Dalits in AP: వైసీపీ ఆవిర్భావం నుంచి దళితులు అండగా నిలుస్తూ వచ్చారు. పార్టీని అక్కున చేర్చుకున్నారు. గడిచిన ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు దోహదపడ్డారు. 175 నియోజకవర్గాలకుగాను.. ఎస్సీ నియోజకవర్గాల్లో ఏకపక్ష విజయాన్ని అందించారు. మిగతా నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపులో ప్రధాన భూమిక వహించారు. అటువంటి దళితులకు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత దారుణంగా వంచించారు. ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దు పద్దుల్లోకి చేర్చారు.వారి స్కీములన్ని నవరత్నాల్లో సర్దేశారు. మిగతా వర్గాలకు చేసిన ఖర్చుల్లోనే ఎస్సీలకు చేస్తున్న వ్యయాన్ని చూపించారు.ఎస్సీ కార్పొరేషన్ ను మూడు ముక్కలు చేశారు. నిధులు, కేటాయింపులు లేకుండా చేశారు. విదేశీ విద్య, భూమి కొనుగోలు, విద్యోన్నతి పథకాలకు మంగళం పాడేశారు. ఎస్సీలు సొంత కాళ్లపై నిలబడకుండా బందించేశారు.వారికి అప్పటి వరకూ అందుతున్న పథకాలను పాతర వేశారు. దళితులకు తీరని ద్రోహం చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి అందించే అనేక పథకాల నిధులను దారి మళ్లించేశారు. తాను దళిత పక్షపాతినంటూ చేసిన ప్రకటనలకు.. వాస్తవ పరిస్థతికి పొంతన లేకుండా చేశారు. దళితులు తనపై ఉంచిన నమ్మకాన్ని వంచించారు. వారిని అన్నివిధాలా దారుణంగా మోసం చేశారు.
మూడేళ్ల తరువాత..
అయితే మూడేళ్లు గడిచిన తరువాత కానీ దళితులకు తత్వం బోధపడలేదు. తాము నిండా మోసపోయామని గుర్తించిన దళితులు రోడ్లుపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితిని జగన్ కల్పించారు. అయితే ఈ పరిణామాలపై కనీసం స్పందించడానికి దళిత పెద్దలు, మేథావులు ముందుకు రాకపోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. జగన్ రాజకీయ ఉన్నతికి కారణమైన తమను పక్కన పడేయ్యడంపై ఎస్సీ, ఎస్టీలు ఆగ్రహంతో ఉన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారు తీరుపై విసుగు చెందిన దళితులు ఎట్టకేలకు పోరాట బాట పట్టారు. తాజాగా మాజీ జడ్జి, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ విజయవాడలో నిరసన దీక్షకు దిగారు.కానీ దళిత హక్కుల పోరాట నాయకులుగా తమకు తాము చెప్పుకున్న నాయకులు ముఖం చాటేయ్యడం చర్చనీయాంశంగా మారుతోంది.
Also Read: Killi Krupa Rani: ఆ కేంద్ర మాజీ మంత్రి చూపు టీడీపీ వైపు.. అసలేం జరిగిందంటే..
ఒక్క పథకం లేదు..
గత మూడేళ్లుగా దళితుల కోసం ఎటువంటి ప్రత్యేక సంక్షేమ పథకాలంటూ ఏమీ ప్రకటించలేదు. అమలుచేసిన దాఖలాలు లేవు. కానీ వైసీపీ సర్కారు మాత్రం 26 వేల కోట్లు ఖర్చుచేసినట్టు ఆర్భాటంగా ప్రకటించింది. జగన్ దళిత జనోద్ధారకుడు అంటూ వైసీపీ మంత్రుల నుంచి దిగువస్థాయి నేతల వరకూ చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో నిజమెంత అని గణాంకాలను అడుగుతుంటే మారు సమాధానం చెప్పేవారు లేకపోతున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాలంలో దళితులకు ప్రత్యేకంగా పథకాలేవీ లేవు. స్వయం ఉపాధి, రాయితీ రుణాల మాటే లేదు. నవరత్నాల్లో దళిత లబ్ధిదారుల జాబితాను వడబోసి.. వారికి వివిధ పథకాల కింద ఇచ్చిన మొత్తాన్ని లెక్కకట్టి రూ.26 వేల కోట్లుగా చూపుతున్నారు. దీనిని మరుగునపడేసి కేవలం దళితుల కోసమే ఖర్చుచేసినట్టు మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. మరోసారి దళితులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
కార్పొరేషన్ మూడు ముక్కలు..
గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ఉండేది. దీనికి బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులుండేవి. దాదాపు ఏడాదికి రూ.400 కోట్లు కేటాయించేవారు. ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాల కోసం ఈ మొత్తాన్ని కేటాయించేవారు. దాదాపు 60 శాతం రుణాల్లో రాయితీ కల్పించేవారు. ఎవరి అభిరుచులకు తగ్గట్టు ఆయా రంగాల్లో స్వయం ఉపాధి పథకాలను మంజూరు చేసేవారు. తద్వారా నిరుద్యోగ యువత తమ కాళ్లపై తాము నిలబడేవారు. ఆర్థిక ప్రమాణాలు పెంచుకుంటూ పోయేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాయితీ రుణ పథకాలకు మంగళం పాడేసింది. అసలు ఎస్సీ కార్పొరేషన్ ను మూడు ముక్కలు చేసింది. మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్లుగా విభజించింది. వాటివి నామినేటెడ్ ప్రతిపాదికన కార్యవర్గాలను నియమించింది. కానీ నిధులు కేటాయింపులు మాత్రం చేయలేదు. నవరత్నాలు ఇస్తున్నాం కదా వాటితోనే సరిపెట్టుకోండి అంటూ కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎదో తూతూమంత్రంగా కార్పొరేషన్ల నిర్వహణకు అన్నట్టు గత మూడేళ్లుగా కేటాయింపులు చేసింది. 2019, 20 లో రూ.79 లక్షలు, 2020,21లో రూ.20 లక్షలు, 2021,22లో రూ.30 లక్షలు కేటాయించారు. అయితే ఈ డబ్బులు ఎలా ఖర్చు చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకొచ్చింది గొడవ అంటూ ఖర్చు పెట్టకుండా విడిచిపెట్టారు.
ఆ అవకాశాలకు చెక్..
చాలా మంది దళిత విద్యార్థులకు చదువుకోవాలనుకున్న ఆర్థిక స్థోమత ఉండదు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినా ఉన్నత చదువులకు కుటుంబ పరిస్థితులు అనుకూలించవు. ఇటువంటి వారి గుర్తించి గత ప్రభుత్వాలు ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ పేరిట కార్పొరేట్ స్కూళ్లలో చేర్పించేవి. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి ఉచితంగా కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించి విద్యాబుద్ధులు అందించేవారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కాలేజీల విధానానికి స్వస్తి పలికింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కాలేజీలకు సంబంధించి నిధుల్లో కోత పెట్టింది. మూడేళ్లుగా వారికి సంబంధించి మెనూ బిల్లుల చెల్లింపులు కూడా సక్రమంగా చేయడం లేదు. కాస్మెటిక్ చార్జీలు సైతం చెల్లించడం లేదు.
విదేశీ విద్యకు మంగళం..
ఎస్సీ విద్యార్థులకు అందించే విదేశీ విద్య కూడా మంగళం పాడింది. అంబేడ్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీము కింద గత ప్రభుత్వాలు పేద ఎస్సీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించాయి. విదేశాల్లోని ప్రముఖ యూనివర్సీటీల్లో సీటు దక్కించుకన్న ఎస్సీ విద్యార్థులకు తొలి ఏడాది రూ.15 లక్షలు అందించేవి. జగన్ అదికారంలోకి వచ్చిన తరువాత పథకం అటకెక్కింది. గత మూడేళ్లుగా అసెంబ్లీ వేదికగా ప్రకటనలైతే మిగులుతున్నాయి తప్ప కార్యరూపం దాల్చిన పరిస్థితి లేదు. విద్యోన్నతి పథకానిది అదే తీరు. వివిధ పోటీ పరీక్షలకుగాను ఎస్సీ విద్యార్థులను సన్నద్ధం చేయడమే పథకం ముఖ్య ఉద్దేశ్యం. అటు ఉచిత వసతి, భోజనం కల్పిస్తూనే బెస్ట్ కోచింగ్ సెంటర్లలో ఉచితంగా శిక్షణ ఇప్పించేవారు.దానిని రద్దుచేశారు. అధికారికంగా నిర్వహిస్తున్న ఏపీ స్టడీ సర్కిల్ కు సైతం నిధులను నిలిపివేశారు. మరోవైపు అమరావతిలోని అంబేడ్కర్ స్మృతివనం పనులను సైతం నిలిపివేశారు. టీడీపీ ప్రభుత్వం 96 కోట్ల రూపాయలతో సువిశాల ప్రాంగణంలో రూపొందిన వనం పనులు దాదాపు 25 శాతం పూర్తయ్యాయి. కానీ వైసీపీ సర్కారు మాత్రం ఆ పనులు నిలిపివేసింది. కనీసం దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు.
నోరు మెదపని మేధావులు..
దళితులకు ఇంత దగా జరుగుతున్నా సంఘ నాయకులు, దళిత మేధావులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత ప్రభుత్వ హయాలంలో చిన్నపాటి వైఫల్యాలు వెలుగుచూసినా ఇట్టే స్పందించేవారు. అటువంటి వారు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కనీసం ఒక ప్రెస్ నోట్ విడుదల చేయలేని దయనీయస్థితిలో ఉన్నారు. ఇటువంటి నాయకుల్లో కొందరికి వైసీపీ ప్రభుత్వం నామినేట్ పోస్టులను కట్టబెట్టింది. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఒకరిద్దరు నాయకులు స్పందిస్తున్నా ప్రభుత్వం కేసుల రూపంలో ఉక్కుపాదం మోపుతోంది. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెన్నంటి నడిచిన దళితులు మాత్రం ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read:Odisha CM Naveen Patnaik: అంతటి నవీన్ పట్నాయక్ కంటతడి పెట్టారు.. అసలు కారణమేంటి?