CM Jagan: సీఎం జగన్ వెనక్కి తగ్గారు. సీనియర్ల ఒత్తిడికి తలొగ్గారు. వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైసీపీలో చాలామంది సీనియర్లు ఈ ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని జగన్ వద్ద ప్రస్తావించారు. చేస్తే మీరే పోటీ చేయండి.. మీ వారసులకు మాత్రం టికెట్లు ఇవ్వను.. అవసరమైతే ప్రత్యామ్నాయ నేతలను చూసుకుంటానని జగన్ అప్పట్లో చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అభ్యర్థుల ప్రకటనలో వారసులకు టికెట్లు కేటాయించడం విశేషం.అయితే ఇందులో కొంతమందికి మాత్రమే ఛాన్స్ లభించినట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 మంది తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుతూ వచ్చారు. అయితే వారసులకు టిక్కెట్లు ఇస్తే గెలుపుపై ప్రభావం చూపుతుందని జగన్ వారికి నో చెప్పారు. టిక్కెట్లు ఇచ్చేందుకు సమ్మతించలేదు. పేర్ని నాని లాంటి వాళ్లు ఓ సమావేశంలో సైతం ఇదే ప్రస్తావించగా జగన్ నుంచి అభ్యంతరం వ్యక్తం అయ్యింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు చాలామంది నేతలు తమ వారసులను రాజకీయాల్లో తేవాలని భావించారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా తమ వెంట తిప్పుకున్న వారు ఉన్నారు. అయితే అధినేత జగన్ ఒప్పుకోకపోయేసరికి ఒక రకమైన ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు తాజా మార్పులలో నలుగురు వారసులకు టిక్కెట్ ఇవ్వడం విశేషం.
తిరుపతి నియోజకవర్గానికి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి, చంద్రగిరి నియోజకవర్గానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి, మచిలీపట్నం నియోజకవర్గానికి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుకు, రామచంద్రపురం నియోజకవర్గానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ కు టికెట్ ఖరారు చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాకు నియమించడం విశేషం.
అయితే ఇంకా చాలామంది నేతలు తమ వారసులను ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణ దాసు, తమ్మినేని సీతారాంతో పాటు చాలామంది నాయకులు తమ మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ కుమారులను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధినేతకు విన్నవించారు. కానీ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పుడు అయిదుగు నేతల వారసులకు టికెట్లు ఇవ్వడంతో.. అధినేత పై మిగతావారు ఒత్తిడి పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతేమారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ సైతం వారసులకు టిక్కెట్లు ఇచ్చేందుకు ముందుకు రావడం గమనార్హం.