
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దింతో లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచనలో జగన్ సర్కార్ సిద్ధంగా లేదు. అయితే లాక్ డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న పలు వర్గాలను ఆదుకోవాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం… ఈ క్రమంలో ఇప్పటికే పేదలకు ఉచిత రేషన్ బియ్యంతో పాటు ఒక్కో కుటుంబానికి ₹.1000 ఇస్తున్న విషయం తెలిసిందే.. అదేవిధంగా అర్చకులను ఆదుకునేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న దేవాలయాలలో పనిచేసే అర్చకుల కోసం ఒక్కొక్కరికి ₹.5000 గ్రాంటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఏప్రిల్ 14 వరకు దేవాలయాలలో భక్తులకు అనుమతి నిరాకరించడం జరిగింది. కేవలం అర్చకులు మాత్రమే నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. చిన్న దేవాలయాలలో అర్చకులు ఎటువంటి ఆదాయ వనరులు లేని కారణంగా అర్చకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీంతో వారికి “ధూప దీప నైవేద్యం” మరియు “అర్చక వెల్ఫేర్ ఫండ్” ద్వారా 2800 పైగా అర్చకులకు లబ్ది చేకూరుతుంది. ఈ రెండు పథకాల్లో లేని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2500 మంది దాకా ఉంటారని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. వారిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ ప్రతిపాదన చేశామని ఆయన తెలిపారు. ఏ పథకం క్రింద లబ్దిచేకూరని అర్చకులకు “అర్చక వెల్ఫేర్ ఫండ్” ద్వారా ఒక్కొక్కరికి ₹. 5000 గ్రాంటు మంజూరు చేయబడుతుందని ఆయన వివరించారు. దీని వల్ల ప్రభుత్వంపై కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు.