్నింగ్ లు కూడా ఇస్తోంది. ఉద్యోగుల విషయంలో మెత్తగా ఉండమని స్పష్టమైన సంకేతాలిచ్చింది. చర్చలతోనే సమస్య పరిష్కారం అవుతుంది తప్పిదే మొండిగా వెళితే కష్టాలు తప్పవని పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. ఉద్యోగులు చర్చలకు రాకుంటే కష్టమని స్పష్టం చేసింది. మొండి పట్టుదలకు పోతే ఉపయోగం లేదని కుండబద్దలు కొట్టింది. చర్చలకు రమ్మంటే అలుసుగా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇవాళ కూడా కొన్ని సంఘాలు చర్చలకు వచ్చాయని వివరించారు. మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చుంటామంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. గతంలో కంటే ఎక్కువగా పీఆర్సీ ఇచ్చామని తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జీతాలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనేది పే స్లిప్ చూసుకోవాలని సూచించారు. ఉద్యోగుల జీతాల్లో ఒక్క రూపాయి కూడా తగ్గదని స్పష్టం చేస్తోంది.
ఉద్యోగ సంఘాలకు , ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ చర్చలకు చివరి అవకాశాలు ఇచ్చింది. ఘర్షణ వాతావరణం వద్దు.. చర్చలకు రావాలని కోరుతున్నామని వెల్లడించారు. ఉద్యోగులు ఎప్పుడు వస్తామంటే అప్పుడు చర్చలకు సిద్ధమని స్పష్టం చేసింది.
ఇక ఉద్యోగ సంఘాల తీరుపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారని.. మంత్రులనే ఎదురుచూయించేలా చేస్తున్న తీరుపై గుర్రుగా ఉంది. ఇకపై రోజూ వచ్చి సచివాలయంలో ఎదురుచూడమని.. ఉద్యోగ సంఘాలు పిలిస్తేనే చర్చలకు వస్తామని మంత్రి సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఇక జీతాల విషయంలో జరుగుతున్న రచ్చకు ఏపీ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి వేతనాలు ఇస్తున్నట్టు పేర్కొంది.. ఉద్యోగుల ఆందోళన, సంఘాల నేతల మూడు డిమాండ్లను సంబంధం లేదన్నారు. హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని సంఘాల నేతలు ప్రస్తావించకపోవడంపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేది. వేతనాల బిల్లులు చేయకుండా డీడీవోలను అడ్డుకుంటున్న తీరుపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది.
మొత్తంగా ఉద్యోగుల విషయంలో మెతక వైఖరి కంటే.. కాస్త సీరియస్ గానే ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎవరినీ ఉపేక్షించేది లేదని కొత్త జీతాలు ఇచ్చి వారిని దారికి తేవాలని యోచిస్తోంది. కానీ ఉద్యోగులు మాత్రం ఎట్ట పరిస్థితుల్లో ప్రభుత్వం నిబంధనలకు తలొగ్గేది లేదని పట్టుదలగా ఉంది.