Jagan Follows BJP: ఏపీ సీఎం జగన్ రాజకీయ రణతంత్రంలో ఆరితేరిపోయారు. దశాబ్దాలుగా తన కుటుంబం రాజకీయాల్లో ఉండడంతో సహజంగానే ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొని ఉంటారు. తండ్రి చాటు బిడ్డగానే ఉంటూ రాజకీయ అరంగేట్రం చేసిన జగన్ అనతికాలంలోనే ఎదిగారు. తండ్రి మరణంతో ఎత్తూ పల్లాలను చూశారు. చివరకు జైలు జీవితం అనుభవించారు. చిన్న వయసులోనే దేశంలో ఎవరూ ఎదుర్కోని బలమైన అవినీతి కేసుల్లో ప్రథమ స్థాయి ముద్దాయిగా ఉన్నారు. అయితే ఇవన్నీ అధిగమించే అంతులేని విజయాన్ని అందుకొని ఏపీ పీఠంపై కూర్చొన్నారు. అయితే ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు.. ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కితే ఆయన పొలిటికల్ లైఫ్, పర్సనల్ లైఫ్ సేఫ్ గా ఉంటుంది… పొరపాటున ఓడితే మాత్రం ఊహకందని పరిణామాలు ఆయన్ను చుట్టిముట్టడం ఖాయమని ఆయనకూ తెలుసు. అందుకే విపక్షాలకూ ఏ చాన్స్ వదులుదలచుకోలేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలన కంటే పార్టీపైనే ఎక్కువగా ఫోకస్ పెంచారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ పోల్ మేనేజ్ మెంట్ నే నమ్ముకున్నారు. అందుకే మూడెంచల విధానానికి మొగ్గుచూపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. వారిపై మరో ముగ్గరు పార్టీ మనుషులను పర్యవేక్షణకు నియమించనున్నారు. వారికి ముచ్చటగా గృహసారధులుగా నామకరణం చేశారు. ప్రతీ 50 కుటుంబాలకు ముగ్గురు గృహసారధులను నియమించి వారి ద్వారా పోల్ మేనేజ్ మెంట్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఈ లెక్కన వలంటర్లతో కలిసి 5.50 లక్షల మంది సుశిక్షితులైన వైసీపీ ప్రతినిధులను తయారుచేసి ప్రజలపై నిఘా పెట్టాలన్నదే జగన్ వ్యూహం. అయితే జగన్ తాజా వ్యూహం వెనుక ప్రేరణ మాత్రం భారతీయ జనతా పార్టీ. అనతికాలంలో బీజేపీ పట్టు సాధించడం, దేశ వ్యాప్తంగా విస్తరణ వెనుక మోదీ, షా ద్వయం అనుసరించిన వ్యూహాలే కారణం. అందుకే ఆ ద్వయం వ్యూహాలను తానూ అమలు చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు.
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ అధికారం నిలబెట్టుకోవడంలో ఒక ప్లాన్ బాగా వర్కవుట్ అయ్యింది. అదే ‘పన్నా ప్రముఖ్’. ఎన్నికల వ్యూహకర్తల సలహా మేరకు పన్నా ప్రముఖ్ ను బీజేపీ నేతలు తెరపైకి తెచ్చారు. ఓటర్లతో మమేకమై వైట్ వాష్ చేయడం వీరి పని. నిత్యం ప్రజలతో టచ్ లో ఉంటూ ప్రభుత్వ పట్ల సానుకూలంగా మార్చడం వీరి ప్రధాన లక్ష్యం. గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అంతులేని విజయం వెనుక పన్నా ప్రముఖ్ పాత్ర ఉందని విశ్లేషణలు సైతం వచ్చాయి. వీరి నియామకం అంతిమ లక్ష్యం పోలింగ్ రోజు కేంద్రానికి తెచ్చి ప్రభుత్వానికి సానుకూలంగా ఓటు వేయించడం. పన్నా ప్రముఖ్ లో భాగంగా పార్టీ విధేయులను వలంటీర్లుగా నియమించుకున్న బీజేపీ తన అధికారాన్ని పదిలంచేసుకుంది. మిగతా రాష్ట్రాలకు విస్తరించే పనిలో ఉంది. దానిని గ్రహించిన జగన్ స్పూర్తిగా తీసుకొని పన్నా ప్రముఖ్ మాదిరిగా వలంటీరు వ్యవస్థను విస్తరించే పనిలో పడ్డారు.

ఇప్పుడు ఏపీ సర్కారు అయితే ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. వైసీపీ నేతలు మాత్రం కొంత పోగేసుకున్నారు. ఇటువంటి వారి సాయం తీసుకునే జగన్ గృహసారథుల వ్యవస్థను ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారు. ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్న నిఘాసంస్థల హెచ్చరికలతోనే జగన్ అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలను క్షేత్రస్థాయిలో శాంతింపజేసి సానుకూలంగా మార్చడానికి గృహ సారథుల వ్యవస్థ దోహదపడుతుందని నమ్ముతున్నారు. అందుకే దీనికి ఎంత ఖర్చయినా వెనుకడుగు వేయడం లేదు. ఎలాగోలా 14 నెలల పాటు నిధులు సమీకరించి గృహ సారథుల వ్యవస్థను నడిపించగలిగితే వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయన్న నమ్మకంతో మాత్రం పనిచేస్తున్నారు.