B L Santosh- CM KCR: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను కేంద్ర ప్రభుత్వం కార్నర్ చేస్తే.. నా బిడ్డను ఆగమాగం చేస్తారా అని కెసిఆర్ రంకెలు వేశాడు. వెంటనే మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసు తెరపైకి వచ్చింది. దీంతో తన కడుపు మంటను చల్లార్చుకునేందుకు ఈసారి ఏకంగా కేంద్ర పెద్దలపై కేసీఆర్ విల్లు ఎక్కుపెట్టాడు. బిజెపిలో నెంబర్ త్రీగా కొనసాగుతున్న బిఎల్ సంతోష్ ను కార్నర్ చేశాడు. దీని ద్వారా ప్రధాన మోడీకి నాతో పెట్టుకుంటే జాగ్రత్త అనే సంకేతాలు ఇచ్చాడు. కానీ ఏదో నన్ను అరెస్టు చేసే ప్రమాదం అనుకొని బి ఎల్ సంతోష్ కూడా వెంటనే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో సిట్ జారీ చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. దీనిని హైకోర్టులో సవాల్ చేస్తూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇంకా వాదనలు ఒక కొలిక్కి రాలేదు. పైగా ఆ మధ్య సిట్ అధికారులు బిఎల్ సంతోష్ కు నోటీసులు పంపించారు. అని ఆయన విచారణకు హాజరుకాకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.

ఇప్పుడు తెలంగాణకు వస్తున్నారు
సిట్ నోటీసులు దాఖలు చేసిన తర్వాత బి ఎల్ సంతోష్ ను అరెస్టు చేస్తారని ప్రచారం సాగింది. ఆ తర్వాత ఈ కేసులో బిజెపి నెంబర్ 2 అమిత్ షా కు కూడా నోటీసులు ఇస్తారని సిట్ అధికారులు మీడియాకు లీకులు ఇచ్చారు..కానీ అలా జరగలేదు.. అయితే ప్రస్తుతం బిఎల్ సంతోష్ డిసెంబర్ 28, 29 తేదీలలో హైదరాబాద్ రానున్నారు.. రెండు రోజులపాటు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాల పూర్తి స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా , సునీల్ బన్సల్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లోని 60 లోక్ సభ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రచార శైలిపై నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఇంతవరకు నోటీసులో ఇవ్వలేదు
మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో బిఎల్ సంతోష్ ను కార్నర్ చేయాలని పదేపదే ప్రయత్నించిన సిట్ అధికారుల పప్పులు ఎక్కడ కూడా ఉడకలేదు. పైగా ఆయనకు నోటీసులు ఈ_మెయిల్ ద్వారా పంపించారు. అయితే ఈ లెక్కన ఆయనకు నోటీసులు అందలేదని తెలుస్తోంది.. అయితే ఈ కేసులో అంత పస లేకపోవడంతో బిఎల్ సంతోష్ కూడా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.. అయితే ఈ కేసులో ఇంకా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేసు దర్యాప్తు చేసే అధికారం లేదని ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై సిట్ హైకోర్టుకు వెళ్ళింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.. ఒకవేళ హైకోర్టు కనుక ఏసీబీ కోర్టు తీర్పును సమర్థిస్తే అప్పుడు సిట్ చేసేది ఏమీ ఉండదు. ఇది ఒక రకంగా టిఆర్ఎస్ తాను చేసిన తప్పును ఒప్పుకున్నట్టే అవుతుంది.
కారణం వేరే ఉందా
బి ఎల్ సంతోష్ తెలంగాణకు రావడం వెనుక కారణం వేరే ఉంది.. పేరుకు శిక్షణ కార్యక్రమం అని చెబుతున్నప్పటికీ… తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లే అవకాశం ఉండడంతో, అందుకు అనుగుణంగా పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశంతో ఆయన వస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బిజెపి కీలక నాయకులు తెలంగాణపై మరింత ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకుగాను బి ఆర్ ఎస్ ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో… బిజెపి పెద్దల తెలంగాణ రాక మరింత ఆసక్తి రేపుతోంది. అయితే హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే సిట్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అయితే మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.